IIT Bombay will be organising the IIT entrance exam this year: ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT Bombay) ముంబాయి ఈ ఏడాది జరగబోయే జాయింట్ ఎంట్రన్స్ ఎగ్జామినేషన్ (JEE Advanced 2022) అడ్వాన్స్‌డ్ పరీక్షలు నిర్వహిస్తున్నట్లు ప్రకటించింది. దేశ వ్యాప్తంగా ఐఐటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ సైన్స్ (ఐఐఎస్‌సీ)లో ప్రవేశాల కోసం ఈ పరీక్షను ప్రతి ఏడాది దేశ వ్యాప్తంగా నిర్వహించడం జరుగుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 కోసం ప్రత్యకంగా వెబ్‌సైట్ jeeadv.ac.inను కూడా ఐఐటీ ముంబాయి ప్రారంభించింది. కాగా ఈ ఏడాది జరగనున్న జేఈఈ మెయిన్ 2022, జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022 పరీక్షలకు సంబంధించిన డేట్ షీట్‌లు త్వరలో విడుదల కానున్నాయి. జేఈఈ మెయిన్స్‌కు సంబంధించిన అప్‌డేట్‌లు ఎన్టీఏ అధికారిక వెబ్‌సైట్ jeemain.nta.ac.in లేదా nta.ac.inలలో అందుబాటులో ఉంటాయి. అలాగే ఐఐటీ ముంబాయి జేఈఈ అడ్వాన్స్‌డ్ 2022కు సంబంధించిన సమాచారాన్ని jeeadv.ac.inలో ఉంచుతుంది. ఇక జేఈఈ మెయిన్ పరీక్షల్లో అర్హత సాధించిన టాప్ 2.5 లక్షల మంది అభ్యర్థులు జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షకు హాజరవడానికి అర్హులుగా పరిగణించబడతారు. ఎన్టీఏ గతేడాది (2021) నుంచి ఏడాదికి నాలుగుసార్లు జేఈఈ మెయిన్‌ను నిర్వహించాలని నిర్ణయించిన విషయం తెలిసిందే. మెయిన్స్ ఫలితాలు వెలువడిన తర్వాత జూఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్ష నిర్వహించబడుతుంది. జేఈఈ అడ్వాన్స్‌డ్‌లో అర్హత సాధించిన అభ్యర్థులు దేశవ్యాప్తంగా 23 ఐఐటీల్లో వివిధ కోర్సుల్లో ప్రవేశాలు పొందడానికి అర్హత సాధిస్తారు.
జేఈఈ అడ్వాన్స్‌డ్ వెబ్‌సైట్‌లో అప్‌లోడ్ చేసిన నోటిఫికేషన్ ప్రకారం.. 2020 లేదా 2021లో 12వ తరగతి (లేదా తత్సమానం) పరీక్షలో మొదటిసారి హాజరైన అభ్యర్థులు జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2021కు నమోదు చేసుకున్నప్పటికీ కొందరు కోవిడ్ మహమ్మారి కారణంగా రెండింటికీ హాజరు కాలేకపోయారు. ఇటువంటి వారిని కూడా జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022 (పేపర్ 1, 2)కి నేరుగా హాజరు కావొచ్చనే కీలక ప్రకటన కూడా విడుదల చేసింది. ఐతే ఇటువంటి అభ్యర్ధులు ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్ పోర్టల్‌లో జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022 కోసం ఖచ్చితంగా నమోదు చేసుకోవాలి. అదేవిధంగా రిజిస్ట్రేషన్ ఫీజు కూడా చెల్లించాలి. ఈ అభ్యర్థులు జేఈఈ (అడ్వాన్స్‌డ్) 2022కు హాజరు కావడానికి జేఈఈ (మెయిన్) 2022లో అర్హత సాధించిన వారితోపాటు, అదనంగా పరిగణించబడతారని నోటిఫికేషన్ పేర్కొంది.
జేఈఈ అడ్వాన్స్‌డ్‌ను ప్రతి సంవత్సరం ఏడు జోనల్ కోఆర్డినేటింగ్ ఐఐటీలు (IIT ఖరగ్‌పూర్, IIT కాన్పూర్, IIT మద్రాస్, IIT ఢిల్లీ, IIT ముంబాయి, IIT గౌహతి, IIT రూర్కీ) నిర్వహిస్తాయి. జేఈఈ అడ్వాన్స్‌డ్ పరీక్షను గతేడాది IIT ఖరగ్‌పూర్ నిర్వహించగా.. ఏడాది IIT ముంబాయి నిర్వహిస్తున్నట్లు తాజాగా ప్రకటించింది.
Also Read: