Andhra Pradesh: మార్కులు రావాలన్నా, ర్యాంకులు సాధించాలన్నా కార్పొరేట్ విద్యా సంస్థలకే సాధ్యం. చాలా మంది తల్లిదండ్రులు ఇలాగే ఆలోచిస్తారు. అప్పు చేసిన మరీ ప్రైవేటు పాఠశాలల్లో చిన్నారులను చేర్పిస్తుంటారు. అందుకే ప్రైవేటు పాఠశాలల్లో సీటు దొరకడం చాలా కష్టంగా మారుతుంది. రికమెండేషన్లు ఉన్నా రూ. లక్షల్లో ఫీజులు కట్టాల్సిన పరిస్థితి ఉంటుంది. ఇంతటి కష్టమున్నా పేరెంట్స్ మాత్రం తమ పిల్లలను ప్రైవేటు విద్యా సంస్థల్లోనే చేర్పించడానికి మొగ్గు చూపుతారు. ప్రభుత్వ పాఠశాలలపై ఆసక్తి చూపించరు. కానీ ఆంధ్రప్రదేశ్‌లోని ఓ ప్రభుత్వ పాఠశాలలో సీటు దొరకడానికి పేరెంట్స్ నానా కష్టాలు పడుతున్నారు. ఇంతకీ ఆ పాఠశాల ఎక్కడ ఉంది.? దానికి అంతలా ఉన్న ఆ ప్రత్యేకత ఏంటో తెలుసుకుందామా.?
నెల్లూరు జిల్లాలోని కె.ఎన్.ఆర్ నగరపాలక సంస్థ పాఠశాల కార్పొరేట్ విద్యాసంస్థలకు సవాల్ విసురుతోంది. గత 20 ఏళ్లుగా అత్యుత్తమ ఫలితాలతో ఈ పాఠశాల దూసుకుపోతోంది. తాజాగా విడుదలైన పదో తరగతి పరీక్షా ఫలితాల్లోనూ ఈ పాఠశాల విద్యార్థులు దుమ్మురేపారు. కె.ఎన్.ఆర్ పాఠశాలకు చెందిన తర్షశ్రీ పదో తరగతి పరీక్షల్లో ఏకంగా 590 మార్కులు సాధించి టాపర్‌గా నిలిచింది. అంతేకాకుండా 35 మంది విద్యార్థులు 550 కంటే ఎక్కువ మార్కులు సాధించడం విశేషం.
ఇలా అద్భుత ఫలితాలు దక్కుతున్నాయి కాబట్టే ఈ ప్రభుత్వ పాఠశాలలో అడ్మిషన్ పొందడానికి భారీ డిమాండ్ ఉంటుంది. ఎంతలా అంటే మా పాఠశాలలో సీట్లు ఖాళీలు లేవని ఫ్లెక్సీలు ఏర్పాటు చేసేంతలా. తాజాగా కె.ఎన్.ఆర్ పాఠశాలలో 7 నుంచి 10వ తరగతి వరకు సీట్లు లేవని, కేవలం 6వ తరగతిలో మాత్రమే సీట్లు ఉన్నాయని పాఠశాల యాజమాన్యం ఏకంగా ఫ్లెక్సీలు ఏర్పాటు చేశారంటేనే ఈ పాఠశాలలో సీటుకు ఎంత క్రేజో అర్థం చేసుకోవచ్చు.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..