NEET UG 2025 Exam Date: ఈసారి ఆన్‌లైన్‌ విధానంలోనే నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష..! పేపర్ లీకేజీలకు చెక్ పడేనా?

|

Jan 12, 2025 | 12:02 PM

గతేడాది నీట్ యూజీ 2024 ప్రవేశ పరీక్షలో జరిగిన పెద్ద ఎత్తు లీకేజీలు దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం లేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో కేంద్రం జాగ్రత్త చర్యలకు ఉపక్రమించింది. ఈ ఏడాది నిర్వహించనున్న నీట్ 2025 పరీక్షను ఆఫ్ లైన్ లో నిర్వహించాలా? లేదా ఆన్ లైన్ లో నిర్వహించాలనా అనే దానిపై మల్లగుల్లాలు పడుతుంది. అధికం శాతం ఆన్ లైన్ వైపే మొగ్గు చూపుతుంది..

NEET UG 2025 Exam Date: ఈసారి ఆన్‌లైన్‌ విధానంలోనే నీట్‌ యూజీ ప్రవేశ పరీక్ష..! పేపర్ లీకేజీలకు చెక్ పడేనా?
NEET UG 2025 Exam
Follow us on

న్యూఢిల్లీ, జనవరి 12: దేశ వ్యాప్తంగా ఉన్న ప్రతిష్టాత్మక మెడికల్ విద్యా సంస్థల్లో 2025-26 విద్యా సంవత్సరానికి వైద్యవిద్య కోర్సుల్లో ప్రవేశానికి నిర్వహించే నీట్‌ (యూజీ) 2025 పరీక్షను ఈ ఏడాది ఆన్‌లైన్‌లో నిర్వహించనున్నారు. ఈ మేరకు జాతీయ పరీక్షల సంస్థ (ఎన్‌టీఏ) నిర్ణయం తీసుకుంది. ఇస్రో మాజీ ఛైర్మన్‌ కస్తూరిరంగన్‌ ఛైర్మన్‌గా నియమించిన నిపుణుల కమిటీ సైతం ఆన్‌లైన్‌ విధానంలోనే నీట్‌ నిర్వహించాలని సిఫారసు చేసిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే తుది నిర్ణయాన్ని ప్రకటించేందుకు కేంద్ర విద్య, ఆరోగ్యశాఖలు చర్చలు జరుపుతుంది. కేంద్రం దీనిపై సానుకూలంగా స్పందించి ఆన్‌లైన్‌ విధానంలోనే నీట్ యూపీ 2025 పరీక్షను జరపాలని నిర్ణయం తీసుకుంటే.. మే 6 నుంచి ఈ పరీక్షలు వరుసగా 10 రోజులపాటు జరిపే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు ఇయా తేదీల్లో దేశవ్యాప్తంగా జరిగే కీలక ఆన్‌లైన్‌ పోటీ పరీక్షలను బ్లాక్‌ చేయించినట్లు సమాచారం. దీంతో ఆయా తేదీల్లో నీట్‌ యూజీ పరీక్షలు మాత్రమే జరుగుతాయి.. ఇతర ఏ పరీక్షలు నిర్వహించడానికి వీలుండదన్నమాట. గత ఏడాది నీట్ యూజీ ప్రవేశ పరీక్షల్లో పెద్ద ఎత్తున లీక్‌లు తలెత్తిన నేపథ్యంలో ఈ మేరకు నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది.

ఒకవేళ ఇప్పటికిప్పుడు పూర్తిగా ఆన్‌లైన్‌ విధానంలో నీట్‌ పరీక్ష నిర్వహించడం ఇబ్బందిగా భావిస్తే హైబ్రిడ్‌ విధానాన్ని పరిశీలించే అవకాశం కూడా లేకపోలేదు. ఈ విధానంలో ఆఫ్‌లైన్‌, ఆన్‌లైన్‌ రెండు విధాలుగా పరీక్షలు జరుగుతాయి. దీంతో నీట్ పరీక్షకు హాజరయ్యే విద్యార్థులు తమకు ఇష్టమైన విధానంలో పరీక్ష రాయడానికి అవకాశం ఉంటుంది. ఒకవేళ ఆన్‌లైన్‌లోనే పరీక్షలను నిర్వహించాలని కేంద్రం నిర్ణయిస్తే ఏ రాష్ట్రంలో ఎన్ని పరీక్షా కేంద్రాలున్నాయి? వంటి తదితర వివరాలను సేకరించేందుకు రాష్ట్ర ప్రభుత్వాల సహకారం కోరేందుకు సిద్ధంగా ఉంది. దీనిపై ఇటీవల కేంద్ర ప్రభుత్వ అధికారులు రాష్ట్ర ఉన్నత విద్యాశాఖ అధికారులతో వీడియో కాన్ఫరెన్స్‌ కూడా నిర్వహించారు.

ఈ సమావేశంలో ప్రైవేట్‌ పరీక్షా కేంద్రాల కంటే ప్రభుత్వ ఆధ్వర్యంలోని కేంద్రాల్లో నీట్‌ పరీక్ష జరపాలని కేంద్రం భావిస్తోంది. అంటే ఐఐటీలు, ఎన్‌ఐటీలు, కేంద్రీయ విశ్వవిద్యాలయాలు, జవహర్‌ నవోదయ విద్యాలయాలతోపాటు రాష్ట్ర ప్రభుత్వాల ఆధ్వర్యంలోని ప్రభుత్వ ఇంజినీరింగ్‌ తదితర కాలేజీలను కేంద్రాలుగా ఏర్పాటు చేస్తారన్నమాట. దీనిపై ఇప్పటికే కేంద్రం ఆరా తీసింది కూడా. గతేడాది (2024) నీట్‌కు దేశ వ్యాప్తంగా సుమారు 24 లక్షల మంది దరఖాస్తు చేసుకున్నారు. ఈ ఏడాది కూడా కొంచెం అటుఇటుగా ఇంతే మొత్తంలో దరఖాస్తులు వచ్చే ఛాన్స్‌ ఉంది. ఒకవేళ హైబ్రిడ్‌ విధానంలో పరీక్ష జరిపినా కనీసం 75శాతం మంది ‘ఆన్‌లైన్‌’ను ఎంచుకునే అవకాశం లేకపోలేదు. కాగా ఇప్పటి వరకు నీట్ యూజీ 2025 పరీక్ష తేదీ వెల్లడికాలేదన్న సంగతి తెలిసిందే.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.