Inter Exams 2026: సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. ఇంటర్ పరీక్షల తొలి రోజే అపశృతి!

రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు 2026 బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పలు పరీక్ష కేంద్రాల్లో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తొలిరోజు రెండో భాష పేపర్‌ 1కు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌ పేపర్లకు పరీక్షలు జరిగాయి. అయితే తొలి రోజు పరీక్షలు..

Inter Exams 2026: సంస్కృతం బదులు హిందీ ప్రశ్నపత్రం.. ఇంటర్ పరీక్షల తొలి రోజే అపశృతి!
Telangana Inter Exams

Updated on: Feb 26, 2026 | 8:31 AM

హైదరాబాద్‌, ఫిబ్రవరి 26: తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా ఇంటర్‌ పబ్లిక్‌ పరీక్షలు 2026 బుధవారం (ఫిబ్రవరి 25) నుంచి ప్రారంభమైన సంగతి తెలిసిందే. అయితే పరీక్షలు ప్రారంభమైన తొలిరోజే పలు పరీక్ష కేంద్రాల్లో పలు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. తొలిరోజు రెండో భాష పేపర్‌ 1కు తెలుగు, హిందీ, సంస్కృతం, ఉర్దూ, అరబిక్‌ పేపర్లకు పరీక్షలు జరిగాయి. పరీక్షకు హాజరైన కొందరు విద్యార్థులకు ఒక పేపర్‌కు బదులు మరో పేపర్‌ వచ్చిన ఘటనలు వెలుగుచూశాయి. హనుమకొండ, మహబూబ్‌నగర్‌ జిల్లాల్లో జరిగిన పరీక్షల్లో ఇద్దరు విద్యార్థులకు సంస్కృతం ప్రశ్నాపత్రంకి బదులు హిందీ ప్రశ్నపత్రాలు అందించారు. పరీక్ష ముగిసిన తర్వాత విద్యార్థులు ఈ విషయం తమ తల్లిదండ్రులకు తెలియజేసి టెన్షన్‌పడ్డారు. దీంతో తల్లిదండ్రులు అధికారులకు ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగులోకి వచ్చింది. బాధ్యులైన వారికి మెమో ఇవ్వాలని డిమాండ్‌ చేశారు.

కాగా రాష్ట్రంలో నిన్న మొదలైన ఇంటర్‌ పరీక్షలకు పలు పరీక్ష కేంద్రాలకు నాలుగైదు నిమిషాలు ప్రశ్నపత్రాలు ఆలస్యంగా అందాయి. దీంతో నిర్దేశిత సమయం కన్నా ఆలస్యంగా పరీక్షలు జరిగాయి. ఖమ్మం జిల్లాల్లోని కొన్ని సెంటర్లలో 10 నిమిషాలు ఆలస్యమైనట్టు సమాచారం. పరీక్షకు ఐదు నిమిషాల ముందే పోలీస్‌స్టేషన్ల నుంచి ప్రశ్నపత్రాలను స్వాధీనం చేసుకోవాలని ఇంటర్‌బోర్డు ఆదేశించిన మేరకు.. ప్రశ్నపత్రాలను ఉదయం 8:30 గంటలకు అధికారులు పోలీస్‌స్టేషన్ల నుంచి తీసుకోవల్సి ఉంటుంది. అయితే పలు ప్రాంతాల్లో ట్రాఫిక్‌ సమస్య కారణంగా పోలీస్‌స్టేషన్ల నుంచి నిర్దేశిత సమయంలోనే ప్రశ్నాపత్రాలు తీసుకున్నప్పటికీ సెంటర్లు ఆలస్యంగా అవి చేరడంతో సమస్యగా మారింది. దీంతో అప్రమత్తమైన ఇంటర్ బోర్డు ఉదయం 8:25 గంటలకే ప్రశ్నాపత్రాలను స్వాధీనం చేసుకోవాలని అధికారులకు సూచించారు.

కాగా బుధవారం మొదలైన ఇంటర్‌ తొలి పరీక్షకు రాష్ట్ర వ్యాప్తంగా 15,903 (4 శాతం) మంది గైర్హాజరయ్యారు. ఐదు నిమిషాలు ఆలస్యంగా వచ్చినా విద్యార్ధులను అనుమతించారు. గురువారం నుంచి ఇంటర్‌ సెకండియర్‌ పరీక్షలు ప్రారంభంకానున్నాయి.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.

Follow Us