అమరావతి, జనవరి 18: ఆంధ్రప్రదేశ్‌లో సంక్రాంతి సెలవులు పొడిగిస్తూ రాష్ట్ర ప్రభుత్వం బుధవారం (జనవరి 17) నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు మరో 3 రోజులపాటు సెలవులు పొడిగిస్తూ ఉత్తర్వులు జారీ చేసింది. తొలుత గురువారం (జనవరి 18) వరకు సెలవులు ఇచ్చిన రాష్ట్ర సర్కార్.. తాజాగా శనివారం (జనవరి 20) వరకు సెలవులు పొడిగిస్తున్నట్లు ప్రకటించింది. ఆ తర్వాత రోజు ఆదివారం కావడంతో ఈనెల 22న పాఠశాలలు పునః ప్రారంభం కానున్నాయి. ఉపాధ్యాయులు, తల్లిదండ్రుల విజ్ఞప్తి మేరకు ఈ నిర్ణయం తీసుకున్నట్టు విద్యాశాఖ ప్రకటించింది. ఈమేరకు పాఠశాల విద్యాశాఖ కమిషనర్ సురేశ్‌కుమార్ అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు జారీ చేశారు.
మరోవైపు జనవరి 22న అయోధ్యలో రామ మందిరంలో శ్రీరాముడి ప్రాణప్రతిష్ట కార్యక్రమం చేపట్టనున్నారు. దీంతో దేశవాప్తంగా పలు రాష్ట్రాలు స్కూల్స్, కాలేజీలకు ఈ రోజున సెలవు ప్రకటించాయి. ఈ క్రమంలో తెలుగు రాష్ట్రాలు కూడా జనవరి 22న విద్యాసంస్థలకు సెలవు ఇచ్చే అవకాశం ఉందని తెలుస్తోంది. జనవరి 22న సెలవు ప్రకటిస్తే 23న పాఠశాలలు తిరిగి ప్రారంభం అయ్యే అవకాశం ఉంది. దీనిపై ఇంకా అధికారిక ప్రకటన విడుదలకాలేదు. ఇప్పటికే ఉత్తరప్రదేశ్, మధ్యప్రదేశ్, గోవా, చత్తీస్‌ఘడ్, హర్యానా.. రాష్ట్రాలు జనవరి 22వ తేదీన సెలవు ప్రకటించాయి కూడా. ఏపీలో పాఠశాలలకు వరుసగా 13 రోజులు పాటు సెలవులు వచ్చాయి. తొలుత ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం జనవరి 9 నుంచి 18 వరకు విద్యాసంస్థలకు సంక్రాంతి సెలవులు ప్రకటించిన సంగతి తెలిసిందే.
అటు తెలంగాణలోనూ జనవరి 12 నుంచి 17 వరకు సెలవులు వచ్చాయి. తెలంగాణ ఇంటర్ పబ్లిక్ పరీక్షలు ఫిబ్రవరి 29 నుంచి మార్చి 19 వరకు జరగనుండటంతో అన్ని ప్రభుత్వ ప్రధానోపాధ్యాయులు, ZPP/MPP, ఎయిడెడ్, ప్రైవేట్, అన్-ఎయిడెడ్ పాఠశాలలు విద్యార్ధులను సన్నద్ధం చేయడంలో బిజీగా ఉన్నాయి. జనవరి 26న రిపబ్లిక్ డే సెలవు కూడా ఉంది. వరుస సెలవులు దృష్ట్యా ఇంటర్మీడియట్ విద్యార్ధులకు ప్రత్యేక తరగతులు నిర్వహిస్తున్నాయి.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.