నల్గొండ, మార్చి 19: మధ్యతరగతి కుటుంబం నుంచి వచ్చిన ఆమె ఒకేసారి ఏకంగా మూడు ప్రభుత్వ ఉద్యోగాలు సొంతం చేసుకుని అందరినీ ఆశ్చర్యపరిచింది. ఇటీవలే జూనియర్ లెక్చరర్‌గా నియామక పత్రం అందుకున్న నల్గొండ జిల్లా బిడ్డ సుమలత విజయగాథ ఇది. విద్యావ్యవస్థలో కొనసాగాలన్న కోరికతో అలుపెరుగని పోరాటం చేసిన సుమలత తాజాగా సుమలత జూనియర్ లెక్చరర్‌గా నియామక పత్రం అందుకున్నారు. సుమలత సక్సెస్ జర్నీ ఎలా సాగిందంటే..
నల్గొండ జిల్లా నిడమనూరు మండలం శాకాపురానికి చెందిన సుమలత తండ్రి మల్లయ్య రైతు. తల్లి వెంకటమ్మ గృహిణి. ముగ్గురు అక్కాచెల్లెళ్లు, తమ్ముడు. టెన్త్ వరకు ప్రభుత్వ పాఠశాల, ఇంటర్ నకిరేకల్‌లోని గురుకుల పాఠశాలలో చదివిన సుమలత బాగా చదువుకొని మంచి స్థాయిలో ఉండాలని కలలు కన్న సాధారణ అమ్మాయి. ఆ తర్వాత నల్గొండలోని ఎంజీ కళాశాలలో బీకామ్ పూర్తి చేశారు. సైదాబాద్‌లోని భోజిరెడ్డి ఉమెన్స్ ఇంజినీరింగ్ కాలేజీలో ఎంబీఏ, ఉస్మానియా యూనివర్సిటీలో ఎంకామ్ పూర్తి చేశారు. పీజీ పూర్తి చేసినప్పటి నుంచి హైదరాబాద్‌లోనే ఉంటూ గెస్ట్ లెక్చరర్ ఉద్యోగం చేస్తూ ప్రభుత్వ పోటీ పరీక్షలకు సన్నద్ధం అయ్యారు.
గ్రూప్ 2లో ఇంటర్వ్యూ వరకు వెళ్లినా తుది ఫలితాల్లో నిరశ ఎదురైంది. ఎస్పీడీసీఎల్ జేఏవో పరీక్షలో స్వల్ప మార్కులతో ఉద్యోగం రాలేదు. గురుకుల నియామక పరీక్షలో అర్హత సాధించినా అదే ఏడాదిలో సెట్ ఉత్తీర్ణత సాధించడంతో నిబంధనల ప్రకారం అర్హత లేదని ప్రకటించారు. తాజాగా కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏఎస్‌వోగా ఉద్యోగం వచ్చినప్పటికీ కోర్టు కేసులతో అదీ నిలిచిపోయింది. ఇలా వరుస వైఫల్యాలు వెంటాడినా దిగాలు పడిపోలేదు. ఆత్మస్థైర్యం కోల్పోలేదు. గతేడాది తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన వరుస నోటిఫికేషన్లకు మళ్లీ సన్నద్ధం ప్రారంభించారు. చేస్తున్న ఉద్యోగం వదిలేసి ఏడాదిపాటు సన్నద్ధమయ్యారు. మరోవైపు ASO నియామకానికి అడ్డంకులు తొలగడంతో 2024లో కోఠిలోని డైరెక్టరేట్ ఆఫ్ హెల్త్ అండ్ ఫ్యామిలీ వెల్ఫేర్ ఏఎస్‌వోగా ఉద్యోగంలో చేరారు.
ఆ తర్వాత వరుసగా వెలువడిన పోటీ పరీక్షల ఫలితాల్లో సుమలతకు ఉద్యోగాలు క్యూ కట్టాయి. సాంఘిక సంక్షేమ విభాగంలో గురుకుల డిగ్రీలెక్చరర్, దేవరకొండ మున్సిపాలిటీలో జేఏవోగా, జేఎల్ ఉద్యోగాలు వచ్చాయి. తాజాగా జేఎల్‌గా నియామక పత్రం అందుకున్న సుమలత త్వరలో వికారాబాద్‌లోని ప్రభుత్వ జూనియర్ కళాశాల కామర్స్ విభాగంలో విధుల్లో చేరనున్నారు. కృషితో అలుపెరగని పోరాటం చేసి వరుస విజయాలు సొంతం చేసుకున్న సుమలత విజయగాథ నేటి యువత స్ఫూర్తిగా తీసుకుని మునుముందుకు అడుగులు వేయాలి. వైఫల్యం ఎదురైతే పడిపోకుండా ఆత్మస్థైర్యంతో నిలబడి విజయం దక్కేవరకు పరుగాపకుండా ప్రయత్నాలు చేస్తూనే ఉండాలి. అప్పుడు విజయలక్ష్మి మిమ్మల్ని వరిస్తుంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.