ఢిల్లీ, జనవరి 9: పోస్టు గ్రాడ్యుయేట్ వైద్య కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే జాతీయ అర్హత ప్రవేశ పరీక్ష నీట్ పీజీ- 2024 వాయిదా పడింది. ఈ మేరకు నేషనల్ బోర్డ్ ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) పరీక్ష తేదీలో మార్పు చేసినట్లు ప్రకటించింది. తొలుత ఈ పరీక్షను మార్చి 3న నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. అయితే ఈ పరీక్షను జులై 7న నిర్వహించనున్నట్లు నేషనల్ బోర్డు ఆఫ్ ఎగ్జామినేషన్స్ ఇన్ మెడికల్ సైన్సెస్ (NBEMS) మంగళవారం (జనవరి 9) ప్రకటించింది.
నీట్ పీజీ పరీక్ష రాసే అభ్యర్థుల అర్హతకు సంబంధించిన కటాఫ్ తేదీని ఆగస్టు 15, 2024గా నిర్ణయించింది. దీని ప్రకారం ఆగస్టు 15 లేదా అంతకన్నా ముందు ఇంటర్న్‌షిప్‌ను పూర్తి చేసిన ఎంబీబీఎస్ విద్యార్థులు మాత్రమే ఈ పరీక్షను రాసేందుకు అవకాశం ఉంటుంది. అయితే, ఈ పరీక్ష తేదీలో సైతం మార్పు జరిగే అవకాశం ఉంది. కచ్చితమైన తేదీలను తమ అధికారిక వెబ్‌సైట్‌లో ఎప్పటికప్పుడు చెక్ చేసుకోవడం ద్వారా తెలుసుకోవచ్చని NBEMS సూచించింది. తాజాగా ప్రకటించిన తేదీ కూడా తాత్కాలికమైనదని తెల్పింది. ఆమెదాలకు, నిర్ధారణకు లోబడి ఉంటాయని నోటిఫికేషన్‌లో పేర్కొంది.
కాగా మెడికల్ పోస్టు గ్రాడ్యుయేట్ మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి ప్రతీయేట నీట్ పీజీ పరీక్షను నిర్వహిస్తోన్న సంగతి తెలిసిందే. నేషనల్ మెడికల్ కమిషన్ యాక్ట్ 2019 కింద MD/MS, పోస్ట్-గ్రాడ్యుయేషన్ డిప్లొమా కోర్సుల్లో ప్రవేశాలు పొందగోరే విద్యార్ధులు ఈ ప్రవేశ పరీక్షలో ర్యాంకు సాధించి ఉండాలి. అయితే నీట్ పరీక్ష స్థానంలో నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) తీసుకురావాలని కేంద్రం భావించినప్పటికీ ఇది మరో ఏడాదికి వాయిదా పడింది. అంటే నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ (NExT) 2025లో ప్రారంభం అవుతుందని భావిస్తున్నారు. ఇది 2023లో ప్రారంభం కావాల్సి ఉండగా.. ఇటీవల నోటిఫై చేసిన పోస్ట్-గ్రాడ్యుయేట్ మెడికల్ ఎడ్యుకేషన్ రెగ్యులేషన్స్ 2023 ప్రకారం.. పోస్ట్ గ్రాడ్యుయేట్ అడ్మిషన్ కోసం ప్రతిపాదిత నేషనల్ ఎగ్జిట్ టెస్ట్ అమలులోకి వచ్చే వరకు నిబంధనల ప్రకారం NEET-PG పరీక్ష కొనసాగనుంది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.