Tata Consultancy Services: దేశంలో దిగ్గజ టెక్ కంపెనీ, టాటా గ్రూప్ సంస్థ.. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ను షేక్ చేసిన బ్రైబ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణంలో కీలక విషయాలు వెలుగులోకి వచ్చాయి. దేశంలోనే అతిపెద్ద ఐటీ సంస్థలో ప్రతి ఏటా సగటున 50 వేల మంది కొత్తగా ఉద్యోగాలు పొందుతుంటారు. ప్రపంచ వ్యాప్తంగా 6 లక్షల మందికిపైగా ఉద్యోగులు సేవలందిస్తున్నారు. 46 దేశాలకుపైగా 150కిపైగా ప్రాంతాల్లో సేవలందిస్తోంది. ఇంతటి ప్రతిష్ట కలిగిన ఈ కంపెనీలో లంచం ఇస్తేనే ఉద్యోగం అంటూ జరిగిన రూ.100 కోట్ల కుంభకోణం సంచలనం సృష్టించిన సంగతి తెలిసిందే. ఈ స్కామ్ దర్యాప్తులో భాగంగా మరిన్ని వివరాలు వెలుగులోకి వచ్చినట్లు సమాచారం.
బ్రైబ్స్ ఫర్ జాబ్స్ కుంభకోణం దర్యాప్తులో భాగంగా ఈ స్కామ్‌తో సంబంధం ఉన్నట్లు తేలిన 16 మంది ఉద్యోగులను తొలగించింది టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్. అలాగే 6 నియామక సంస్థలను డిబార్ చేసింది. ఈ మేరకు అక్టోబర్ 15న ఎక్స్చేంజీలకు ఇచ్చిన సమాచారంలో ఈ విషయాన్ని పేర్కొంది టీసీఎస్. కంపెనీలో ఉద్యోగుల నియామకంలో చూసిచూడనట్లు వ్యవహరించేందుకు సీనియర్ ఎగ్జిక్యూటివ్‌లకు నియామక సంస్థలు లంచాలు ఇచ్చినట్లు వచ్చిన ఆరోపణలపై టీసీఎస్ దర్యాప్తు చేపట్టింది. కొన్ని నెలల తర్వాత ఈ దర్యాప్తు ముగింపు దశకు వచ్చినట్లు తెలిసింది.
ఇప్పటి వరకు ఈ స్కామ్‌తో సంబంధం ఉన్న 19 మంది ఉద్యోగులపై చర్యలు తీసుకుంది. అందులో 16 మందిని ఉద్యోగంలోంచి తొలగించగా.. ముగ్గురిని నియామకాలకు సంబంధించిన విధుల నుంచి మార్చింది. అయితే కంపెనీలో ఎలాంటి మోసం జరగలేదని, సంస్థపై ఎలాంటి ఆర్థిక ప్రభావం ఉండదని TCS పేర్కొంది. అలాగే కీలకమైన మేనేజ్‌మెంట్ వ్యక్తి ప్రమేయం ఇందులో లేదని తేల్చేసింది.
మరిన్ని జాతీయ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..