న్యూఢిల్లీ, జూన్ 14: కేంద్ర సాయుధ బలగాల్లో కానిస్టేబుల్/ రైఫిల్‌మ్యాన్ (జీడీ) పోస్టుల సంఖ్య పెరిగింది. ఈ మేరకు మొత్తం ఖాళీల వివరాలను సవరిస్తూ తాజాగా రివైజ్‌డ్ నోటీసును స్టాఫ్ సెలక్షన్ కమిషన్ విడుదల చేసింది. గతేడాది నవంబర్‌లో 26,146 కానిస్టేబుల్, రైఫిల్‌మ్యాన్ పోస్టులకు నోటిఫికేషన్ విడుదల చేసిన సంగతి తెలిసిందే. తాజాగా దాదాపు 20,471 పోస్టులను అదనంగా చేర్చింది. దీంతో మొత్తం ఖాళీల సంఖ్య 46,617కి చేరింది. దేశ వ్యాప్తంగా వివిధ సాయుధ బలగాల్లో మొత్తం 46,617 కానిస్టేబుల్ పోస్టులను భర్తీ కానున్నాయి.
ఈ పోస్టులన్నింటినీ బోర్డర్ సెక్యూరిటీ ఫోర్స్(బీఎస్‌ఎఫ్), సెంట్రల్ ఇండస్ట్రియల్ సెక్యూరిటీ ఫోర్స్ (సీఐఎస్‌ఎఫ్), సెంట్రల్ రిజర్వ్ పోలీస్ ఫోర్స్ (సీఆర్‌పీఎఫ్), ఇండో టిబెటన్ బోర్డర్ పోలీస్ (ఐటీబీపీ), సశస్త్ర సీమ బల్ (ఎస్‌ఎస్‌బీ), సెక్రటేరియట్ సెక్యూరిటీ ఫోర్స్ (ఎస్‌ఎస్‌ఎఫ్)లో కానిస్టేబుల్ (జనరల్ డ్యూటీ) పోస్టులను భర్తీ చేస్తారు. వీటితోపాటు అస్సాం రైఫిల్స్ (ఏఆర్)లో రైఫిల్‌మ్యాన్ (జనరల్ డ్యూటీ) పోస్టులు కూడా ఇందులోనే భర్తీ చేయనున్నారు. ఇక ఇప్పటికే ఓపెన్ కాంపిటీటివ్ పరీక్షను ఈ ఏడాది ఫిబ్రవరి, మార్చి నెలల్లో జరిగాయి. ఈ పరీక్షకు సంబంధించిన ఆన్సర్ కీ ఏప్రిల్ 3న విడుదల చేశారు. దీనిపై అభ్యంతరాలను కూడా స్వీకరించింది. త్వరలోనే ఈ పరీక్ష ఫలితాలు వెల్లడికానున్నాయి. రాత పరీక్ష అనంతరం ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్, ఫిజికల్ స్టాండర్డ్ టెస్ట్, మెడికల్ టెస్ట్‌లు, ధ్రువపత్రాల పరిశీలన, రిజర్వేషన్ తదితరాల ఆధారంగా అభ్యర్థులను ఉద్యోగాలకు ఎంపిక చేస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.