IIT JEE Advanced Registration: దేశంలోని ఐఐటీల్లో ప్రవేశాల కోసం నిర్వహించే జేఈఈ అడ్వాన్స్‌డ్ 2021 రిజిస్ట్రేషన్ ప్రక్రియ వాయిదా పడింది. జేఈఈ మెయిన్ ర్యాంకుల వెల్లడిలో జాప్యం వల్ల.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను ఇండియన్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ(IIT) ఖరగ్‌పూర్ వాయిదా వేసింది. వాస్తవానికి ఈ రోజు ఉదయం 10 గంటలకు రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ప్రారంభం కావాల్సి ఉంది. అయితే.. ఈ రిజిస్ట్రేషన్ల ప్రక్రియ షెడ్యూలులో మార్పులు చేసినట్టు ఐఐటీ ఖరగ్‌పూర్ వెల్లడించింది. కాగా.. రిజిస్ట్రేషన్ల ప్రక్రియ ఈ నెల 13వ తేదీ మధ్యాహ్నం నుంచి మొదలవుతుందని పేర్కొంది. ఈ నెల 19వ తేదీ సాయంత్రం 5 గంటలకు రిజిస్ట్రేషన్లు ముగియనున్నట్లు అధికారులు తెలిపారు. అభ్యర్థులు ఫీజు చెల్లించేందుకు ఈ నెల 20 వ తేదీ సాయంత్రం 5 వరకు అవకాశం ఉంటుంది. అక్టోబర్ 3న పరీక్ష యథాతథంగా జరగనుంది.
ఇదిలాఉంటే.. జేఈఈ మెయిన్ ఫలితాలు నిన్న విడుదల అవుతాయని అభ్యర్థులు ఆసక్తితో ఎదురు చూశారు. కానీ ఫలితాలను అధికారులు విడుదల చేయలేదు. ఈ ఫలితాలు.. రేపు లేదా ఎల్లుండి విడుదలయ్యే అవకాశం ఉన్నట్లు తెలుస్తోంది. కాగా.. హర్యానాలో జరిగిన పరీక్షలో అక్రమాలు జరిగినట్టు సీబీఐ తేల్చిన విషయం తెలిసిందే. దీంతో ఫలితాల విడుదలలో జాప్యం అవుతున్నట్లు పేర్కొంటున్నారు. అయితే ఫలితాలపై ఎన్‌టీఏ ఇప్పటివరకూ ఎలాంటి ప్రకటన చేయలేదు.
కాగా.. మేయిన్స్ క్వాలిఫై అయిన వారు మాత్రమే జేఈఈ అడ్వన్స్‌డ్ పరీక్ష రాయడానికి అనుమతిస్తారు. ఎన్‌టీఏ ప్రకటించిన వివరాల ప్రకారం.. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష అక్టోబర్ 3 న నిర్వహించనున్నారు. ఈ పరీక్షను రెండు షిఫ్ట్‌లలో జరుపుతారు. మొదటి షిఫ్ట్ లో పేపర్ I ఉదయం 9 నుండి మధ్యాహ్నం 12 గంటల వరకు ఉంటుంది. రెండవ షిఫ్ట్‌లో పేపర్ 2 మధ్యాహ్నం 2.30 నుంచి 5.30 వరకు జరుగుతుంది.
Also Read: