TS Staff Nurse Final Results: తుది దశకు చేరుకున్న స్టాఫ్‌నర్సు పోస్టుల నియామక ప్రక్రియ.. మరో పది రోజుల్లో నియామక ఉత్తర్వులు
తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) చేపట్టిన స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది జాబితాను రిక్రూట్‌మెంట్ బోర్డు రెండు మూడు రోజుల్లో విడుదల చేయనుంది. ఎంపికైన అభ్యర్ధులకు పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో బోధనాసుపత్రులతోపాటు..
హైదరాబాద్, జనవరి 16: తెలంగాణ రాష్ట్ర వైద్య, ఆరోగ్య సేవల రిక్రూట్‌మెంట్ బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) చేపట్టిన స్టాఫ్‌నర్స్ ఉద్యోగాల భర్తీ ప్రక్రియ తుది దశకు చేరుకుంది. తుది జాబితాను రిక్రూట్‌మెంట్ బోర్డు రెండు మూడు రోజుల్లో విడుదల చేయనుంది. ఎంపికైన అభ్యర్ధులకు పది రోజుల్లోనే నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు రాష్ట్ర వైద్యారోగ్యశాఖ రంగం సిద్ధం చేస్తోంది. దీంతో బోధనాసుపత్రులతోపాటు వైద్య విధాన పరిషత్ తదితర ఆసుపత్రుల్లో మొత్తం 7,031 మంది స్టాఫ్‌నర్సులు అందుబాటులోకి రానున్నారు. దీనికి తోడు రాష్ట్రంలోని బీసీ, ఎస్టీ, మైనార్టీ, సాంఘిక సంక్షేమ గురుకులాల్లో మరో 500 మంది రెగ్యులర్ స్టాఫ్‌నర్సుల నియామకం కానుంది.
కాగా రాష్ట్ర వ్యాప్తంగా 7,094 స్టాఫ్‌నర్సు పోస్టుల భర్తీకి 2022 డిసెంబరు 30న నోటిఫికేషన్ విడుదల చేసింది. స్టాఫ్‌నర్సుల పోస్టుల భర్తీకి గత ఏడాది ఆగస్టు 2న నిర్వహించిన రాత పరీక్షకు రాష్ట్రవ్యాప్తంగా 40,936 మంది అభ్యర్థులు హాజరయ్యారు. రాతపరీక్షకు సంబంధించిన ఫలితాలను బోర్డు ఇటీవల వెల్లడించిన సంగతి తెలిసిందే. అభ్యంతరాల స్వీకరణ అనంతరం 9 వేల మందితో కూడిన మెరిట్ జాబితాను విడుదల చేసింది. వారందరికీ గతేడాది డిసెంబరు 30 నుంచి ధ్రువపత్రాల పరిశీలన చేపట్టారు. తొలుత 5,204 పోస్టుల భర్తీకే ప్రకటన ఇచ్చి పరీక్ష నిర్వహించినా తర్వాత కొత్తగా అనుమతించిన 1,827 పోస్టులను కూడా ఈ రిక్రూట్‌మెంట్ పరిధిలోకే తీసుకురావడంతో ఆ పోస్టుల సంఖ్య 7,031కు పెరిగాయి.
తుది ఎంపికలో ప్రభుత్వ వైద్య సేవలో అనుభవం ఉన్న వారికి ప్రత్యేకంగా పాయింట్లు చేర్చి అదనంగా మార్కులను కేటాయించి.. వీటి ఆధారంగా ప్రొవిజినల్ మెరిట్ జాబితాను రూపొందించింది. జనవరి 14న సాయంత్రం 5 గంటలకు మెరిట్ జాబితాపై ఆన్‌లైన్‌లో అభ్యంతరాల స్వీకరణ గడువు మిగిసింది. జనవరిలో జరిగిన రాష్ట్ర ఎన్నికల నేపథ్యంలో ఈ నియామక ప్రక్రియ సుమారు 3 నెలలపాటు అంతరాయం కలిగింది. ఇక మరో పది రోజుల్లో ఎంపికైన అభ్యర్ధులకు నియామక ఉత్తర్వులు ఇచ్చేందుకు అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.