అమరావతి, జనవరి 28: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న గురుకుల విద్యాలయాల్లో ప్రస్తుతం 5 నుంచి ఇంటర్మీడియట్ వరకు బాల బాలికలకు ప్రభుత్వం విద్యను అందిస్తుంది. అయితే ఈ గురుకుల విద్యాలయాల్లో మున్ముందు డిగ్రీ సహా సాంకేతిక కోర్సులను కూడా ప్రవేశపెట్టేందుకు చర్యలు తీసుకుంటామని సాంఘిక సంక్షేమ శాఖ మంత్రి డాక్టర్ డోలా బాలవీరాంజనేయస్వామి తెలిపారు. ఇటీవల శ్రీపొట్టి శ్రీరాములు నెల్లూరు జిల్లా పెదపవనిలోని బాలికల గురుకుల కళాశాలను ఆయన సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ఇంటర్, పదో తరగతి పరీక్షల్లో నూరు శాతం ఉత్తీర్ణత సాధించాలని విద్యార్ధులకు సూచించారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఇంటర్న్‌షిప్‌ల కోసం రిజిస్టర్ చేసుకున్న కంపెనీలకు అనుమతులు ఇవ్వడంలో ఉన్నత విద్యామండలి పారదర్శకంగా వ్యవహరించాలని సాంకేతిక, ప్రొఫెషనల్ సంస్థల ఉద్యోగుల సంఘం (ఏపీటీపీఐఈఏ) అధ్యక్షుడు బ్రహ్మనందరెడ్డి ఓ ప్రకటనలో అన్నారు. సెమిస్టర్ ఇంటర్న్‌షిప్‌లకు సంబంధించి కొన్ని కంపెనీలకే త్వరితగతిన అనుమతులు ఇస్తున్నారని అన్నారు. దీంతో విద్యార్థులు ఆ కంపెనీల్లోనే ఇంటర్న్‌షిప్‌కు నమోదు కావడానికి ఆస్కారం ఏర్పడుతోందని పేర్కొన్నారు.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న ప్రభుత్వ పాఠశాలల్లో.. పాలిటెక్నిక్ కళాశాలల్లో ప్రవేశాలకు నిర్వహించే పాలిసెట్‌పై అవగాహన కల్పించేందుకు అనుమతిస్తూ పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్ విజయరామరాజు ఆదేశాలు జారీ చేశారు. ఈ ఏడాది పాలిసెట్ రాసే విద్యార్థుల సంఖ్య పెంచడంతో పాటు, ఆయా కళాశాలల్లో ప్రవేశాలను ప్రోత్సహించేందుకు సాంకేతిక విద్యాశాఖ పాలిసెట్‌పై ప్రచారం నిర్వహిస్తోంది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.