సర్కార్ బడి టీచర్లకు రేవంత్‌ సర్కార్ హెచ్చరిక.. ఇకపై ఆ పప్పులుడకవ్!

రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నానాటికీ దిగజారుతుంది. ఇప్పటికే ఒక్క విద్యార్ధి కూడా లేని ప్రభుత్వ బడులు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు సర్కార్‌ బడుల్లో విధులు నిర్వహించే కొందరు టీచర్లు వేళాపాళా లేకుండా ఇష్టారీతిన సెలవులు పెట్టడంపై..

సర్కార్ బడి టీచర్లకు రేవంత్‌ సర్కార్ హెచ్చరిక.. ఇకపై ఆ పప్పులుడకవ్!
Telangana Government Warns School Teachers

Updated on: Dec 22, 2025 | 6:09 PM

హైదరాబాద్‌, డిసెంబర్‌ 22: తెలంగాణ రాష్ట్రంలో ప్రభుత్వ పాఠశాలల్లో విద్యా నానాటికీ దిగజారుతుంది. ఇప్పటికే ఒక్క విద్యార్ధి కూడా లేని ప్రభుత్వ బడులు తెలంగాణలోనే అధికంగా ఉన్నట్లు నివేదికలు పేర్కొంటున్నాయి. మరోవైపు సర్కార్‌ బడుల్లో విధులు నిర్వహించే కొందరు టీచర్లు వేళాపాళా లేకుండా ఇష్టారీతిన సెలవులు పెట్టడంపై రేవంత్‌ సర్కార్‌ కీలక చర్యలకు ఉపక్రమించింది. ఇకపై టీచర్లు చెప్పా పెట్టకుండా విధులకు నెల రోజులపాటు వరుసగా గైర్హాజరైతే వారి ఉద్యోగం శాశ్వతంగా తొలగించాలని పాఠశాల విద్యాశాఖ నిర్ణయించింది. ఈ మేరకు రాష్ట్ర పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌ నవీన్‌ నికోలస్‌ ప్రకటన జారీ చేశారు. సర్కార్ బడుల్లోని ఎఫ్‌ఆర్‌ఎస్‌, మధ్యాహ్న భోజనం అమలు వంటి విషయాలపై డీఈఓలతో తాజాగా ఆన్‌లైన్‌లో సమీక్షించారు.

ఎఫ్‌ఆర్‌ఎస్‌ ద్వారా ఏయే స్కూళ్లలో ఉపాధ్యాయుల హాజరు ఎంత శాతం ఉందో తెలుసుకునే వెసులుబాటు ఉంది. ఈ వివరాలు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్నందున వాటిపై డీఈవోలు తరచూ సమీక్షించాలని విద్యాశాఖ ఆదేశించింది. ఉపాధ్యాయులు నెలరోజులపాటు ఎలాంటి అనుమతి లేకుండా విధులకు హాజరు కాకుంటే షోకాజ్‌ నోటీసు జారీ చేయాలని, విచారణలో రుజువైతే ఉద్యోగం నుంచి తొలగిస్తున్నట్లు గెజిట్‌లో ప్రచురించాలని డీఈఓలకు సూచించారు. ఒక రోజు అనధికారికంగా స్కూల్‌కి రాకున్నా ఇదే విధంగా చర్యలు తీసుకోవచ్చు. అయితే అకస్మాత్తు అనారోగ్యం, రోడ్డు ప్రమాదం వంటి సాకులతో కోర్టుల్లో కేసులు వేసే అవకాశం ఉన్నందున నెల రోజులు అనధికారిక సెలవు పెడితే షోకాజ్‌ నోటీసులు ఇవ్వాలని తెలిపారు.

కాగా గత ఆగస్టు నుంచి ఎఫ్‌ఆర్‌ఎస్‌ అమల్లోకి రావడంతో టీచర్లు వచ్చిన, వెళ్లిన సమయం నమోదవుతోంది. అయితే టీచర్స్ టైమింగ్స్‌పై అధికారులు పెద్దగా పట్టించుకోవడం లేదు. కేవలం విధులకు హాజరయ్యారా? లేదా? అన్నదే పరిగణనలోకి తీసుకుంటున్నారు. ఇకపై టీచర్ల ఆలస్యంపై కూడా దృష్టి సారిస్తామని అధికారులు చెబుతున్నారు. మరోవైపు యేటా కొందరు టీచర్లు దీర్ఘకాలిక సెలవులపై వెళ్తుంటారు. 6 నెలలని అనుమతి తీసుకొని రెండేళ్లైనా విధులకు రావడం లేదు. అలాంటి వారిని గత రెండేళ్లలో సుమారు 50 మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు విద్యాశాఖ తెలిపింది. కనీసం సెలవులను పొడిగించుకుంటామని కూడా సమాచారం ఇవ్వడం లేదని, ఇలా దీర్ఘకాలికంగా విధులకు హాజరు కానివారిని కూడా తొలగించాలని సూచించారు. కాగా ప్రస్తుతం రాష్ట్ర వ్యాప్తంగా దాదాపు 24 వేల పాఠశాలల్లో సుమారు 1.15 లక్షల మంది టీచర్లు విధులు నిర్వహిస్తున్నారు.

ఇవి కూడా చదవండి

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.