
హైదరాబాద్, నవంబర్ 30: కామన్ అడ్మిషన్ టెస్ట్ (CAT 2025) ఆదివారం (నవంబర్ 30) దేశ వ్యాప్తంగా పలు పరీక్ష కేంద్రాల్లో ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్ కోజికోడ్ (IIM Kozhikode) నిర్వహించనుంది. ఈ పరీక్షను దేశ వ్యాప్తంగా 170 నగరాల్లో నిర్వహించనున్నారు. ఇప్పటికే ఏర్పాట్లు పూర్తి చేసింది. మరికాసేపట్లో అన్ని పరీక్ష కేంద్రాల్లో ఆన్‌లైన్ విధానంలో మొత్తం 3 షిఫ్టుల్లో ఈ పరీక్ష జరగనుంది.
ఉదయం 8.30 గంటల నుంచి 10.30 వరకు మొదటి షిఫ్ట్, మధ్యాహ్నం 12.30 నుంచి 2.30 రెండో షిఫ్ట్, సాయంత్రం 4.30 నుంచి 6.30 గంటల వరకు మూడో షిఫ్ట్ పరీక్ష ఉంటుంది. పరీక్ష సమయం రెండు గంటల వ్యవధి. వెర్బల్ ఎబిలిటీ, రీడింగ్ కాంప్రహెన్షన్ (VARC), డేటా ఇంటర్‌ప్రెటేషన్, లాజికల్ రీజనింగ్ (DILR), క్వాంటిటేటివ్ ఎబిలిటీ (QA) నుంచి క్యాట్ పరీక్షలో ప్రశ్నలు వస్తాయి. సుమారు 2.95 లక్షల మంది అభ్యర్థులు ఈ క్యాట్ 2025 పరీక్షకు దరఖాస్తు చేసుకున్నారు. క్యాట్‌లో వచ్చిన ర్యాంకు ఆధారంగా పీజీ, పీహెచ్‌డీ ప్రోగ్రామ్‌లలో ప్రవేశాలు కల్పిస్తారు. జనవరి మొదటి వారంలో క్యాట్ ఫలితాలు వెలువడనున్నాయి.
క్యాట్ 2025 పరీక్ష రెండు గంటలు అంటే 120 నిమిషాల వ్యవధిలో ఉంటుంది. కాబట్టి మీకు 100% తెలిసిన ప్రశ్నలను ముందుగా అటెంప్ట్ చేయాలి. ఇది ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. ఆ తరువాత 75శాతం తెలిసిన ప్రశ్నల వైపుకు వెళ్లాలి. ఇక్కడ సమాధానాన్ని కనుగొనడానికి లాజిక్‌ను లేదా ఎలిమినేషన్ పద్ధతిని ఉపయోగించవచ్చు. చివరిగా 50 శాతమే అవగాహన ఉన్న ప్రశ్నలను చాలా అరుదుగా మాత్రమే అటెంప్ట్ చేయాలి. క్యాట్ పరీక్షలో నెగెటివ్ మార్కింగ్ ఉంటుంది కాబట్టి, తెలియని ప్రశ్నలకు గుడ్డిగా అంచనా వేసి సమాధానాలు పెట్టకపోవడమే మంచిది. అలాగే పరీక్షకు హాజరయ్యే అభ్యర్థులు తమ వెంట అడ్మిట్ కార్డుతో పాటు ఏదైనా ఒక గుర్తింపు కార్డు అంటే ఆధార్ కార్డు, ఓటరు ఐడీ, పాన్ కార్డు, డ్రైవింగ్ లైసెన్స్ లేదా పాస్‌పోర్ట్ వంటి వాటిలో ఏదైనా ఒకదాన్ని తీసుకెళ్లాలి. పరీక్షా కేంద్రంలోకి ఎలక్ట్రానిక్ పరికరాలను తీసుకెళ్ల కూడదు.
క్యాట్ 2025 ప్రవేశ పరీక్షకు సంబంధించిన ఇతర వివరాలకు ఇక్కడ క్లిక్ చేయండి.
మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్ చేయండి.