Silent layoffs: భయ్యా మీ జాబ్ సేఫేనా.. ఐటీ రంగాన్ని అల్లాడిస్తున్న సడెన్ లేఆఫ్స్‌

ఎప్పుడు ఎవరి సీటు కదులుతుందో తెలీదు. ఏ క్షణాన ఎవరి ఉద్యోగం ఊడుతుందో లేదో తెలీదు. దైవాధీనం సర్వీసులా మారిపోతోంది ఐటీ ఉద్యోగం. భారత ఐటీ రంగంలో అగ్రగామి సంస్థ టీసీఎస్‌ ఉద్యోగులకు షాక్‌ల మీద షాక్‌లిస్తోంది. 2025-26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో త్రైమాసిక ఫలితాలతో పాటే.. ఉద్యోగుల ఊచకోత వార్తని కూడా టీసీఎస్‌ కన్‌ఫం చేసింది. మూడ్నెల్ల వ్యవధిలోనే ఆ సంస్థ 20 వేల మందిని ఇంటిబాట పట్టించడంపై తీవ్ర వ్యతిరేకత వ్యక్తమవుతోంది.

Silent layoffs: భయ్యా మీ జాబ్ సేఫేనా.. ఐటీ రంగాన్ని అల్లాడిస్తున్న సడెన్ లేఆఫ్స్‌
Layoffs

Updated on: Oct 13, 2025 | 10:00 PM

సరైన సమాచారం కూడా ఇవ్వకుండా టీసీఎస్ పెద్ద సంఖ్యలో ఉద్యోగులను తొలగించిందని ఉద్యోగుల సంఘం నైట్స్ ఆరోపించింది. టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌లో ఉద్యోగుల తొలగింపులను యూనియన్ ఆఫ్ ఐటీ అండ్ ఐటీఈఎస్ ఉద్యోగుల సంఘం తీవ్రంగా వ్యతిరేకిస్తోంది. లేఆఫ్స్ నిర్ణయాన్ని టీసీఎస్‌ వెనక్కి తీసుకోవాలని డిమాండ్ చేస్తోంది. భారీగా ఉద్యోగుల తొలగింపుపై ప్రభుత్వం జోక్యం చేసుకోవాలని సంఘాలు డిమాండ్‌ చేస్తున్నాయి.

టీసీఎస్ ప్రకటించిన లేఆఫ్స్‌తో సుమారు 30 వేల మంది ఉద్యోగులపై ప్రభావం పడుతుందని యునైట్‌ యూనియన్ ఆరోపిస్తోంది. ఈ ఆరోపణలను తోసిపుచ్చిన టీసీఎస్‌ యాజమాన్యం.. లేఆఫ్స్‌పై వివరణ ఇస్తున్నా లెక్కమాత్రం తేడా కొడుతోంది. సంస్థ పునర్వ్యవస్థీకరణ ప్రణాళికలో భాగంగా కేవలం ఒక శాతం మందిని, అంటే దాదాపు 6 వేల మందిని మాత్రమే తొలగించినట్లు టీసీఎస్‌ కంపెనీ చెబుతోంది. ముందు ప్రకటించినట్లు ఉద్యోగుల్లో 2 శాతంమందిని.. అంటే సుమారు 12 వేల మందినే తొలగిస్తామంటోంది టీసీఎస్‌.

అనుభవజ్ఞుల స్థానంలో టీసీఎస్‌ ఫ్రెషర్లను తక్కువ వేతనాలిచ్చి నియమించుకుంటోందని ఉద్యోగుల యూనియన్ యునైట్ ఆరోపిస్తోంది. 2లక్షల 55వేల కోట్ల ఆదాయం ఉన్న పెద్ద సంస్థ లాభార్జన కోసం ఇలా ఉద్యోగులను తొలగించడం అన్యాయమంటోంది యునైట్. ఉద్యోగులను తొలగించడానికి బదులుగా వారి స్కిల్స్‌ మెరుగుపరిచే చర్యలు చేపట్టాలని డిమాండ్ చేసింది. అయితే అవాస్తవ ప్రచారాలు నమ్మొద్దంటున్న టీసీఎస్‌.. తన టార్గెట్‌ ప్రకారం ఉద్యోగులను తగ్గించుకుంటామంటోంది.

బెంచ్ పాలసీలో మార్పులు, 12 వేల మంది ఉద్యోగుల తొలగింపు, ఏఐ ఇన్‌క్లూజన్ వంటి విషయాలపై ఇప్పటికే టీసీఎస్‌ కీలక నిర్ణయం తీసుకుంది. అయితే కంపెనీ చెబుతున్న లెక్కలకంటే ఉద్యోగుల తొలగింపు ఎక్కువగా ఉంటోందని యూనియన్లు ఆరోపిస్తున్నాయి. రాజీనామా చేసేలా ఒత్తిడి తెస్తున్నారని ఉద్యోగులు ఆరోపిస్తున్నారు. దేశంలోని అతిపెద్ద ఐటీ కంపెనీలోనే భారీ స్థాయిలో ఉద్యోగాల తొలగింపు దేశీయ ఐటీ పరిశ్రమపై ప్రతికూల ప్రభావం చూపుతుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.