20 ఏళ్ల నిరీక్షణకు చేదు ముగింపు.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్

Jharkhand Teacher Appointment controvers: ప్రభుత్వ ఉద్యోగం సంపాదించాలనేది ఎందరికో కల. కానీ ఓ వ్యక్తికి ఆ కల కళ్ల ముందే కరిగిపోయింది. సోమవారం అపాయింట్‌మెంట్‌ ఇచ్చి.. మంగళవారమే ఆ వ్యక్తికి రిటైర్‌మెంట్‌ ప్రకటించడం.. ఎలా ఉంటుందో ఊహించండి. జార్ఖండ్‌లో సరిగ్గా ఇదే జరిగింది. 20 ఏళ్ల ఎదురుచూపుల తర్వాత ప్రభుత్వ ఉద్యోగం కల నెరవేరినా.. విధులు నిర్వర్తించే అవకాశమే లేకుండాపోవడంతో ఓ టీచర్‌ తల్లడిల్లిపోయాడు..

20 ఏళ్ల నిరీక్షణకు చేదు ముగింపు.. ప్రభుత్వ కొలువు వచ్చిన మర్నాడే రిటైర్‌మెంట్
Teacher Retires A Day After Appointment

Updated on: Jul 01, 2026 | 4:21 PM

రాంచి, జులై 1: రిటైర్మెంట్‌ వయసుకు ఒకరోజు ముందు పోస్టింగ్‌ లెటర్ ఇచ్చి చోద్యం చూసిన ఝార్ఖండ్‌ సర్కార్‌ పనితనం దేశ వ్యాప్తంగా సంచలనంగా మారింది. జార్ఖండ్‌లోని జామ్తాఢా జిల్లాకు చెందిన నందలాల్ 2006 నుంచి పారాటీచర్‌గా పనిచేస్తున్నాడు. గతంలో ఉపాధ్యాయుల కొరతను తీర్చేందుకు అక్కడి ప్రభుత్వం వేలాది మంది పారా టీచర్లను తాత్కాలికంగా నియమించింది. శాశ్వత హోదా, వేతన సమానత్వం కోసం ఝార్ఖండ్‌లోని ఈ తాత్కాలిక టీచర్లు చాలాకాలంగా ఆందోళన చేస్తున్నారు. వారి డిమాండ్లకు తలొగ్గిన అక్కడి సర్కార్ పర్మినెంట్ అసిస్టెంట్ టీచర్‌ పోస్టుల్లో 50 శాతం ఉద్యోగాలను వీరికి కేటాయించింది (2026 మేలో సుప్రీం కోర్టు తీర్పు మేరకు). వీరిటో TETలో అర్హత సాధించిన వారిని రెగ్యులర్ టీచర్లుగా ఉద్యోగాలు ఇచ్చింది.

నందలాల్‌ 2016లోనే టెట్‌లో అర్హత సాధించాడు. 2023లో రెగ్యులర్‌ నియామకాల కోసం ప్రభుత్వం దరఖాస్తులు స్వీకరించగా.. నందలాల్‌తోపాటు అనేక మంది పారా టీచర్లు దరఖాస్తు చేసుకున్నారు. అప్పుడు ఆయన వయసు 57 ఏళ్లు. ఈ నియామక ప్రక్రియ పూర్తవడానికి సుమారు మూడేళ్లు పట్టింది. దీంతో నాడు దరఖాస్తు చేసుకున్న చాలా మంది టీచర్లకు వయసు 60 ఏళ్లకు చేరుకుంది. ఈ క్రమంలో జూన్ 29న నందలాల్‌కు అపాయింట్‌మెంట్ లెటర్‌ను ప్రభుత్వం అందించింది. అయితే ఆ మరుసటి రోజే ఆయనకు 60 ఏళ్లు నిండటంతో ఆయన షాకయ్యాడు. ఝార్ఖండ్ ప్రభుత్వ నిబంధనల ప్రకారం రిటైర్మెంట్ వయసు 60 ఏళ్లు.. దీంతో రిటైర్‌మెంట్‌ వయసుకు ఒకరోజు ముందు పోస్టింగ్‌ లెటర్ రావడంతో నందలాల్ పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. 2006 నుంచి సుమారు 20 ఏళ్లుగా టీచర్‌గా పనిచేశాను. ఏళ్లుగా రెగ్యులర్ నియామకాల కోసం ఎదురుచూస్తే.. ఇన్నేళ్లకు అపాయింట్‌మెంట్ లెటర్ వచ్చింది. కానీ ఆ సంతోషం ఒక్కరోజులోనే కరిగిపోయిందని వాపోయాడు.

ఇవి కూడా చదవండి

రిటైర్‌మెంట్‌ తర్వాత మరో ముదుసలికి అపాయింట్‌మెంట్‌ లెటర్‌ అందజేత

జిల్లాలోని పలామూ ప్రాంతానికి చెందిన నియుమ్ అన్సారీది కూడా సరిగ్గా అదే పరిస్థితి. మే 31న ఆయనకు 60 ఏళ్లు దాటాయి. రిటైర్మెంట్ వయసు దాటిన ఆయన్ను రెగ్యులర్ టీచర్‌గా నియమిస్తూ జులై 29న అపాయింట్‌మెంట్ లెటర్ రావడంతో బిక్కసచ్చిపోయాడు. నియామక పత్రం అందుకున్నందుకు సంతోషంగా ఉంది, కానీ సేవ చేసే అవకాశం నాకు లభించలేదు. ఈ నియామక పత్రాన్ని నా జీవితంలోని ఒక చిరస్మరణీయ విజయంగా నా వద్దే ఉంచుకుంటానని ఆయన అన్నారు. కాగా జార్ఖండ్‌ రాజధాని రాంచీలో ఏర్పాటు చేసిన కార్యక్రమంలో ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ 1042 టీచర్లకు అపాయింట్‌మెంట్‌ లెటర్లు అందించారు. ఈ సందర్భంగా ఉపాధ్యాయులను ఉద్దేశించి సీఎం హేమంత్‌ మాట్లాడుతూ.. కొత్తగా నియమితులైన ఉపాధ్యాయులు రాష్ట్ర మేధో సంపత్తి భవిష్యత్తును, అలాగే రాబోయే తరం తమ కాళ్ల మీద తాము ఎలా నిలబడుతుందో నిర్ణయిస్తారని అన్నారు. అయితే ఆ పని కోసం చాలా మందికి కొన్ని వారాలు, ఒక్క రోజు లేదా అంత సమయం కూడా ఉండదని గౌరవ సీఎం గ్రహించలేకపోవడం శోచనీయం.

Follow Us