అమరావతి, డిసెంబర్ 30: ఉన్నత విద్యామండలి ఛైర్మన్‌గా మధుమూర్తి బాధ్యతలు చేపట్టారు. మంగళగిరిలోని మండలి కార్యాలయంలో ఆయన ఈ మేరకు బాధ్యతలు స్వీకరించారు. అధికారులు, ఉద్యోగులు ఈ సందర్భంగా ఆయనకు శుభాకాంక్షలు తెలిపారు. నిట్ వరంగల్‌లో మెకానికల్ సీనియర్ ప్రొఫెసర్‌గా పని చేస్తున్న ఆయనను ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం ఉన్నత విద్యా మండలి ఛైర్మన్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీ చేసిన విషయం తెలిసిందే.
అలాగే ఏఐసీటీఈ సలహాదారుగా, ఎన్‌ఐటీల నిధుల సమన్వయకర్తగా, జాతీయ వృత్తి విద్యామండలి సభ్యునిగా.. ఇలా జాతీయ స్థాయిలోనూ వివిధ హోదాల్లో ఆయన పనిచేశారు. బాధ్యతలు స్వీకరించిన అనంతరం విశ్వవిద్యాలయాల ఉపకులపతుల నియామకాలకు వచ్చిన దరఖాస్తుల పరిశీలన ప్రక్రియ, ఉన్నత విద్యలో వెంటనే తీసుకోవాల్సిన చర్యలపై సిబ్బందితో ఆయన చర్చించారు. ఇక మధుమూర్తి మూడేళ్ల కాలవ్యవధితో ఈ పదవిలో కొనసాగనున్నారు. ఉన్నత విద్యా మండలి చైర్మన్ ఎంపికపై సుదీర్ఘకాలం కసరత్తు చేసిన ప్రభుత్వం చివరకు ఆయనను నియమించింది.
తెలంగాణ మల్టీపర్పస్ హెల్త్ అసిస్టెంట్ (మహిళలు) పోస్టుల భర్తీ కోసం వైద్య ఆరోగ్య సేవల నియామక బోర్డు (ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ) ఆదివారం (డిసెంబర్ 29) నిర్వహించింది. కంప్యూటర్ ఆధారితంగా నిర్వహించిన ఈ పరీక్ష (సీబీటీ)కు రాష్ట్ర వ్యాప్తంగా 84.89 శాతం మంది అభ్యర్థులు హాజరైనట్లు బోర్డు ఒక ప్రకటనలో వెల్లడించింది. ఈ పోస్టులకు మొత్తం 24,268 మంది అభ్యర్థులు దరఖాస్తు చేసుకోగా.. 20,600 మంది పరీక్ష రాశారు. త్వరలోనే ఫలితాలు విడుదల చేయనున్నట్లు ఎంహెచ్‌ఎస్‌ఆర్‌బీ పేర్కొంది.