
హైదరాబాద్, ఏప్రిల్ 29: దేశవ్యాప్తంగా వైద్య విద్యా కాలేజీల్లో 2025-26 విద్యా సంవత్సరానికి ఎంబీబీఎస్‌తోపాటు బీఏఎంఎస్, బీయూఎంఎస్, బీఎస్‌ఎంఎస్ వంటి మెడికల్ కోర్సుల్లో ప్రవేశాలకు నిర్వహించే నీట్ యూజీ 2025 ఎంట్రన్స్ టెస్ట్ మే 4వ తేదీన నిర్వహించనున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే సిటీ ఇంటిమేషన్ స్లిప్‌లు కూడా వచ్చేశాయి. ఈ పరీక్షకు సంబంధించిన అడ్మిట్ కార్డులు మే 1న అందుబాటులోకి రానున్నాయి. మరోవైపు నీట్ యూజీ 2025 పరీక్ష నిర్వహణకు కేంద్ర విద్యాశాఖ ముమ్మర ఏర్పాట్లు చేస్తోంది. గతేడాది నీట్ ప్రశ్నపత్రం లీకేజీ, అవకతవకల ఆరోపణలతో దేశ వ్యాప్తంగా తీవ్ర దుమారం చెలరేగిన సంగతి తెలిసిందే. నేషనల్ టెస్టింగ్ ఏజెన్సీ (ఎన్టీయే) పని తీరుపై తీవ్ర విమర్శలు వచ్చాయి.
దీంతో ఈ ఏడాది ఎలాంటి సమస్యలు తలెత్తకుండా పరీక్షను పకడ్బందీగా నిర్వహించేందుకు కేంద్రం ఏర్పాట్లు చేస్తోంది. మే 4న దేశవ్యాప్తంగా 550 నగరాల్లో దాదాపు 5 వేలకు పైగా పరీక్ష కేంద్రాల్లో నీట్ యూజీ పరీక్ష నిర్వహించేందుకు పకడ్భండీగా ఏర్పాట్లు చేస్తున్నారు. ఈసారి కూడా ఆఫ్‌లైన్ విధానంలో నిర్వహించనుండటంతో ఈ పరీక్షను సజావుగా, పారదర్శకంగా నిర్వహించేందుకు అన్ని రాష్ట్రాలు, కేంద్రపాలిత ప్రాంతాల ఉన్నతాధికారులతో వరుస సమావేశాలు నిర్వహిస్తూ కేంద్రం సంసిద్ధం చేస్తుంది. పరీక్ష కేంద్రాల్లో సైతం బహుళ అంచెలుగా తనిఖీలు జరపనున్నారు.
ఎన్‌టీఏ ప్రత్యేక భద్రతతో పాటు ఆయా జిల్లాల పోలీసులు సైతం విస్తృతంగా తనిఖీలు నిర్వహించనున్నారు. ప్రశ్నపత్రాలు, ఓఎంఆర్ షీట్‌లను పూర్తిస్థాయి పోలీసు భద్రత మధ్య తరలించనున్నారు. అలాగే వ్యవస్థీకృత చీటింగ్ నెట్‌వర్క్‌ల కార్యకలాపాలను నిరోధించడానికి కోచింగ్ కేంద్రాలు, డిజిటల్ వేదికల కార్యకలాపాలను సైతం ఓ కంట కనిపెట్టనున్నారు. అన్ని పరీక్షా కేంద్రాల్లో తప్పనిసరిగా తనిఖీలు చేపట్టేలా డ్యూటీ మెజిస్ట్రేట్‌లను నియమిస్తున్నామని అధికారిక వర్గాలు తెలిపాయి. మరోవైపు నీట్ యూజీ ప్రశ్నపత్రాన్ని అనధికారికంగా ఎక్కడైనా గుర్తిస్తే వెంటనే తమకు ఫిర్యాదు చేయాలని అభ్యర్థులను ఎన్‌టీఏ కోరింది.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.