ప్రపంచ వ్యాప్తంగా ఉద్యోగుల తొలగింపు కొనసాగుతూనే ఉంది. అంతర్జాతీయ దిగ్గ సంస్థలైన గూగుల్, ట్విట్టర్, మెటా, మైక్రోసాఫ్ట్, ఐబీఎమ్ వంటి సంస్థలు ఇప్పటికే వేలాది మంది ఉద్యోగులను ఇంటికి పంపించాయి. ఎప్పుడు కంపెనీ పింక్ స్లిప్ పంపిస్తుందన్న ఆందోళనలో ఉన్నారు ఉద్యోగులు. బడా కంపెనీల పరిస్థితే ఇలా ఉంటే ఇక కొన్ని స్టార్టప్‌లైతే ఏకంగా మూతపడే స్థాయికి చేరుకున్నాయి. ప్రపంచవ్యాప్తంగా ఆర్థికమాంద్యం తప్పదన్న వార్తల నేపథ్యంలో ఉద్యోగుల తొలగింపు ఇప్పుడు భయపెడుతోంది. ఈ నేపథ్యంలోనే తాజాగా మరో కంపెనీ ఉద్యోగులను ఇంటికి సాగనంపుతోంది.
ఆన్‌లైన్‌లో సెకండ్ హ్యాండ్ వస్తువుల అమ్మకాలు, కొనుగోలు చేసే ఓలెక్స్ ఉద్యోగులను తొలగించేందుకు సిద్ధమైంది. ఈ సంస్థ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తమ ఉద్యోగుల్లో 15 శాతం తొలగించేందుకు సిద్ధమవుతోంది. ప్రస్తుతం ఓఎల్‌ఎక్స్‌లో మొత్తం 10000 మంది ఉద్యోగులు పనిచేస్తుండగా వీరిలో సుమారు 1500 మందిని తొలగించనున్నారు. వీరిలో భారతీయ ఉద్యోగులు సైతం ఉన్నారు.
రానున్న రోజుల్లో మాంద్యం తప్పదన్న కారణంతోనే ఓఎల్‌ఎక్స్ ఉద్యోగులను తొలగిస్తున్నట్లు సమాచారం. ఇదిలా ఉంటే ఓఎల్‌ఎక్స్ తీసుకున్న ఈ నిర్ణయంతో ముఖ్యంగా ఇంజినీరింగ్, ఆపరేషన్స్ టీమ్‌లో పనిచేసే ఉద్యోగులపై ప్రభావం పడే అవకాశం ఉంది. ఖర్చులు తగ్గించుకునేందుకే కంపెనీ ఉద్యోగులను తొలగించినట్లు సంస్థ ప్రతినిధి ఒకరు తెలిపారు. 2009లో భారత్‌లో ప్రారంభమైన ఓఎల్‌ఎక్స్ అనతి కాలంలోనే మంచి లాభాలను ఆర్జించింది. 2020లో ఓఎల్‌ఎక్స్ ఆటో పేరిట కార్ల అమ్మకాల వ్యాపారంలోకి ఎంట్రీ ఇచ్చింది. ఇదిలా ఉంటే ఓఎల్‌ఎక్స్ ఈ స్థాయిలో ఉద్యోగులను తొలగించడం ఇదే తొలిసారి కావడం గమనార్హం. ఇదిలా ఉంటే రానున్న ఆరు నెలల్లో మాంద్యం ప్రభావం మరింత తీవ్రంగా ఉండనుందన్న వార్తల నేపథ్యంలో ఇంకెంత మంది ఉద్యోగాలు కోల్పోవాల్సి వస్తుందోనన్న ఆందోళనలు పెరుగుతున్నాయి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..