హైదరాబాద్, సెప్టెంబర్ 23: గతేడాది పేపర్ లీకేజీ కారణంగా పలు నియామక పరీక్షలు రాసిన తర్వాత అనేక సార్లు వాయిదా పడిన ఘటనలను నుంచి నిరుద్యోగులు ఇంకా తేరుకోలేక పోతున్నారు. చిన్నచిన్న తప్పిదాలతో ఏ ఎగ్జామ్ ఎప్పుడు రద్దు అవుతుందోనని ఆందోళన చెందుతున్నారు. మూడు సార్లు గ్రూప్ 1 ప్రిలిమ్స్ నిర్వహించినా, మూడు సార్లు గ్రూప్ 2 షెడ్యూల్ ప్రకటించి వాయిదా వేయాల్సి వచ్చినా ఇప్పటికీ తప్పులు లేకుండా పరీక్షలు నిర్వహించే స్థితిలో తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ లేదని నిరుద్యోగులు ఆరోపిస్తున్నారు.
వచ్చే నెల జరగనున్న గ్రూప్ వన్ మెయిన్స్ పై ప్రిలిమ్స్ క్వాలిపై అయిన అభ్యర్థలు ఆందోళన చెందుతున్నారు. అందుకు కారణం గ్రూప్ -1 పై కోర్టులో ఉన్న కేసులే కారణం. పదికి పైగా ఉన్న కోర్టు కేసుల వల్ల ఎదైనా ఇంపాక్ట్ ఉంటుందేమోనని విద్యార్థులు వర్రీ అవుతున్నారు. న్యాయపరమైన చిక్కులు అలానే ఉండి ప్రభుత్వం మొండిపట్టుకు పోయి మెయిన్స్ నిర్వహించినా, తర్వాత కోర్టు ఫలితం వ్యతిరేకంగా వస్తే మళ్ళీ మెయిన్స్ రాయాల్సి వస్తుందని ఆశావహులు ఆందోళన చెందుతున్నారు. కోర్టు కేసుల పరిష్కార మార్గం చూపి.. అభ్యర్థులకు క్లారిటీ ఇస్తే బాగుంటందని నిరుద్యోగులు వాపోతున్నారు. దీనిపై కొంతమంది గ్రూప్ 1 మెయిన్స్ అభ్యర్థులు TGPSC సెక్రటరీ నవీన్ నికోలస్ ను కలిసి వినతి పత్రం అందజేశారు. ప్రస్తుతం ఉద్యోగ నియామకాలపై కోర్టుల్లో ఉన్న కేసుల అన్ని విషయాలు తెలుసన్న సెక్రటరీ.. లోకల్ నాన్ లోకల్, GO 29 వంటి ప్రధాన సమస్యలు ఉన్నాయని తెలిపినట్లు విద్యార్థులు చెబుతున్నారు.
కాగా, సెప్టెంబర్ 20న స్పోర్ట్ కోటా రిజర్వేషన్ల పైన మధ్యంతర ఉత్తర్వులు జారీ చేస్తూ తెలంగాణ హైకోర్టు కేసు వేసిన పిటిషనర్లకు అనుకూలంగా నిర్ణయం తీసుకుంది. ముందుగా కమిషన్ నిర్ణయించినట్టు ఫార్మ్ 1 కలిగిన విద్యార్థులే కాకుండా ఫామ్ 2 ఉన్న విద్యార్థులను కూడా మెయిన్స్ రాసేందుకు అనుమతించాలని కమిషన్ ను ఆదేశించింది. కొత్తగా అనుమతించబడ్డ ఈ అభ్యర్థుల తుది మెయిన్స్ ఫలితం హైకోర్టు నవంబర్ 20న ఇచ్చే తీర్పు పైన ఆధారపడి ఉంటుందని కోర్టు ప్రకటించినప్పటికీ, ఈ కోర్టు ఆదేశాల పైన కమిషన్ ఇంకా ఏ విధమైన ప్రకటన చేయలేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. గ్రూప్ 1 ప్రిలిమ్స్ ఫలితాలు జూలై 7న విడుదలవగా.. అక్టోబర్ 21 నుంచి మెయిన్స్ పరీక్షలు జరగనున్నాయి. కోర్టు ఆదేశాలతో స్పోర్ట్స్ కోటాలో కొత్తవాళ్లు మెయిన్స్ కు అర్హత సాధించారు. ఇలాంటి అన్ని విషయాలపై తెలంగాణ పబ్లిక్ సర్వీస్ కమిషన్ క్లారిటీ ఇచ్చి నిరుద్యోగుల్లో నెలకున్న ఆందోళనలను తొలగించాలని కోరారు.