
హైదరాబాద్, జనవరి 17: జేఈఈ మెయిన్ 2026 సెషన్ 1 పరీక్షలకు మరో 3 రోజులే సమయం ఉంది. జనవరి 21 నుంచి జేఈఈ మెయిన్ పరీక్షలు దేశ వ్యాప్తంగా ప్రారంభం కానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో శనివారం (జనవరి 17) జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు విడులద కానున్నాయి. ఈ మేరకు నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (NTA) ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. ఇప్పటికే పరీక్ష తేదీలు, సిటీ ఇంటిమేషన్ స్లిప్పులను అందుబాటులోకి తీసుకొచ్చిన ఎన్టీయే శనివారం నుంచి అడ్మిట్ కార్డులు డౌన్‌లోడ్ చేసుకోవడానికి రంగం సిద్ధం చేస్తున్నారు. ఈ పరీక్షలకు మూడు లేదా నాలుగు రోజుల ముందు మాత్రమే అడ్మిట్ కార్డుల్ని వెబ్‌సైట్‌లో డౌన్‌లోడ్ చేసుకోవడానికి అందుబాటులోకి తీసుకొస్తామని ఇప్పటికే ఎన్టీయే పలుమార్లు వెల్లడించింది. దీన్నిబట్టి చూస్తే జనవరి 21న జరిగే జేఈఈ మెయిన్ పరీక్షకు జనవరి 17వ తేదీన అడ్మిట్ కార్డులు విడుదల చేసే అవకాశం ఉంది.
కాగా షెడ్యూల్ ప్రకారం జనవరి 21, 22, 23, 24, 28 తేదీల్లో జేఈఈ మెయిన్ పేపర్ 1 పరీక్ష, జనవరి 29న పేపర్ 2 పరీక్ష దేశ వ్యాప్తంగా జరగనున్నాయి. ఆయా తేదీల్లో రోజుకు రెండు షిఫ్టుల్లో ఈ పరీక్షలు జరుగుతాయి. మొదటి షిఫ్టు ఉదయం 9 గంటల నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు, రెండో షిఫ్టు మధ్యాహ్నం 3 గంటల నుంచి సాయంత్రం 6 గంటల వరకు నిర్వహించనున్నారు. ఆయా పరీక్షలకు 3 లేదా 4 రోజుల ముందుగా మాత్రమే అడ్మిట్ కార్డులు విడుదలవుతాయి. గతేడాది కూడా ఎన్టీయే ఇదే పద్ధతి అనుసరించింది. జేఈఈ మెయిన్ 2025 పరీక్షలు జనవరి 22 నుంచి 30 వరకు పరీక్షలు జరిగాయి. అప్పుడు కూడా జనవరి 22, 23, 24న జరిగే పరీక్షలకు జనవరి 18న అంటే సరిగ్గా 4 రోజుల ముందుగా అడ్మిట్ కార్డుల్ని విడుదల చేసింది.
అలాగే జనవరి 28, 29, 30 తేదీల్లో జరగాల్సిన పరీక్షలకు జనవరి 23న అడ్మిట్ కార్డుల్ని డౌన్‌లోడ్ చేసుకోవడానికి అవకాశం ఇచ్చింది. ఏ విధంగా చూసినా జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డులు ఈ రోజు విడుదలయ్యే అవకాశాలు దండిగా కనిపిస్తున్నాయి. అడ్మిట్ కార్డుల డౌన్‌లోడ్ లింక్ యాక్టివ్ అయిన తర్వాత అభ్యర్ధులు తమ అప్లికేషన్ నంబర్, పుట్టిన తేదీ వివరాలతో లాగిన్ అయ్యి, జేఈఈ మెయిన్ అడ్మిట్ కార్డును డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. డౌన్‌లోడ్ తర్వాత దానిపై పరీక్ష కేంద్రం, సిటీ, సమయం, ఫొటో, సంతకం వంటి ఇతర వివరాలన్నీ సరిగ్గా ఉన్నయో లేదో చూసుకోవాలి. ఏవైనా తప్పులు ఉంటే jeemain@nta.ac.in ద్వారా ఎన్‌టీఏను సంప్రదించవచ్చు. ఇతర వివరాలు అధికారిక వెబ్‌సైట్‌లో చెక్ చేసుకోవచ్చు.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.