No Bag Day: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకు నోచుకోని ‘నో బ్యాగ్‌ డే’.. కొరవడిన సర్కార్ ప్రత్యేక దృష్టి

|

Aug 27, 2023 | 8:09 AM

రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కార్‌ బడుల్లో చదివే విద్యార్ధులకు నాలుగో శనివారం 'నో బ్యాగ్‌ డే' అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రోజున విద్యార్ధులు బ్యాగ్‌ తీసుకురాకుండానే పాఠశాలలకు వస్తారన్నమాట. మ్యూజియం, చారిత్రక కట్టడాలు, గ్రామ పంచాయితీల సందర్శన వంటి అవుట్‌ డోర్‌ యాక్టివిటీస్‌తోపాటు మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎన్నికలు వంటి ఇండోర్ కార్యకలాపాల..

No Bag Day: ప్రభుత్వ పాఠశాలల్లో అమలుకు నోచుకోని నో బ్యాగ్‌ డే.. కొరవడిన సర్కార్ ప్రత్యేక దృష్టి
No Bag Day On 4th Saturday
Follow us on

హైదరాబాద్‌, ఆగస్టు 27: రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న సర్కార్‌ బడుల్లో చదివే విద్యార్ధులకు నాలుగో శనివారం ‘నో బ్యాగ్‌ డే’ అమలు చేస్తోన్న సంగతి తెలిసిందే. ఈ రోజున విద్యార్ధులు బ్యాగ్‌ తీసుకురాకుండానే పాఠశాలలకు వస్తారన్నమాట. మ్యూజియం, చారిత్రక కట్టడాలు, గ్రామ పంచాయితీల సందర్శన వంటి అవుట్‌ డోర్‌ యాక్టివిటీస్‌తోపాటు మోడల్ అసెంబ్లీ, మోడల్ ఎన్నికలు వంటి ఇండోర్ కార్యకలాపాల వరకు ప్రతి నెలా నాలుగో శనివారం పాఠశాలల్లో నిర్వహించాలని పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. విద్యార్థులపై ఒత్తిడి, బ్యాగుల భారాన్ని తగ్గించడంతో పాటు వివిధ కార్యక్రమాల్లో పాల్గొనేందుకు వీలుగా పాఠశాల విద్యాశాఖ ఈ విద్యా సంవత్సరం నుంచి అన్ని పాఠశాలల్లో ప్రతినెలా నాలుగో శనివారాన్ని బ్యాగ్‌లెస్ డేగా అమలు చేస్తోంది. అంతేకాకుండా బండెడు పుస్తకాలు మోయడం వల్ల పిల్లల ఎదుగుదలపై ప్రభావం చూపుతుందన్న మరో కారణం కూడా నిపుణులు చెబుతున్నారు. ఆ రోజు విద్యార్థులు పుస్తకాలు తీసుకెళ్లకుండా పాఠశాలలకు వెళ్లాలి. అక్కడ వారికి నచ్చిన పనుల్లో భాగస్వామ్యం కావచ్చు.

ఆచరనకు నోచుకోని ‘నో బ్యాగ్‌ డే’

రాష్ట్రంలోని కొన్ని జిల్లాల్లోని చాలా బడుల్లో ఈ విధానం అమలు చేయడం లేదు. సాధారణ రోజుల మాదిరిగానే పిల్లలు నాలుగో శనివారం పుస్తకాల సంచులతో బడికెళ్లున్న దృశ్యాలు మీడియా కంట పడింది. సంగెం ప్రభుత్వ ప్రాథమిక పాఠశాల విద్యార్థులు పుస్తకాల బ్యాగులతో వచ్చారు. నోబ్యాగ్‌ డే అమలుకు ప్రయత్నిస్తే తల్లిదండ్రులు బడి మాన్పించి ప్రైవేటు పాఠశాలలకు పంపుతున్నారని సదరు పాఠశాల హెచ్‌ఎం కుమారస్వామిని తెలిపారు. విద్యార్థులు పుస్తకాల బ్యాగులతో స్కూల్‌కి వచ్చినా ఆటపాటల్లో ఎక్కువ సమయం గడిపేలా చూస్తున్నామని ఆయన అన్నారు. పదిలోపు పాఠశాలల్లో మినహా మిగతా ఎక్కడా ప్రభుత్వ, ప్రైవేట్‌ విద్యా సంస్థల్లో నో బ్యాగ్‌ డే పాటించలేదని మీడియా గుర్తించింది. రోజు మాదిరిగానే విద్యార్ధులు తమ పుస్తకాల సంచులతో తరగతులకు హాజరవుతున్నారు. దీనిపై విద్యాశాఖ ప్రత్యేక దృష్టి సారించకపోవడమే ప్రధాన కారణమని తెలుస్తోంది.

28 రకాల కార్యక్రమాలు..

ఇలా ఏడాదిలో ప్రతినెల నాలుగో శనివారం అంటే మొత్తం10 రోజులు పుస్తకాల సంచి లేకుండా విద్యార్ధులకు పాఠశాలకు వచ్చేలా చూడాలని విద్యాశాఖ గతంలోనే ఆదేశాలు ఇచ్చింది. దీనిని ఏవిధంగా అమలు చేయాలనే విషయం ఎస్సీఈఆర్టీ ప్రత్యేక బుక్‌లెట్‌ సైతం ముద్రించి విడుదల చేసింది. ఒకటి నుంచి పదో తరగతి వరకు విద్యార్ధుల్లో సృజనాత్మకతను వెలికితీసేలా 28 రకాల కార్యకలాపాలను సూచించారు. వీటిల్లో సాంస్కృతిక కార్యక్రమాలు, ఆటపాటలు, క్రీడలు, నృత్యాలు, చిత్రలేఖనం, వ్యాసరచన, క్విజ్‌ పోటీల నిర్వహణ, నీతికథలు, శాస్త్రసాంకేతిక అభివృద్ధి, ఆటలు, క్షేత్రస్థాయి పర్యటనలు, చిత్రలేఖనం, కథల పోటీలు వంటి కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. చారిత్రక ప్రదేశాలు, పంచాయతీ కార్యాలయాల సందర్శన, మ్యూజియం, విజ్ఞాన శాస్త్ర ప్రయోగాలు, కృతిమ మేధ, నమూనా అసెంబ్లీ, నమూనా ఎన్నికలు, తెలుగు-ఆంగ్లం-హిందీలో కథలు చెప్పడం, మిమిక్రీ వంటి సృజనాత్మకతను వెలికితీసే పలు కార్యక్రమాలను పొందుపరిచారు.

ఇవి కూడా చదవండి

పలు రాష్ట్రాల్లో ‘నో బ్యాగ్‌ డే’ అమలు..

‘నో బ్యాగ్‌ డే’ కేవలం తెలంగాణలో మాత్రమేకాకుండా ఆంధ్రప్రదేశ్‌లో మొదటి, మూడో శనివారాల్లో ‘సృజన-శనివారం సందడి’ పేరుతో నో బ్యాగ్‌ డే అమలు చేస్తున్నారు. తమిళనాడులో ఫిబ్రవరి 26న పుస్తక దినోత్సవం సురస్కరించుకుని ‘నో బ్యాగ్‌ డే’ నిర్వహిస్తున్నారు. అలాగే కర్ణాటక, మణిపూర్‌, రాజస్థాన్‌లోనూ నెలలో ఒక శనివారం నో బ్యాగ్‌ డే ప్రకటించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం క్లిక్‌ చేయండి.