అమరావతి, డిసెంబర్ 19: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని హోంగార్డు అభ్యర్థులకు హైకోర్టులో ఊరట లభించింది. పోలీసు కానిస్టేబుల్ ఎంపిక ప్రక్రియలో వారిని ప్రత్యేక కేటగిరీగా పరిగణించాల్సిందేనని కోర్టు స్పష్టం చేసింది. ఈ మేరకు స్టేట్ లెవెల్ పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఉన్నత న్యాయస్థానం ఆదేశించింది. ఆరు వారాల్లో ప్రాథమిక పరీక్షలో హోంగార్డు అభ్యర్థులకు వచ్చిన మార్కుల ఆధారంగా ప్రత్యేక మెరిట్ జాబితాను రూపొందించాలని స్పష్టం చేసింది. హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ ఎస్ సుబ్బారెడ్డి డిసెంబరు 18న ఈ మేరకు తీర్పు ఇచ్చారు. కాగా పోలీసు కానిస్టేబుల్ ఎంపిక అర్హతలో సామాజిక వర్గాలతో సంబంధం లేకుండా తమను ప్రత్యేక కేటగిరీగా పరిగణించాలని కోరుతూ హోంగార్డులు రాష్ట్ర హైకోర్టులో వరుస వ్యాజ్యాలు దాఖలు చేసిన సంగతి తెలిసిందే. పిటిషనర్ల తరఫు న్యాయవాదులు వాదనలను విన్న కోర్టు వారికి ప్రత్యేక మెరిట్ జాబితాను రూపొందిచాలని పోలీస్ రిక్రూట్‌మెంట్ బోర్డును ఆదేశించింది.
తెలంగాణ రాష్ట్రంలో 2024-25 విద్యాసంవత్సరానికి సంబంధించి విదేశీ విద్య పథకం కింద ఉపకార వేతనాలకు అర్హులైన అభ్యర్ధుల పేపర్లను డిసెంబర్ నెలాఖరులోగా ప్రకటిస్తామని మంత్రి సీతక్క ప్రకటించారు. మొత్తం 1,310 మంది పేర్లను ఎంపిక చేయనున్నట్లు వెల్లడించారు. ఈ పథకం ప్రవేశపెట్టినప్పటి నుంచి మొత్తం 8,723 మంది ఎంపికయ్యారని, వారికి ప్రభుత్వం నుంచి రూ.1,396 కోట్లు స్కాలర్‌షిప్ చెల్లించినట్లు తెలిపారు. విద్యార్థులకు విదేశీ విద్య ఉపకార వేతనాలు అందడం లేదంటూ బుధవారం అసెంబ్లీలో బీజేపీ సభ్యులు వివేకానంద్, మర్రి రాజశేఖర్‌రెడ్డి, అనిల్ జాదవ్‌లు ప్రశ్నలు అడగగా మంత్రి సీలక్క ఈ మేరకు సమాధానం ఇచ్చారు.
గత ప్రభుత్వ హయాంలో విద్యార్ధులకు రూ.244 కోట్లు చెల్లించకుండా బకాయిలు పెట్టారని, తమ ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత వాటిలో రూ.140 కోట్లు చెల్లించామని మంత్రి సీతక్క వెల్లడించారు. ఇంకా రూ.104 కోట్లు ఇవ్వాల్సి ఉందని, త్వరలోనే పూర్తిగా చెల్లిస్తామని అన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఈ పథకాన్ని ఎత్తివేస్తున్నారని ఆరోపణలు చేస్తున్నారని, అదే నిజమైతే పెండింగ్ బిల్లులు ఎందుకు చెల్లిస్తామని ఆమె ప్రశ్నించారు. వచ్చే ఏడాది మార్చి వరకు గడువు ఉందని, మిగిలిన మొత్తాన్ని ఈలోపు చెల్లించి ఈ పథకాన్ని మరింత బలోపేతం చేస్తామని ఆమె చెప్పారు.