Inspiration Story: క్యాన్సర్‌తో పోరాటం.. కట్‌చేస్తే పదో తరగతి బోర్డు పరీక్షల్లో స్టేట్‌ టాప్‌ స్కోర్‌!

ఆ అమ్మాయి పదో తరగతి చదువుతున్న సమయంలో అస్వస్థతకు గురైంది. ఆస్పత్రికి వెళ్తే రకరకాల టెస్ట్ లు చేశారు. ఆనక గుండె పగిలే వార్త చెప్పారు. ప్రాణాంతక బ్లడ్ క్యాన్సర్ సోకిందని వైద్యులు చెప్పడంతో గుండె ఆగినంత పనైంది. అయితే ఆ అమ్మాయి మాత్రం నా కల నేరవేరకుండా నా ప్రాణాలు తీసే హక్కు ఆ దేవుడికి కూడా లేదని గట్టిగా నమ్మింది. చిరవకు అదే నిజమైంది.. దేవుడు ఓడాడు.. ఆమె గెలిచింది..

Inspiration Story: క్యాన్సర్‌తో పోరాటం.. కట్‌చేస్తే పదో తరగతి బోర్డు పరీక్షల్లో స్టేట్‌ టాప్‌ స్కోర్‌!
Ishika Bala Success Story

Updated on: Jun 23, 2025 | 6:14 AM

కలలు అందరూ కంటారు. అయితే కొందరే వాటి సాకారం కోసం తపిస్తారనేది అక్షర సత్యం. అలాంటి కోవకు చెందినదే ఈ అమ్మాయి. పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు సీరియస్‌గా ప్రిపరేషన్‌ సాగిస్తున్న సమయంలో అనుకోని పిడుగులాంటి వార్త బాలికకు తెలిసింది. అయినా ఆత్మస్థైర్యం కోల్పోలేదు. ప్రాణాలు హరించే మహమ్మారిని ఏ మాత్రం లెక్క చేయక బోర్డు పరీక్షల్లో టాప్‌ స్కోర్‌ సాధించి రాష్ట్ర టాపర్‌గా నిలిచి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఆ బాలిక ఎవరో కాదు ఛత్తీస్‌గఢ్‌ల్‌కు చెందిన ఇషికా బాలా. ప్రాణాంతక క్యాన్సర్ వ్యాధిని ఓడించడమే కాకుండా ఛత్తీస్‌గఢ్ బోర్డు పరీక్షలో ఏకంగా 99.17 శాతం మార్కులు సాధించింది. దృఢ సంకల్పంతో ఏదైనా సాధించవచ్చని ఇషికా కథ నిరూపిస్తుంది. ఈ అమ్మాయి కథ ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలి..

గిరిజన ప్రాబల్యం, నక్సల్స్ ప్రభావిత కాంకేర్ జిల్లాలోని గుండహూర్ గ్రామంలోని ప్రభుత్వ హయ్యర్ సెకండరీ స్కూల్ విద్యార్థిని ఇషికా బాలా (17). సాధారణ మధ్యతరగతి కుటుంబానికి చెందిన ఇషిక 10వ తరగతి చదువుతున్నప్పుడు నవంబర్ 2023లో ఆమెకు బ్లడ్ క్యాన్సర్ ఉన్నట్లు నిర్ధారణ అయింది. అయినప్పటికీ ఇషిక ధైర్యం కోల్పోకుండా బోర్డు పరీక్షలకు సిద్ధమై.. అన్ని పరీక్షలు రాసింది. ఛత్తీస్‌గఢ్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ నిర్వహించిన 10వ తరగతి పరీక్ష ఫలితాలు మే 7న విడుదలవగా.. అందులో ఇషిక 99.17 శాతం మార్కులతో రాష్ట్ర టాపర్‌గా నిలిచింది. క్రమంతప్పకుండా తీసుకున్న తీసుకున్న చికిత్స కూడా ఇషిక ఆత్మస్థైర్యానికి తోడైంది. క్యాన్సర్‌తో జరిగిన పోరాటంలోనూ గెలిచింది. అయితే 2-3 ఏళ్లపాటు పర్యవేక్షణలో ఉంచుతామని వైద్యులు తెలిపారు.

రాయ్‌పూర్‌లో ఓ ప్రైవేట్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్న కారణంగా 2023లో క్యాన్సర్ కారణంగా బోర్డు పరీక్షలకు హాజరు కాలేకపోయింది. కానీ 2024లో జరిగిన పరీక్షలకు హాజరై సత్తాచాటింది. తదుపరి గణితాన్ని ఎంచుకుని, ఇంజనీరింగ్ చేయాలనుకుంటున్నానని అన్నారు. IAS అధికారి కావాలనేది తన కల అని ఇషిక చెబుతోంది. క్యాన్సర్‌ చికిత్స సమయంలో ఇకపై చదువుకోలేనని చాలాసార్లు అనిపించిందని, కానీ నా మీద నాకు నమ్మకం ఉంది. అందుకే నా కలను వదులుకోదల్చుకోలేదని చెప్పిన మాటలు నిజంగా స్ఫూర్తి దాయకం. కాగా ఇషిక రాయ్‌పూర్‌లోని బాల్కో మెడికల్ సెంటర్‌లో చికిత్స తీసుకుంది. మళ్లీ క్యాన్సర్‌ దాడి చేయకుండా ఉండేందుకు డాక్టర్లు మరో రెండేళ్లు అబ్జర్వేషన్‌లో ఉంచినట్లు నిషిక తండ్రి తెలిపారు. అన్నట్లు నిషిక తండ్రి ఓ రైతు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.