
భారత రైల్వే మంత్రిత్వ శాఖ నిరుద్యోగులకు ఎగిరి గంతేసే వార్త చెప్పింది. దేశ వ్యాప్తంగా ఉన్న పలు రైల్వే రీజియన్లలో మొత్తం 22,000 గ్రూప్ డి ఉద్యోగాల భర్తీకి రైల్వే రిక్రూట్‌మెంట్ బోర్డు (RRB) నోటిఫికేషన్ విడుదల చేసింది. తొలుత ఇచ్చిన ప్రకటన మేరకు ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 21 నుంచి ప్రారంభం కావాల్సింది ఉండగా.. ఆ తేదీని జనవరి 31కి మార్చారు. అంటే ఈ పోస్టులకు ఆన్‌లైన్ దరఖాస్తులు జనవరి 31 నుంచి ప్రారంభం అవుతాయన్నమాట. ఆర్‌ఆర్‌బీ గ్రూప్ డీ పోస్టుల వివరణాత్మక నోటిఫికేషన్ కూడా అదే తేదీన విడుదలయ్యే అవకాశం ఉంది. ఇక మార్చి 3, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంటుంది. ఆర్‌ఆర్‌బీ భర్తీ చేసే ఈ పోస్టుల్లో పాయింట్స్‌మన్, అసిస్టెంట్, ట్రాక్ మెయింటెయినర్, అసిస్టెంట్, అసిస్టెంట్ లోకో షెడ్, అసిస్టెంట్ ఆపరేషన్స్ వంటి తదితర పోస్టులు ఉన్నాయి.
పదో తరగతితోపాటు సంబంధిత విభాగంలో ఐటీఐలో అర్హత కలిగిన అభ్యర్థులు ఎవరైనా ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు. ఈ విద్యార్హతలతోపాటు నోటిఫికేషన్‌లో సూచించిన విధంగా నిర్దేశిత శరీరక ప్రమాణాలు కూడా కలిగి ఉండాలి. అభ్యర్ధుల వయోపరిమితి జనవరి 1, 2026 నాటికి 18 నుంచి 33 సంవత్సరాల మధ్య ఉండాలి. నిబంధనల మేరకు ఎస్సీ/ ఎస్సీ/ ఓబీసీ/ పీహెచ్ అభ్యర్థులకు వయోపరిమితిలో సడలింపు ఉంటుంది. ఆన్‌లైన్ రాత పరీక్ష (CBT), ఫిజికల్ ఎఫిషియెన్సీ టెస్ట్ (PET), డాక్యుమెంట్ వెరిఫికేషన్ (DV), మెడికల్ ఎగ్జామినేషన్ తదితరాల ఆధారంగా తుది ఎంపిక ఉంటుంది. ఎంపికైన వారికి నెలకు రూ.18,000 ప్రారంభ వేతనంతోపాటు నిబంధనల మేరకు ఇతర అలవెన్స్‌లు కూడా అందిస్తారు. పోస్టుల వారీగా ఖాళీల వివరాలు, విద్యార్హతలు, ఎంపిక విధానం, దరఖాస్తు ఫీజు, సిలబస్ వంటి తదితర పూర్తి వివరాలు ఆర్‌ఆర్‌బీ త్వరలో విడుదల చేసే అధికారిక నోటిఫికేషన్‌లో చెక్ చేసుకోవచ్చు.
ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.