Telangana: చదువే పెదోడి ఆస్తి.. అక్షర ఆయుధంతోనే సమస్యలు పరిష్కారం.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..

ఆస్తిగా ఇవ్వడానికి భూములు లేవు.. అందుకే నా పేద బిడ్డలకు అక్షర ఆయుధాన్ని అందిస్తున్నాను అని సీఎం రేవంత్ రెడ్డి ఎమోషనల్ అయ్యారు. విద్య ద్వారానే సామాజిక గౌరవం సాధ్యమని అన్నారు .రూ.200 కోట్లతో ఇంటిగ్రేటెడ్ స్కూళ్లు, సివిల్స్ అభ్యర్థులకు ఆర్థిక సాయం వంటి విప్లవాత్మక మార్పులతో విద్యా రంగాన్ని పరుగులు పెట్టిస్తామని హామీ ఇచ్చారు.

Telangana: చదువే పెదోడి ఆస్తి.. అక్షర ఆయుధంతోనే సమస్యలు పరిష్కారం.. సీఎం రేవంత్ ఇంట్రెస్టింగ్ కామెంట్స్..
Cm Revanth On Education System

Updated on: Jan 17, 2026 | 4:36 PM

విద్య ఒక్కటే మన సమస్యలన్నింటికీ పరిష్కారం చూపుతుందని తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. పేదరికం నుంచి బయటపడాలన్నా, సమాజంలో గౌరవం పొందాలన్నా చదువే ఏకైక మార్గం అని స్పష్టం చేశారు. మహబూబ్‌నగర్ జిల్లాలో ఐఐఐటీ భవన నిర్మాణానికి శంకుస్థాపన చేసిన అనంతరం విద్యార్థులను ఉద్దేశించి ఆయన ప్రసంగించారు. బూర్గుల రామకృష్ణారావు తర్వాత మహబూబ్‌నగర్ జిల్లాకు 75 ఏళ్లకు ముఖ్యమంత్రి అయ్యే అవకాశం వచ్చిందని సీఎం గుర్తు చేశారు. ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకొని జిల్లాను విద్యా, ఇరిగేషన్ హబ్‌గా తీర్చిదిద్దుతామని ఆయన హామీ ఇచ్చారు. అందులో భాగంగానే ఏడాది కాలంలోనే ఐఐఐటీ భవనాన్ని పూర్తి చేసి అందుబాటులోకి తెస్తామని వెల్లడించారు.

మారుమూల పల్లె నుంచి ముఖ్యమంత్రి పీఠం వరకు..

తన రాజకీయ ప్రస్థానాన్ని గుర్తు చేసుకుంటూ విద్యార్థుల్లో సీఎం రేవంత్ రెడ్డి స్ఫూర్తి నింపారు. అచ్చంపేట నియోజకవర్గంలోని ఒక మారుమూల పల్లె నుంచి వచ్చిన తాను, కేవలం 17 ఏళ్ల రాజకీయ ప్రస్థానంలోనే ముఖ్యమంత్రి అయినట్లు తెలిపారు. కనీసం మంత్రి కూడా కాకపోయినా, పట్టుదల.. కష్టపడే తత్వం.. ప్రజల సహకారంతో ఈ స్థాయికి చేరుకున్నట్లు ఆయన వివరించారు. జీవితంలో పైకి రావాలంటే క్రమశిక్షణ, పట్టుదల చాలా ముఖ్యమని హితవు పలికారు.

విద్యకే మా మొదటి ప్రాధాన్యత

ప్రస్తుత పరిస్థితుల్లో భూమి లేని నిరుపేదలకు, దళితులకు పంచడానికి భూములు కూడా లేని పరిస్థితి ఉందని ఆవేదన వ్యక్తం చేసిన సీఎం, ఇప్పుడు చదువు ఒక్కటే మనకున్న అతిపెద్ద ఆస్తి అని పేర్కొన్నారు. రూ.200 కోట్లతో అత్యాధునిక వసతులతో ఇంటిగ్రేటెడ్ స్కూల్స్ నిర్మిస్తున్నట్లు తెలిపారు. సివిల్ సర్వీసెస్‌కు సిద్ధమయ్యే వారికి ప్రభుత్వం తరపున ఆర్థిక సహాయం అందిస్తున్నట్లు చెప్పారు.
అంతర్జాతీయ స్థాయి అవకాశాలను అందిపుచ్చుకోవాలంటే విద్యార్థులు తమ భాషా నైపుణ్యాన్ని మెరుగుపరుచుకోవాలని సీఎం సూచించారు.

నిబద్ధత లేని చదువు వేస్ట్..

“చదువు కేవలం మార్కుల కోసం కాదు.. నిబద్ధత లేని చదువు జీవితానికి ఉపయోగపడదు. సంస్కారం, తల్లిదండ్రుల పట్ల గౌరవం ఉన్నప్పుడే ఆ చదువుకు సార్థకత లభిస్తుంది” అని రేవంత్ అన్నారు. ప్రతి విద్యార్థి తన తల్లిదండ్రులను గౌరవించాలని, వారి కష్టాన్ని స్మరించుకుంటూ ముందుకు సాగాలని సూచించారు. మహబూబ్ నగర్ జిల్లాను విద్యా సంస్థల నిలయంగా మారుస్తామని, ప్రజలకు మేలు చేయాలన్న ఏకైక ఆలోచనతోనే రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్తున్నానని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఇక్కడ క్లిక్ చేయండి..