US Resume Student Visa: అమెరికాలో ఉన్నత చదువులకు వెళ్లే విద్యార్థులకు శుభవార్త. సోమవారం నుంచి స్టూడెంట్ వీసా ప్రక్రియను ప్రారంభించనున్నట్లు ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం కాన్సులర్ వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ తెలిపారు. ఈ విషయాన్ని గురువారం ఫేస్‌బుక్, ట్విటర్ ద్వారా ప్రకటించారు. ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో ప్రారంభమయ్యే తరగతులకు హాజరయ్యే విద్యార్థులకు వీసాల జారీలో మొదటి ప్రాధాన్యత ఇవ్వనున్నట్లు తెలిపారు. అయితే, పర్యాటక వీసాలైన బి1/బి2 కోసం ఎదురుచూస్తున్న వారు మరి కొంతకాలం వేచి ఉండకతప్పని పరిస్థితి నెలకొంది.
కరోనా వైరస్ మహమ్మారి సెకండ్ వేవ్ విజృంభణ నేపథ్యంలో అమెరికా వచ్చేవారిపై యూఎస్ ప్రభుత్వం ఆంక్షలు విధించింది.ఢిల్లీలోని అమెరికా రాయబార కార్యాలయం, ముంబయి, చెన్నై, కోల్‌కతా, హైదరాబాద్‌లలోని కాన్సులేట్ కార్యాలయాల్లో అత్యవసర వీసాలు మినహా ఇతర అన్నిరకాల వీసా సేవలను ఈ ఏడాది మే మూడో తేదీ నుంచి నిలిపివేసింది.
ఇదిలావుంటే, అమెరికాలో విశ్వవిద్యాలయాలు జులై, ఆగస్టు నెలల్లో విద్యా సంవత్సరం ప్రారంభమవుతాయి. సాధారణంగా విశ్వవిద్యాలయం జారీ చేసే ఐ-20 పత్రంలో పేర్కొన్న తేదీకి 30 రోజులకు ముందుగా విద్యార్థులు అమెరికా వెళ్లేందుకు అవకాశం ఉండదు. తాజా పరిస్థితుల నేపథ్యంలో ఇప్పటికే వీసాలు పొందిన విద్యార్థులు ఆ గడువుతో సంబంధం లేకుండా అమెరికా వెళ్లవచ్చు. వీసాలేని వారు రాయబార, కాన్సులేట్ కార్యాలయాల్లో పూర్తిస్థాయి సేవలు ప్రారంభించేంత వరకు వేచి ఉండాల్సిందేనని అప్పట్లో అమెరికా ప్రభుత్వం స్పష్టం చేసింది. తాజాగా దేశంలో కరోనా రెండో దశ తీవ్రత తగ్గుముఖం పడుతుండటంతో రాయబార కార్యాలయంతో పాటు నాలుగు కాన్సులేట్ కార్యాలయాల్లో వీసా ప్రక్రియను సోమవారం తిరిగి ప్రారంభిస్తున్నట్లు కాన్సులర్ వ్యవహారాల మంత్రి డాన్ హెఫ్లిన్ పేర్కొన్నారు.
The U.S. Mission to India is opening July and August student visa appointments at posts across India on June 14, 2021. Students may visit our website, https://t.co/ge5EeIRsKI, to view availability and schedule an appointment. Read more: https://t.co/qDtLHwHN4a
— U.S. Embassy India (@USAndIndia) June 10, 2021
ఈ ఏడాది జులై, ఆగస్టు నెలల్లో తరగతులు ప్రారంభమయ్యే విద్యార్థులు ఇప్పటికే వీసా ఇంటర్వ్యూ సమయం తీసుకోనివారు ఆ ప్రయత్నాలు ప్రారంభించవచ్చు. గతంలో అపాయింట్‌మెంట్ తీసుకుని రద్దయిన వారు తాజాగా వీసా ఇంటర్వ్యూ కోసం స్లాట్ తీసుకోవాలి. అందుకు సంబంధించిన సమాచారం కోసం https://ustraveldocs.com/in ను పరిశీలించవచ్చు. ఇప్పటికే వీసా స్లాట్ తీసుకుని ఎదురుచూస్తున్న వారికి ప్రాధాన్యత క్రమంలో ప్రక్రియను నిర్వహిస్తామని డాన్ హఫ్లిన్ తెలిపారు. ప్రస్తుతం విద్యార్థులకు మాత్రమే వీసా ప్రక్రియను నిర్వహిస్తామన్నారు. వెంట వెళ్లేందుకు విద్యార్థుల తల్లిదండ్రులు, ఇతర వీసాల ప్రక్రియ సైతం పరిశీలించట్లేదు.
విద్యార్థులు ఎక్కువ కాలం వేచి ఉండే పరిస్థితి లేకుండా వారి దరఖాస్తులను మాత్రమే పరిశీలిస్తామని ఆయన పేర్కొన్నారు. అంటే జులైలో తరగతులు ప్రారంభమయ్యే విద్యార్థులకు అపాయింట్‌మెంట్ ఆగస్టులో ఉన్నట్లయితే అలాంటి వారి ప్రక్రియను వేగవంతం చేసుకునేందుకు అవకాశం ఉంది. అలాంటివారు https://www.ustraveldocs.com/in/expedited-appointment.html కు ఈ-మెయిల్ ద్వారా వినతిని పంపవచ్చు. వారి వినతిని ఆమోదిస్తే విద్యార్థులకు ఈ-మెయిల్‌కు సమాచారం వస్తుంది. అత్యవసర ఇంటర్వ్యూ తేదీ ఖరారైనట్లు సమాచారం వచ్చేంతవరకు అప్పటికే ఉన్న అపాయింట్‌మెంట్‌ను రద్దు చేసుకోవద్దు. అత్యవసరం కోసం దరఖాస్తు చేసుకుని, మీకు ఆమోదం లేదా తిరస్కారానికి సంబంధించిన సమాచారం రానంత వరకు అది పరిశీలనలో ఉన్నట్లే లెక్క.
మరోవైపు, ప్రయాణానికి మూడు రోజుల ముందుగా విద్యార్థులు కరోనా పరీక్ష చేయించుకోవాలి. నెగెటివ్‌గా నిర్ధారణయిన వారిని మాత్రమే విమాన ప్రయాణానికి అనుమతిస్తారు. వ్యాక్సిన్ విషయంలో ఆయా విశ్వవిద్యాలయాలదే తుది నిర్ణయం. వ్యాక్సిన్ వేయించుకోవాలా? లేదా? వ్యాక్సిన్ తప్పదు అంటే ఏ వ్యాక్సిన్ వేయించుకోవాలి? అన్నది విశ్వవిద్యాలయ అధికారులతో సంప్రదించి విద్యార్థులు నిర్ణయం తీసుకోవాల్సి ఉంటుందని డాన్ హెఫ్లిన్ స్పష్టం చేశారు.