Paytm field sales executive jobs: నిరుద్యోగులకు పేటీఎం సంస్థ బంపర్ ఆఫర్ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 20 వేల ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లను నియమించుకునేందుకు నిర్ణయం తీసుకుంది. మార్కెట్లో ప్రధాన పోటీ, త్వరలోనే ప్రజలకు మరింత చేరువ అవనున్న తరుణంలో పేటీఎం ఈ కీలక నిర్ణయం తీసుకున్నట్టు తెలుస్తోంది. డిజిటల్ లావాదేవీలను విస్తృతం చేసేందుకు పేటీఎం ఈ నిర్ణయం తీసుకున్నట్లు కంపెనీ ప్రతినిధులు వెల్లడించారు. నోయిడాలోని కంపెనీ ప్రతినిధి ఈ విషయంపై ఇప్పటివరకూ స్పష్టత ఇవ్వలేదు. అయితే.. ఫీల్డ్ సేల్స్ ఎగ్జిక్యూటివ్‌లుగా.. అండర్ గ్రాడ్యుయేట్లు ఈ ఉద్యోగాలకు అర్హులుగా నిర్ణయించినట్టు పేర్కొంటున్నారు.
ఈ 20,000 మంది ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లకు నెలవారీ వేతనంగా రూ.35 వేలను ఇస్తారని.. పీఎఫ్, ఇన్సూరెన్స్ సౌకర్యం కూడా కల్పించనున్నట్లు పేర్కొంటున్నారు. అయితే.. ఈ ఉద్యోగుల ద్వారా పేటీఎం, క్యూఆర్ కోడ్, పీవోఎస్ మెషీన్, పేమెంట్ వ్యాలెట్, పేటీఎం సౌండ్ బాక్స్, యూపీఐ, మర్చంట్ లోన్స్, పేటీఎం పోస్ట్ పెయిడ్, ఇన్సూరెన్స్ స్కీంలను ప్రమోట్ చేయాలని ఆలోచన చేస్తోంది. తద్వారా భారీ వ్యాపార విస్తరణకు కంపెనీ ప్రణాళికలు చేస్తోంది. ఈ ఉద్యోగాల కల్పనతో డివిజన్లు, మండలాల వారీగా ఫీల్డ్ ఎగ్జిక్యూటివ్‌లను నియమిస్తారని తెలుస్తోంది.
ఇదిలాఉంటే.. నేషనల్ పేమెంట్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా.. మే నాటి గణాంకాల ప్రకారం.. ప్రస్తుత యూపీఐ మార్కెట్లో పేటీఎం కు 11 శాతం వాటా మాత్రమే ఉంది. అయితే.. ఫోన్ పే.. 45 శాతం వాటాతో మొదటి స్థానంలో ఉండగా.. గూగుల్ పే 35 శాతంతో రెండో స్థానంలో ఉంది. ఫోన్ పే, గూగుల్ పే సహా పలు ఫిన్ టెక్ కంపెనీల పోటీని ఎదుర్కొనేందుకు పేటీఎం సంస్థ ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తోంది. కాగా.. అక్టోబర్ నాటికి రూ.16,000 కోట్లకు పైగా ఐపీఓలను విస్తరించేందుకు కంపెనీ ప్రణాళికలు చేస్తోంది.
Also Read: