Telangana: గుడ్‌న్యూస్.. దావోస్‌లో కుదిరిన మరో బిగ్ డీల్.. త్వరలోనే 3,800 ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే

దేశంలోనే తెలంగాణను ఏఐ డేటా సెంటర్​ హబ్‌గా తీర్చిదిద్దే లక్ష్యంతో రాష్ట్ర ప్రభుత్వం మరో కీలక పెట్టుబడిని సాధించింది. సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం దావోస్​లో యూపీసీ వోల్ట్ సంస్థతో అవగాహన ఒప్పందం (ఎంఓయూ) కుదుర్చుకుంది. రాష్ట్రంలో ఈ ప్రాజెక్టు నిర్మాణం ప్రారంభమైతే 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి అధికార వర్గాలు చెబుతున్నాయి.

Telangana: గుడ్‌న్యూస్.. దావోస్‌లో కుదిరిన మరో బిగ్ డీల్.. త్వరలోనే 3,800 ఉద్యోగాలు! పూర్తి వివరాలు ఇవే
Telangana Ai Data Center

Updated on: Jan 22, 2026 | 5:49 PM

రాష్ట్రానికి పెట్టుబడులు తేవడమే లక్ష్యంగా దావోస్‌లో పర్యటిస్తుంది సీఎం రేవంత్ రెడ్డి నేతృత్వంలోని ‘తెలంగాణ రైజింగ్’ బృందం. ఇందులో భాగంగానే యూపీసీ వోల్ట్ సీఈవో హాన్ డీ గ్రూట్, యూపీసీ రిన్యూవబుల్స్ ఏపీఏసీ సహ వ్యవస్థాపకుడు స్టీవెన్ జ్వాన్, యూపీసీ రిన్యూవబుల్స్ ఇండియా సీఈవో అలోక్ నిగమ్‌తో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రత్యేకంగా సమావేశమయ్యారు. ఈ సందర్భంగా వారిని తెలంగాణలో పెట్టుబడులు పెట్టాలని ఆహ్వానించారు. రాష్ట్రంలో పెట్టుబడులకు అనుకూలమైన సదుపాయాలను సీఎం వారికి వివరించారు. ఈ నేపథ్యంలో యూపీసీ వోల్ట్ సంస్థ తెలంగాణలో డేటా సెంటర్ ఏర్పాటుకు నిర్ణయం తీసుకుంది. ఇందుకుగాను తెలంగాణ ప్రభుత్వంతో అవగాహన ఒప్పందం కుదుర్చుకుంది.

నెదర్లాండ్స్‌కు చెందిన యూపీసీ రిన్యూవబుల్స్ గ్రూప్, వోల్ట్ డేటా సెంటర్స్ కలిసి యూపీసీ వోల్ట్ సంస్థగా ఏర్పడింది. రాష్ట్ర ప్రభుత్వంతో చేసుకున్న ఒప్పందం ప్రకారం ఈ సంస్థ భారత్ ఫ్యూచర్ సిటీలో 100 మెగావాట్ల సామర్థ్యంతో ఏఐకు అనుకూలమైన డేటా సెంటర్‌ నెలకొల్పనుంది. ఈ ప్రాజెక్టుకు ఐదేళ్లలో రూ.5,000 కోట్ల పెట్టుబడి పెట్టనుంది. ఈ డేటా సెంటర్‌కు అవసరమైన విద్యుత్‌ సరఫరాకు 100 మెగావాట్ల సామర్థ్యంతో ప్రత్యేక పునరుత్పాదక విద్యుత్ ప్లాంట్​ ఏర్పాటు చేయనుంది. ఈ ప్రాజెక్టు నిర్మాణ దశలోనే 3వేల మందికి పైగా ప్రత్యక్షంగా, పరోక్షంగా ఉద్యోగావకాశాలు లభిస్తాయి. డేటా సెంటర్​ ప్రారంభమైన తర్వాత మరో 800 మందికి ఉద్యోగ అవకాశాలుంటాయి.

ఈ సందర్భంగా సీఎం రేవంత్ రెడ్డి మాట్లాడుతూ.. 2047 నాటికి మూడు ట్రిలియన్ డాలర్ల ఆర్థిక వ్యవస్థగా తెలంగాణను తీర్చిదిద్దడంలో ఆధునిక డిజిటల్ మౌలిక వసతులు కీలక పాత్ర పోషిస్తాయని అన్నారు. పర్యావరణ పరిరక్షణతో పాటు అభివృద్ధిని సాధించడమే రాష్ట్ర లక్ష్యమని స్పష్టం చేశారు. అనంతరం ఐటీ, పరిశ్రమల మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు మాట్లాడుతూ.. అధునాతన ఏఐ డేటా సెంటర్ల ఏర్పాటుకు అవసరమైన ప్రోత్సాహకాలు, సౌకర్యాలు రాష్ట్ర ప్రభుత్వం కల్పిస్తుందన్నారు. నెట్ జీరో సిటీ అభివృద్ధే తెలంగాణ విజన్ లో భాగమని అన్నారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.