హైదరాబాద్, నవంబర్ 20: దేశ వ్యాప్తంగా ఉన్న జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో ఖాళీగా ఉన్న సీట్ల భర్తీకి సంబంధించి దరఖాస్తు గడువు మరోమారు పెరిగింది. ఇప్పటికే పలుమార్లు తుది గడువు పొడిగించిన కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ.. తాజాగా మరోమారు దరఖాస్తు గడువు పెంపొందించింది. అర్హులైన విద్యార్థులు ‘జేఎన్‌వీ లేటరల్ ఎంట్రీ ప్రవేశ పరీక్ష’కు నవంబర్ 26వ తేదీలోగా దరఖాస్తు చేసుకోవచ్చని కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వశాఖ ప్రకటించింది. దరఖాస్తుల్లో ఏవైనా తప్పులు దొర్లితే వాటి సవరణను 27, 28 తేదీల్లో చేసుకోవచ్చు.
కాగా దేశంలోని మొత్తం 650 జవహర్ నవోదయ విద్యాలయాల్లో 9, 11వ తరగతుల్లో 2025-26 విద్యా సంత్సరానికి ప్రవేశాలు కల్పించనున్నారు. ఆంధ్రప్రదేశ్‌లో 15, తెలంగాణలో 9 నవోదయ విద్యాలయాలు ఉన్నాయి. ప్రవేశ పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు ఆయా నవోదయ పాఠశాలల్లో ప్రవేశాలు కల్పిస్తారు. ఎంపికైన వారికి ఉచిత విద్యతోపాటు బాలబాలికలకు వేర్వేరు ఆవాస, వసతి సౌకర్యాలు కల్పిస్తారు. ఆసక్తి కలిగిన విద్యార్ధులు ఆన్‌లైన్‌లో జేఎన్‌వీ అధికారిక వైబ్‌సైట్ ద్వారా దరఖాస్తు చేసుకోవచ్చు. ప్రవేశ పరీక్ష దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో వచ్చే ఏడాది ఫిబ్రవరి 8న నిర్వహించనున్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో 2025-26 విద్యా సంవత్సరం నుంచి పీజీ వైద్య విద్యలో వంద శాతం సీట్లను రాష్ట్ర విద్యార్థులతోనే భర్తీ చేయనున్నట్లు రాష్ట్ర ఆరోగ్య శాఖ ప్రకటించింది. ఇప్పటి వరకూ పొరుగు రాష్ట్రాల విద్యార్థులు రాష్ట్రంలో స్థానికేతర కోటాలో ఎంబీబీఎస్ పూర్తి చేస్తే.. స్థానిక విద్యార్థులుగానే గుర్తించి, పీజీ వైద్య విద్యలో 2023-24 వరకు ప్రవేశాలు కల్పించారు. అయితే 2024-25 నుంచి మాత్రం ఈ అవకాశం ఉండదు. తెలంగాణ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఎంబీబీఎస్ పూర్తి చేయడాన్ని కాకుండా.. ఇంటర్ విద్య ప్రామాణికంగా స్థానికతను ప్రామాణికంగా గుర్తిస్తున్నట్లు ప్రకటించింది. దాని ప్రకారమే ప్రవేశాల విషయంలోనూ చర్యలు తీసుకుంటోంది. దీంతో తెలంగాణలో ఎంబీబీఎస్ చదివిన ఏపీ విద్యార్థులు.. అక్కడ పీజీ చదువుకునే అవకాశం లేకుండా పోయింది. ఈ పరిణామాల నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం దీరిపై చర్చలు జరిపి.. 2025-26 నుంచి కొత్త విధానాన్ని అమలు చేయాలని నిర్ణయించింది.