
ఏడు సంవత్సరాల ఉద్యోగ జీవితంలో రూ.80 లక్షలకు పైగా పొదుపు చేసిన ఓ 31 ఏళ్ల ప్రభుత్వ రంగ సంస్థ (పీఎస్‌యూ) ఉద్యోగిని తన ఉద్యోగానికి రాజీనామా చేయాలని భావిస్తున్నట్లు సోషల్ మీడియాలో వెల్లడించడంతో ఆ విషయం చర్చనీయాంశంగా మారింది. ఆర్థికంగా స్థిరంగా ఉన్నప్పటికీ నిరంతర పని ఒత్తిడి, సెలవు రోజుల్లోనూ విధులు, ఆరోగ్య సమస్యలు తనను తీవ్రంగా ప్రభావితం చేశాయని ఆమె పేర్కొంది. రెడ్డిట్‌లో చేసిన పోస్టులో ఆమె తన అనుభవాలను పంచుకుంది. కొత్త విభాగానికి బదిలీ అయినప్పటి నుంచి వారాంతాలు, ప్రభుత్వ సెలవులు, కార్యాలయ సమయం ముగిసిన తర్వాత కూడా పనిచేయాల్సి వస్తోందని తెలిపింది. కొన్ని సందర్భాల్లో అర్ధరాత్రి వేళల్లో కూడా పని చేయాల్సి వచ్చిందని పేర్కొంది. అనారోగ్యంతో సెలవు తీసుకున్నప్పటికీ కార్యాలయానికి పిలిచారని, ఒక్కరోజు సెలవు తీసుకున్నా ప్రశ్నించేవారని వాపోయింది. రోజుకు 9 నుంచి 10 గంటలు పనిచేసినా తాను సరిపడా పని చేయడం లేదని విమర్శలు ఎదుర్కొంటున్నానని తెలిపింది.
ఈ పరిస్థితులు తనను మానసికంగా, శారీరకంగా పూర్తిగా అలసటకు గురి చేశాయని ఆమె వెల్లడించింది. మరో 25 నుంచి 30 సంవత్సరాలు ఇదే వాతావరణంలో పని చేయాలనే ఆలోచనే భయాన్ని కలిగిస్తోందని పేర్కొంది. ప్రస్తుతం తనకు ఎలాంటి అప్పులు లేవని, ఖర్చులు కూడా తక్కువగానే ఉన్నాయని చెప్పింది. ఉద్యోగానికి రాజీనామా చేసి స్వగ్రామానికి సమీపంలోని చిన్న పట్టణానికి వెళ్లి సాధారణ జీవితం గడపాలని, దీర్ఘకాలిక పెట్టుబడులు, క్రమబద్ధమైన ట్రేడింగ్, పొదుపులపై వచ్చే వడ్డీ ద్వారా జీవించాలని భావిస్తున్నట్లు వివరించింది.
31F govt job , 80L corpus – want to quit for peace. Reckless or realistic?
by
u/Naruto-189 in
personalfinanceindia
అయితే ఆమె పోస్టుపై స్పందించిన నెటిజన్లు వెంటనే ఉద్యోగానికి రాజీనామా చేయవద్దని సూచించారు. ముందుగా కొంతకాలం విరామం తీసుకోవాలని, వైద్య సెలవులు లేదా సబాటికల్ లీవ్ కోసం ప్రయత్నించాలని సలహా ఇచ్చారు. మానసిక ఒత్తిడి నుంచి బయటపడిన తర్వాతే ఉద్యోగం కొనసాగించాలా, వద్దా అనే విషయంపై నిర్ణయం తీసుకోవడం మంచిదని అభిప్రాయపడ్డారు. మరికొందరు ఉద్యోగంలో అంతర్గత బదిలీ కోసం ప్రయత్నించాలని సూచించగా, ఇంకొందరు ఆర్థిక భద్రత మరింత పెరిగిన తర్వాతే రాజీనామా గురించి ఆలోచించాలని పేర్కొన్నారు. ప్రస్తుతం ఉన్న పరిస్థితుల్లో తొందరపాటు నిర్ణయం తీసుకోవడం కంటే విశ్రాంతి తీసుకుని, భవిష్యత్ ప్రణాళికలను పునఃసమీక్షించుకోవడం ఉత్తమ మార్గమని సోషల్ మీడియా వినియోగదారులు సూచించారు.