లేఆఫ్స్.. ప్రస్తుతం కార్పొరేట్ ప్రపంచంలో ఈ పదం భయపెడుతోంది. ఆర్థిక మాంద్యం ముంచుకొస్తుందన్న వార్తల నేపథ్యంలో చాలా కంపెనీలు నిర్ధాక్షణ్యంగా తమ ఉద్యోగులను తొలగిస్తున్నాయి. గూగుల్, అమెజాన్, ఫేస్‌బుక్ వంటి దిగ్గజ సంస్థలు సైతం భారీగా ఉద్యోగులను తొలగించాయి. దీంతో ఎప్పుడు ఉద్యోగం కోల్పోవాల్సి వస్తుందోనని అంతా భయపడే పరిస్థితి వచ్చింది.
ఇక దిగ్గజ కంపెనీల పరిస్థితే అలా ఉంటే చిన్న చిన్న స్టార్టప్‌ల గురించి ప్రత్యేకంగా చెప్పేది ఏముంది. స్టార్టప్ కంపెనీలు సైతం ఉద్యోగులను తొలగిస్తున్నాయి. ఆర్థిక మాంద్యం నేపథ్యంలో ఖర్చులను తగ్గించుకునే ఉద్దేశంతో స్టార్టప్ కంపెనీలు ఉద్యోగులకు ఉద్వాసన పలుకుతున్నాయి. ఈ ఏడాదిలో గడిచిన తొలి ఆరు నెలలలో స్టార్టప్ సంస్థలు ఏకంగా 10 వేల మందిని ఉద్యోగాల నుంచి తొలగించినట్లు గణాంకాలు చెబుతున్నారు. అయితే ఇక్కడ సంతోషించాల్సిన విషయం ఏంటంటే.. గతేడాదితో పోల్చితే ఇది తక్కువ కావడం గమనార్హం.
2023లో జనవరి నుంచి జూన్‌ల వరకు ఏకంగా 21 వేల మంది ఉద్యోగులను తొలగించాయని లాంగ్ హౌస్ కన్సల్టింగ్ సంస్థ నివేదిక తెలిపింది. స్విగ్గీ, ఓలా, కల్ట్ ఫిట్, లిసియస్, ప్రిస్టియన్ కేర్, బైజూ వంటి వెంచర్ ఫండింగ్ సంస్థలు పొదుపు చర్యల్లో భాగంగా ఉద్యోగులను ఇంటికి పంపించాయని సీనియర్ హెచ్ఆర్ ప్రొఫెషనల్స్, ఇండస్ట్రీ ఎగ్జిక్యూటివ్‌లు తెలిపారు. ఇదిలా ఉంటే ఉద్యోగాల తొలగింపు ప్రక్రియ మరికొన్ని రోజులు కొనసాగే అవకాశం ఉందని చెబుతున్నారు. వచ్చే ఆరునెలలో మరో 5వేల మంది ఉద్యోగులను తొలగించే అవకాశం ఉన్నట్లు అంచనా వేస్తున్నారు. అయితే తొలగించిన ఉద్యోగుల్లో 15-20 శాతం ఉద్యోగాలను మాత్రమే స్టార్టప్ సంస్థలు భర్తీ చేస్తుండడం గమనార్హం.
ఇదిలా ఉంటే ఫ్లిప్ కార్ట్, పేటీఎం వంటి సంస్థలు సైతం ఉద్యోగులను తొలగిస్తుండడం ఆందోళన కలిగిస్తోంది. ఈ ఏడాది మొదట్లోనే ఫ్లిప్‌కార్ట్ ఏకంగా 1500 మందిని తొలగించింది. స్విగ్గీ సైతం 400 మందిని తొలగించింది. ఒక ఓలా సైతం ఏకంగా 600 మందికి పింక్ స్లిప్‌లు అందజేసింది. మరి ఈ ఉద్యోగాల కొనసాగింపు ఈ ఏడాదితోనైనా ముగుస్తాయా వచ్చే ఏడాది కూడా ఇలాగే కొనసాగుతాయా చూడాలి.
మరిన్ని విద్య, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి..