
Is Calculator allowed in JEE Mains 2026 Exam? హైదరాబాద్, నవంబర్ 4: జేఈఈ మెయిన్ 2026 తొలి సెషన్ పరీక్షలు ఆన్‌లైన్ విధానంలో జరగనున్న సంగతి తెలిసిందే. ఈ పరీక్షలకు సంబంధించిన షెడ్యూల్ కూడా ఇటీవల విడుదలైంది. అయితే జేఈఈ మెయిన్ పరీక్షలకు హాజరయ్యే విద్యార్ధులకు పరీక్ష కేంద్రంలోకి కాలిక్యులేటర్స్ అనుమతి ఇస్తారా? లేదా? అనే సందేహం నెలకొంది. ఈ క్రమంలో తాజాగా ఎన్టీయే వివరణ ఇచ్చింది. జేఈఈ మెయిన్ పరీక్షలకు ఏ రూపంలోనూ కాలిక్యులేటర్‌ను అనుమతించబోమని ఎన్‌టీఏ స్పష్టం చేసింది.
నిజానికి అక్టోబర్ 31న జేఈఈ మెయిన్‌కు సంబంధించిన అధికారిక వెబ్‌సైట్‌లో ఎన్‌టీఏ పూర్తి వివరాలను వెల్లడిస్తూ ప్రకటన అందుబాటులో ఉంచింది. అందులో వర్చువల్ కాలిక్యులేటర్‌ను జేఈఈ మెయిన్ పరీక్షకు వినియోగించుకోవచ్చని పేర్కొంది. దీంతో విద్యార్ధులు ఈ పరీక్షకు కాలిక్యులేటర్ వినియోగించుకోవచ్చని సంబరపడ్డారు. అయితే తాజాగా నవంబరు 2న దానిపై ఆ సంస్థ వివరణ ఇచ్చింది. ఇందులో గతంలో ఇచ్చిన ప్రకటనలో పొరపాటు దొర్లిందని, అందువల్లనే కాలిక్యులేటర్ కు అనుమతి ఇస్తున్నట్లు అందులో వచ్చిందని తెలిపింది. అయితే జేఈఈ మెయిన్ పరీక్షలకు ఎట్టిపరిస్థితుల్లోనూ ఎటువంటి కాలిక్యులేటర్‌ను అనుమతించడం లేదని, విద్యార్థులు ఈ విషయాన్ని గమనించాలని స్పష్టం చేసింది.
కాగా దేశవ్యాప్తంగా ఉన్న ఎన్‌ఐటీ, ఐఐటీ, జీఎఫ్‌టీఐ వంటి ప్రతిష్టాత్మక ఇంజినిరింగ్, ఆర్కిటెక్చర్, ప్లానింగ్ ఇన్‌స్టిట్యూట్లలో 2026-27 విద్యా సంవత్సరానికి సంబంధించి బీటెక్, బీఆర్క్ సీట్ల భర్తీకి నిర్వహించే జేఈఈ మెయిన్ 2026 తొలి విడత పరీక్షలు వచ్చే ఏడాది జనవరి 21 నుంచి 30 మధ్య జరగనున్న సంగతి తెలిసిందే. ఆయా తేదీల్లో ఈ పరీక్ష ఉదయం 9 నుంచి 12 గంటల వరకు, మధ్యాహ్నం 3 నుంచి 6 గంటల వరకు రోజుకు రెండు షిఫ్టుల్లో మొత్తం 13 భాషల్లో జరుగుతాయి. పరీక్షలుతాయి. ఫిబ్రవరి 12 నాటికి జేఈఈ మెయిన్ 2026 తొలి విడత ఫలితాలు వెల్లడించే అవకాశం ఉంది. ప్రస్తుతం ఆన్‌లైన్ దరఖాస్తు ప్రక్రియ కొనసాగుతుంది. నవంబర్ 27 వరకు దరఖాస్తులు స్వీకరించనున్నారు.
జేఈఈ మెయిన్ 2026 నోటిఫికేషన్ కోసం ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.