JNTU-H online exam for BTech, pharmacy : కరోనా మహమ్మారి విజృంభణ, లాక్ డౌన్ల నేపథ్యంలో జేఎన్టీయూ చరిత్రలోనే ఇదే తొలిసారిగా ఆన్‌లైన్‌లో బీటెక్ ఫైనలియర్ పరీక్షలు నిర్వహించబోతున్నారు. జవహర్‌లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం చరిత్రలో తొలిసారి బీటెక్ తోపాటు, బీఫార్మసీ పరీక్షలను కూడా ఆన్‌లైన్‌లోనే నిర్వహించ తలపెట్టారు. బీటెక్, బీఫార్మసీ చివరి సంవత్సరం రెండో సెమిస్టర్ పరీక్షలు పూర్తిగా ఆన్‌లైన్‌లోనే జూన్ మూడోవారంలో నిర్వహించాలని వర్సిటీ నిర్ణయం తీసుకుంది. పరీక్షల తేదీలను ఇంకా ఖరారు చేయాల్సి ఉంది. దీని కోసం విద్యార్థుల ఇంటర్నల్ మార్కులను జూన్ 15 వరకు సమర్పించాలని అన్ని అనుబంధ కాలేజీల ప్రిన్సిపాల్స్‌ను సోమవారం కోరింది. విదేశాల్లో పీజీ కోర్సుల్లో ప్రవేశాలు పొందాలనుకునే విద్యార్థులకు జూలై వరకే గడువుంది. కాగా, రెగ్యులర్, సప్లిమెంటరీ విద్యార్థులు ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా ఈనెల 29 వరకు పరీక్ష ఫీజు చెల్లించవచ్చని జేఎన్టీయూ డైరెక్టర్ వి.కామాక్షిప్రసాద్ తెలిపారు. రూ.1000 ఆలస్య రుసుముతో జూన్ 4 వరకు, రూ.5 వేలతో జూన్ 12 వరకు చెల్లించవచ్చని చెప్పారు.