AQI
TV9 Network
User
Sign In

By signing in or creating an account, you agree with Associated Broadcasting Company's Terms & Conditions and Privacy Policy.

AP టెన్త్ పబ్లిక్‌ 2026-27 పరీక్షల్లో భారీ మార్పులు.. ఇక బట్టీ పడితే కుదరదు బాస్! కొత్త విధానం ఇదే..

ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల విధానం మారనుంది. ముఖ్యంగా ప్రశ్నావళి శైలి, రూపకల్పన విషయంలో భారీ మార్పులు రానున్నాయి. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచిరాష్ట్ర వ్యాప్తంగా అమలులోకి రానుంది. ఇప్పటి వరకూ బ్లూమ్స్‌ టాక్సానమీ (వర్గీకరణ) అనే విధానం అమలు చేస్తున్న టెన్త్ పరీక్షల బోర్డు.. దానిని NCERT పరిధిలోని ‘పరఖ్‌’ వర్గీకరణ విధానంలోకి మార్చారు.

AP టెన్త్ పబ్లిక్‌ 2026-27 పరీక్షల్లో భారీ మార్పులు.. ఇక బట్టీ పడితే కుదరదు బాస్! కొత్త విధానం ఇదే..
AP SSC 10th Class Exams Pattern Changed
Srilakshmi C
|

Updated on: Jul 13, 2026 | 1:23 PM

Share

అమరావతి, జులై 13: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో పదో తరగతి పబ్లిక్ పరీక్షల విధానంలో కీలక మార్పులు చోటుచేసుకోనున్నాయి. ముఖ్యంగా ప్రశ్నాపత్రాల రూపకల్పన, ప్రశ్నల శైలి, మూల్యాంకన విధానంలో సమగ్ర సంస్కరణలు తీసుకురావాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కొత్త విధానం 2026-27 విద్యా సంవత్సరం నుంచి రాష్ట్రవ్యాప్తంగా అమల్లోకి రానుంది. ఇప్పటి వరకు పదో తరగతి పరీక్షల్లో అమలులో ఉన్న బ్లూమ్స్ టాక్సానమీ (Bloom’s Taxonomy) స్థానంలో, జాతీయ విద్యా పరిశోధన మరియు శిక్షణ మండలి (NCERT) పరిధిలోని ‘పరఖ్’ (PARAKH) వర్గీకరణ విధానాన్ని ఎస్‌ఎస్‌సీ బోర్డు ప్రవేశపెడుతోంది. ఈ మేరకు కొత్త బ్లూప్రింట్లను విడుదల చేసిన బోర్డు, విద్యార్థులు మరియు ఉపాధ్యాయులు కొత్త విధానంపై అవగాహన పెంపొందించుకోవాలని సూచించింది.

సృజనాత్మకతకు పెద్దపీట

కొత్త విధానంలో విద్యార్థులు కేవలం పాఠ్యపుస్తకాల్లోని విషయాలను కంఠస్థం చేసి రాయడం కాకుండా, వాటిని అర్థం చేసుకుని స్వతంత్రంగా ఆలోచించి సమాధానాలు రాయాల్సి ఉంటుంది. ముఖ్యంగా విద్యార్థుల్లో సృజనాత్మకత, విశ్లేషణాత్మక దృక్పథం, సమస్య పరిష్కార నైపుణ్యాలను పెంపొందించే లక్ష్యంతో ప్రశ్నలు రూపొందించనున్నారు. ఇప్పటి వరకు ప్రశ్నలను విజ్ఞానం, అవగాహన, అన్వయం, సృజనాత్మకత, మూల్యాంకనం వంటి విభాగాల ఆధారంగా వర్గీకరించేవారు. ఇకపై అవగాహన (Understanding), సున్నితత్వం (Sensitivity), సృజనాత్మకత (Creativity) అనే మూడు ప్రధాన విభాగాల ఆధారంగా ప్రశ్నలు రూపొందించనున్నారు.

కొత్త బ్లూప్రింట్ ప్రకారం వెయిటేజీ ఎలా ఉంటుందంటే..

  • అవగాహన విభాగం – 60%
  • సున్నితత్వం విభాగం – 20%
  • సృజనాత్మకత విభాగం – 20%

అవగాహన విభాగంలో విద్యార్థి పాఠ్యాంశంపై ఉన్న అవగాహన, కాన్సెప్టుల అర్థం, వాటి అన్వయంపై ప్రశ్నలు ఉంటాయి. సున్నితత్వం విభాగంలో భిన్నాభిప్రాయాలను గౌరవించడం, సామాజిక అంశాలపై అవగాహన, సానుకూల దృక్పథం, టీమ్‌వర్క్ వంటి అంశాలకు సంబంధించిన ప్రశ్నలు అడుగుతారు. సృజనాత్మకత విభాగంలో కొత్త ఆలోచనలు, కమ్యూనికేషన్ నైపుణ్యాలు, సమస్యలకు ప్రత్యామ్నాయ పరిష్కారాలు సూచించడం వంటి అంశాలపై ప్రశ్నలు ఉంటాయి. ఇంగ్లీష్ సబ్జెక్టులో మాత్రం అవగాహనకు 65 శాతం, సున్నితత్వానికి 15 శాతం వెయిటేజీ కేటాయించారు. విద్యార్థి ఆలోచనలకు ప్రాధాన్యం. సున్నితత్వం, సృజనాత్మకత విభాగాల్లో ఎక్కువగా ఓపెన్ ఎండెడ్ ప్రశ్నలు ఉండనున్నాయి. అంటే ఒక ప్రశ్నకు ఒకే సమాధానం కాకుండా, విద్యార్థి తన అవగాహన, ఆలోచనల ఆధారంగా వివిధ రకాలుగా సమాధానం రాయవచ్చు. దీంతో విద్యార్థుల్లో స్వతంత్ర ఆలోచన, విశ్లేషణా శక్తి, అభిప్రాయ వ్యక్తీకరణ సామర్థ్యం పెరిగే అవకాశం ఉందని విద్యాశాఖ అధికారులు భావిస్తున్నారు. ప్రశ్నల క్లిష్టత కూడా మారుతుంది

కొత్త విధానంలో ప్రశ్నల స్థాయిని కూడా మూడు విభాగాలుగా విభజించారు. అవేమంటే..

  • సులభమైన ప్రశ్నలు – 25% నుంచి 30%
  • మోస్తరు ప్రశ్నలు – 50%
  • క్లిష్టమైన ప్రశ్నలు – 20%

ఈ విధానం ద్వారా అన్ని స్థాయిల విద్యార్థులకు సమాన అవకాశాలు కల్పించడంతో పాటు ప్రతిభావంతులైన విద్యార్థుల సామర్థ్యాన్ని కూడా పరీక్షించనున్నారు.

కొత్త తరహా ప్రశ్నలకు శ్రీకారం

సోషల్ స్టడీస్, బయాలజీ, ఇంగ్లీష్ తదితర సబ్జెక్టుల్లో కొత్త తరహా ప్రశ్నలు ఇవ్వనున్నట్లు బ్లూప్రింట్‌లో స్పష్టమైంది. సోషల్ స్టడీస్‌లో లింగ సమానత్వం, సుస్థిరాభివృద్ధి వంటి సామాజిక అంశాలపై ప్రశ్నలు ఉండగా, బయాలజీలో ఆరోగ్య అవగాహన, జీవనశైలి ఎంపికలపై ప్రశ్నలు కనిపిస్తున్నాయి. ఇంగ్లీష్‌లో ప్రసంగాల రచన, అధికారిక మరియు అనధికారిక లేఖల తయారీ, కమ్యూనికేషన్ నైపుణ్యాలకు సంబంధించిన ప్రశ్నలకు ప్రాధాన్యం ఇవ్వనున్నారు. విద్యార్థులు ఇకపై కేవలం పాఠ్యాంశాలను కంఠస్థం చేయడం సరిపోదు. విషయాలను లోతుగా అర్థం చేసుకోవడం, విశ్లేషించడం, తమ అభిప్రాయాలను స్పష్టంగా వ్యక్తీకరించడం వంటి నైపుణ్యాలను పెంపొందించుకోవాల్సి ఉంటుంది. కొత్త పరీక్షా విధానం ద్వారా విద్యార్థులను మార్కుల కోసం చదివే విధానం నుంచి బయటకు తీసుకువచ్చి, ఆలోచించే, విశ్లేషించే, సృజనాత్మకంగా స్పందించే పౌరులుగా తీర్చిదిద్దడమే లక్ష్యమని విద్యా నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Follow Us