న్యూఢిల్లీ, నవంబర్ 5: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్ ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ సిద్ధమవుతోంది. భారీ సంఖ్యలో కానిస్టేబుల్ ఖాళీల భర్తీకి సన్నాహాలు చేస్తోంది. కేవలం పదో తరగతి విద్యార్హతతో వేల సంఖ్యలో ఉద్యోగాలకు ఈ నెల 24న విడుదల చేయనుంది. ఈ నోటిఫికేషన్ కింద బీఎస్‌ఎఫ్, సీఐఎస్‌ఎఫ్, సీఆర్‌పీఎఫ్, ఐటీబీపీ, ఎస్‌ఎస్‌బీ, ఎస్‌ఎస్‌ఎఫ్‌లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులు, అస్సాం రైఫిల్స్‌లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ), ఎన్‌సీబీలో సిపాయి పోస్టులను భర్తీ చేయనున్నారు. ఈ మేరకు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్‌ఎస్‌సీ) నోటిఫకేషన్లు సిద్దం చేస్తున్నట్లు ఓ ప్రకటనలో తెలిపింది. కొన్ని రోజుల క్రితం విడుదల చేసిన ఎస్‌ఎస్‌సీ వార్షిక క్యాలెండర్ ప్రకారం నవంబర్ 24న నోటిఫికేషన్ వెలువడనుంది.
అభ్యర్ధుల నుంచి ఆన్‌లైన్ దరఖాస్తులు డిసెంబర్ 28లోపు స్వీకరించనుంది. ఇందుకు సంబంధించిన రాత పరీక్ష తేదీలను సైతం ఎస్‌ఎస్‌సీ ఇటీవలే వెల్లడించిస్తూ.. పరీక్ష షెడ్యూల్‌ను విడుదల చేసింది. స్టాఫ్ సెలక్షన్ కమిషన్ కానిస్టేబుల్ (గ్రౌండ్ డ్యూటీ) రాత పరీక్షలు వచ్చే ఏడాది ఫిబ్రవరి 20, 21, 22, 23, 24, 26, 27, 28, 29తేదీల్లో జరగనున్నాయి. మార్చి 1, 5, 6, 7, 11, 12వ తేదీల్లో దేశవ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో జరుగుతుంది. రాత పరీక్ష, ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ ఆధారంగా వివిధ సాయుధ బలగాల్లో అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు. కాగా గతేడాది దాదాపు 50,187 కానిస్టేబుల్(జీడీ)/ రైఫిల్‌మ్యాన్/ సిపాయి ఖాళీలను భర్తీ చేసిన సంగతి తెలిసిందే. ఈ ఏడాది రానున్న నోటిఫికేషన్లలో అంత కంటే ఎక్కువ సంఖ్యలోనే పోస్టులు భర్తీ చేసే అవకాశం ఉందని సమాచారం.
నేషనల్ లా స్కూల్స్, యూనివర్సిటీలు ఆలిండియా స్థాయిలో ఏటా కామన్ లా అడ్మిషన్ టెస్ట్ (క్లాట్)ను నిర్వహిస్తున్న సంగతి తెలిసిందే. ఈ ప్రవేశ పరీక్షలో ర్యాంకులు సాధించిన విద్యార్థులకు ఎల్‌ఎల్‌బీ, ఎల్‌ఎల్‌ఎం కోర్సుల్లో ప్రవేశాలు కల్పిస్తారు. తాజాగా యూజీ (ఎల్‌ఎల్‌బీ) క్లాట్ నోటిఫికేషన్ 2024 విడుదలైంది. దీనిలో వచ్చిన ర్యాంకు ఆధారంగా దేశవ్యాప్తంగా 22 ప్రధాన లా యూనివర్సిటీలలో ప్రవేశాలు కల్పిస్తారు. యూజీ లా కోర్సులకు ఇంటర్ లేదా తత్సమాన కోర్సులో అర్హత సాధించిన వారు దరఖాస్తు చేసుకోవచ్చు. పీజీ కోర్సులకు ఎల్‌ఎల్‌బీ డిగ్రీ లేదా తత్సమాన పరీక్ష ఉత్తీర్ణులై ఉండాలి. ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ నవంబర్ 10, 2023న మొదలవుతుంది. క్లాట్-2024 పరీక్ష డిసెంబర్ 3, 2023వ తేదీన జరుగుతుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.