JEE Advanced 2026 Results: జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఫలితాలు విడుదల.. ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంకర్ ఎవరో తెలుసా..?
దేశవ్యాప్తంగా లక్షలాది మంది విద్యార్థులు ఎంతో ఉత్కంఠగా ఎదురుచూసిన జేఈఈ అడ్వాన్స్‌డ్ ఫలితాలు వచ్చేశాయి. దేశంలోనే అత్యంత కఠినమైన ఈ ప్రవేశ పరీక్షలో ఐఐటీ ఢిల్లీ జోన్ విద్యార్థులు టాప్ 3 ర్యాంకులతో క్లీన్ స్వీప్ చేసి సరికొత్త చరిత్ర సృష్టించారు. 360 మార్కులకు గాను ఏకంగా 330 మార్కులు సాధించి ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌తో శుభమ్ కుమార్ టాపర్‌గా నిలిచారు.

దేశంలోని ప్రతిష్టాత్మక ఐఐటీలలో ప్రవేశాల కోసం నిర్వహించిన జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 పరీక్ష ఫలితాలు విడుదలయ్యాయి. దేశంలోనే అత్యంత కఠినమైన ప్రవేశ పరీక్షగా భావించే ఇందులో ఈసారి ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన విద్యార్థులు తిరుగులేని ఆధిపత్యాన్ని ప్రదర్శించారు. కామన్ ర్యాంక్ లిస్ట్‌లో ఆల్ ఇండియా ఫస్ట్ ర్యాంక్‌ను ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన శుభమ్ కుమార్ కైవసం చేసుకుని దేశంలోనే టాపర్‌గా నిలిచారు. మొత్తం 360 మార్కులకు గాను శుభమ్ కుమార్ ఏకంగా 330 మార్కులు సాధించి సరికొత్త రికార్డు సృష్టించారు.
అదరగొట్టిన ఐఐటీ ఢిల్లీ జోన్
ఈ ఏడాది అగ్ర ర్యాంకుల్లో ఐఐటీ ఢిల్లీ జోన్ క్లీన్ స్వీప్ చేసింది. దేశంలోనే టాప్ 3 ర్యాంకులు సాధించిన ముగ్గురు విద్యార్థులు కూడా ఈ జోన్ నుంచే కావడం విశేషం. శుభమ్ కుమార్ 330 మార్కులతో మొదటి స్థానంలో నిలవగా.. అదే జోన్‌కు చెందిన కబీర్ చిల్లర్ కేవలం ఒక్క మార్కు తేడాతో అగ్ర స్థానాన్ని చేజార్చుకుని ఆల్ ఇండియా సెకండ్ ర్యాంక్ సాధించారు. అలాగే 319 మార్కులతో జతిన్ చాహర్ ఆల్ ఇండియా థర్డ్ ర్యాంక్‌ను తన సొంతం చేసుకున్నారు. ఇక మహిళా అభ్యర్థుల విషయానికి వస్తే.. ఐఐటీ ఢిల్లీ జోన్‌కు చెందిన ఆరోహి దేశ్‌పాండే దేశంలోనే అత్యధిక ర్యాంకు సాధించిన మహిళగా నిలిచారు. ఆమె 360 మార్కులకు గాను 280 మార్కులు సాధించి, ఆల్ ఇండియా 77వ ర్యాంక్ కైవసం చేసుకున్నారు.ః
ఈ సంవత్సరం జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు విద్యార్థుల నుండి భారీ స్పందన వచ్చింది. దేశవ్యాప్తంగా మొత్తం 1,87,389 మంది అభ్యర్థులు ఈ పరీక్ష కోసం నమోదు చేసుకోగా.. ఈ ఏడాది మే 17న నిర్వహించిన పేపర్ 1, పేపర్ 2 పరీక్షలకు 1,79,694 మంది విద్యార్థులు హాజరయ్యారు. వీరిలో దేశవ్యాప్తంగా ఉన్న ఐఐటీలు, ఇతర ఉన్నత విద్యాసంస్థలలో ప్రవేశానికి మొత్తం 56,880 మంది అభ్యర్థులు అర్హత సాధించారు. విజయం సాధించిన వారిలో 10,107 మంది మహిళా అభ్యర్థులు ఉండటం విశేషం.
ఫలితాల ప్రకటన ముగియడంతో ఇప్పుడు విద్యార్థులందరి దృష్టి జాయింట్ సీట్ అలకేషన్ అథారిటీ 2026 కౌన్సెలింగ్, సీట్ల కేటాయింపు ప్రక్రియపైకి మళ్లింది. పరీక్షలో అర్హత సాధించిన దాదాపు 57,000 మంది అభ్యర్థులు వారి 12వ తరగతి మార్కులు లేదా పర్సెంటేజ్‌తో సంబంధం లేకుండా ఈ కౌన్సెలింగ్‌లో పాల్గొనవచ్చు. అయితే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2026 ఇన్ఫర్మేషన్ బ్రోచర్‌లో పేర్కొన్న అన్ని అర్హతా ప్రమాణాలు, నిబంధనలను అభ్యర్థులు పూర్తి చేసిన తర్వాతే ఐఐటీలలో తుది ప్రవేశం, సీటు నిర్ధారణ జరుగుతుంది. ఈ కౌన్సెలింగ్ ద్వారా దేశంలోని ప్రముఖ ఐఐటీలతో పాటు ఇతర టాప్ ఇంజనీరింగ్ కాలేజీలలో సీట్ల భర్తీ ప్రక్రియ ప్రారంభం కానుంది.
