Tech Sector Jobs for Women: టెక్ రంగంలో మహిళలకు ఫుల్ డిమాండున్న కొలువులు ఇవే.. ఏకంగా రూ.కోటిన్నర వేతనం
మహిళా నిపుణులకు టెక్, బిజినెస్ రంగాల్లో కెరీర్ అవకాశాలు దండిగా ఉన్నాయి. ముఖ్యంగా ఈ కింది విభాగాల్లో చక్కని నైపుణ్యాలు ఉన్న వారికి ఆకర్షణీయ జీతంతోపాటు మరెన్నో అలవెన్స్ లు అందుబాటులో ఉన్నాయి. ఏయే కోర్సులు చేసిన వారికి ఎలాంటి ఉపాధి అవకాశాలు పొందొచ్చో ఇక్కడ తెలుసుకోండి..

భారత్‌లో టెక్, బిజినెస్ రంగాల వృద్ధి కొనసాగుతూనే ఉంది. దీంతో ఈ రంగాల్లో నియామకాలు కూడా పుల్ జోష్ లో ఉన్నాయి. తాజాగా టీమ్‌లీజ్ డిజిటల్ విడుదల చేసిన నివేదికలో ఈ రెండు రంగాల్లో మహిళలకు అధిక డిమాండ్ ఉన్న ఉద్యోగాల జాబితాను వెల్లడించింది. అనుభవం, నైపుణ్యానికి పెద్దపేట వేస్తూ అధిక జీతాలతో ఆకర్షణీయమైన కొలువులు ఈ రంగాల్లో మహిళలకు స్వాగతం పలుకుతున్నాయి. ముఖ్యంగా ఫ్రెషర్స్ నుంచి అనుభవజ్ఞులైన నిపుణుల వరకు.. డేటా సైన్స్, ప్రొడక్ట్ మేనేజ్‌మెంట్, క్లౌడ్ ఇంజనీరింగ్, సైబర్ సెక్యూరిటీ వంటి విభాగాల్లో మహిళలకు కెరీర్ అవకాశాలు దండిగా ఉన్నాయి.
భారత్ టెక్ రంగంలో మహిళలకు అధిక డిమాండ్ ఉన్న కొలువులు ఇవే..
ప్రొడక్ట్ మేనేజర్
ఒక ప్రొడక్ట్‌ను దాని ప్రారంభ దశ నుంచి కస్టమర్ వరకు నడిపించడంలో ప్రొడక్ట్ మేనేజర్ కీలక పాత్ర పోషిస్తారు. వారు కస్టమర్ అవసరాలు, వ్యాపార లక్ష్యాలు రెండింటికీ అనుగుణంగా ఉండేలా ప్రొడక్ట్‌ను పోటీ కంటే ముందుండేలా చేస్తారు. ఈ రంగంలో అడుగుపెట్టే ఫ్రెషర్లకు (0 నుంచి 3 యేళ్లకు) రూ. 22.1 లక్షల వార్షిక ఆదాయం లభిస్తుంది. కెరీర్ ప్రారంభంలో ప్రొడక్ట్ మేనేజర్లు.. మార్కెట్ రీసెర్చ్, వినియోగదారు అవసరాలను గుర్తించడం, వారి ఆలోచనలకు ప్రాణం పోసేందుకు డెవలప్‌మెంట్ టీంకు మద్దతు తెల్పడం వంటి అంశాలపై దృష్టి సారించవల్సి ఉంటుంది. అనుభవం పెరిగేకొద్దీ వీరి జీతం అంటే 8 యేళ్ల అనుభవం ఉన్న సీనియర్ ప్రొడక్ట్ మేనేజర్లు, డైరెక్టర్లకు రూ. 160 లక్షల వరకు వార్షిక ఆదాయం పొందొచ్చు.
డేటా సైంటిస్ట్
ముడి డేటాను విలువైన అంతర్దృష్టులుగా మార్చడంలో డేటా సైంటిస్టులు కీలక పాత్ర పోషిస్తారు. కంపెనీలు సమాచారంతో కూడిన నిర్ణయాలు తీసుకోవడానికి డేటాపై ఎక్కువగా ఆధారపడటంతో, ఈ రంగం అత్యంత ప్రతిఫలదాయకమైన కెరీర్ ఆప్షన్‌లలో ఒకటిగా మారింది. డేటా సైన్స్ రంగంలో ఫ్రెషర్లకు (0 నుంచి 3 యేళ్లకు) రూ. 18 లక్షల వరకు వార్షిక వేతనం లభిస్తుంది. ఇందులో కొత్త డేటా సైంటిస్టులు పెద్ద డేటాసెట్‌లను ఎలా నిర్వహించాలో, ప్రాథమిక యంత్ర అభ్యాస పద్ధతులను ఎలా వర్తింపజేయాలో, డేటా ఆధారిత పరిష్కారాలతో వాస్తవ ప్రపంచ సమస్యలను ఎలా పరిష్కరించాలి వంటి వాటిని నేర్చుకుంటారు. అలా 8 యేళ్ల తర్వాత సీనియర్ డేటా సైంటిస్టులకు రూ. 150 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
క్లౌడ్ ఆర్కిటెక్ట్/ఇంజనీర్
డిజిటల్ రంగంలో వృద్ధికి మౌలిక సదుపాయాలను నిర్మించడంలో క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లు, ఇంజనీర్లు చాలా అవసరం. క్లౌడ్ ఇంజనీరింగ్ రంగంలోకి ప్రవేశించే ఫ్రెషర్లకు (0 నుంచి 3 యేళ్లకు) రూ. 14 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. జూనియర్ క్లౌడ్ ఇంజనీర్లు తమ కెరీర్ ప్రారంభంలో క్లౌడ్ సొల్యూషన్లకు మద్దతు ఇవ్వడం, సమస్యలను పరిష్కరించడం, క్లౌడ్ సర్వీస్ నిర్వహణ వంటి సూక్ష్మ నైపుణ్యాలను నేర్చుకోవడంపై దృష్టి పెడతారు. సీనియర్ క్లౌడ్ ఆర్కిటెక్ట్‌లకు రూ.100 లక్షల వరకు వార్షిక వేతనం దొరుకుతుంది.
PMO (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్)
PMO (ప్రాజెక్ట్ మేనేజ్‌మెంట్ ఆఫీస్) నిపుణులు బడ్జెట్‌ను మించకుండా సకాలంలో ప్రాజెక్టులు పూర్తి చేయడానికి, సంస్థాగత లక్ష్యాలకు అనుగుణంగా ఉండేలా చూసుకోవడంలో కీలక పాత్ర పోషిస్తారు. ప్రాజెక్ట్ ప్రక్రియలను క్రమబద్ధీకరించడంలో, సామర్థ్యాన్ని నిర్ధారించడంలో వీరి నైపుణ్యాలు ఏ వ్యాపారానికైనా కీలకంగా ఉంటాయి. PMO రంగంలోకి అడుగుపెట్టే ఫ్రెషర్లకు (0 నుంచి 3 యేళ్లకు) అత్యధిక జీతం రూ. 15 LPA వరకు ఉంటుంది. ఈ రంగంలో 8 యేళ్లకుపైగా అనుభవం ఉన్న సీనియర్ PMO నిపుణులకు రూ. 80 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
సైబర్ సెక్యూరిటీ స్పెషలిస్ట్
నేటి డిజిటల్ యుగంలో సైబర్ బెదిరింపుల నుంచి రక్షణ కల్పించే సైబర్ సెక్యూరిటీ నిపుణులు గుర్తింపు పొందని హీరో వంటివారు. సైబర్ దాడుల నుంచి కీలకమైన వ్యవస్థలు, నెట్‌వర్క్‌లు, డేటాను కాపాడటంలో వీరికి సాటి మరొకరు ఉండరు. భారత్ అంతటా వ్యాపారాలు డిజిటల్‌గా మారుతున్నకొద్దీ సైబర్ సెక్యూరిటీ నిపుణుల డిమాండ్ నానాటికీ విపరీతంగా పెరుగుతుంది. ఇది కూడా నేడు అత్యంత డిమాండ్ ఉన్న కెరీర్ మార్గాలలో ఒకటిగా ప్రసిద్ధి చెందింది. ఈ రంగంలోకి అడుగుపెట్టే ఫ్రెషర్లకు (0 నుంచి 3 యేళ్లకు) రూ. 12 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది. ఈ రంగంలో 8 యేళ్లకుపైగా అనుభవం ఉన్న సీనియర్ సైబర్ సెక్యూరిటీ నిపుణులకు రూ. 90 లక్షల వార్షిక వేతనం లభిస్తుంది.
మరిన్ని జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి.








