విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. నెలకు రూ.15 వేలు, ఏడాదికి రూ.1 లక్ష

పీజీ, డిగ్రీ, పాఠశాల విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అందిస్తున్న పలు స్కాలర్‌షిప్‌ అవకాశాలు అందుబాటులో ఉన్నాయి. పీజీ విద్యార్థులకు నెలకు రూ.15 వేలు, దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష, 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు నెలకు రూ.500 వరకు ఆర్థిక సాయం లభిస్తుంది. అర్హతలు, దరఖాస్తు గడువులు, అవసరమైన ధ్రువపత్రాలను తెలుసుకుని విద్యార్థులు సకాలంలో దరఖాస్తు చేసుకోవచ్చు..

విద్యార్థులకు అదిరిపోయే స్కాలర్‌షిప్‌లు.. నెలకు రూ.15 వేలు, ఏడాదికి రూ.1 లక్ష
Student Scholarships

Updated on: Sep 04, 2026 | 6:39 PM

హైదరాబాద్, సెప్టెంబర్ 4: ఉన్నత విద్యను అభ్యసిస్తున్న విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం, వివిధ సంస్థలు అందిస్తున్న స్కాలర్‌షిప్‌లు ఆర్థికంగా ఎంతో ఉపయోగపడనున్నాయి. పీజీ మొదటి సంవత్సరం విద్యార్థులకు నెలకు రూ.15 వేల చొప్పున ఆర్థిక సాయం అందించే నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్ (NSPG)తో పాటు దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష అందించే కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్, పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున ఇచ్చే దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన అందుబాటులో ఉన్నాయి. పోస్టు గ్రాడ్యుయేషన్‌ మొదటి సంవత్సరంలో రెగ్యులర్‌ విధానంలో చేరిన విద్యార్థులను ప్రోత్సహించేందుకు యూజీసీ నేషనల్ స్కాలర్‌షిప్ ఫర్ పోస్టు గ్రాడ్యుయేట్ స్టడీస్ పథకాన్ని అమలు చేస్తోంది. అర్హులైన విద్యార్థులకు నెలకు రూ.15,000 చొప్పున 10 నెలల పాటు ఆర్థిక సాయం అందుతుంది. అంటే ఒక విద్యా సంవత్సరంలో గరిష్ఠంగా రూ.1.50 లక్షల వరకు స్కాలర్‌షిప్ పొందవచ్చు. మొదటి సంవత్సరం నిర్ణీత ప్రమాణాల మేరకు మార్కులు సాధిస్తే రెండో ఏడాది కూడా స్కాలర్‌షిప్ పొందే అవకాశం ఉంటుంది. ఇందుకోసం రెన్యువల్ చేసుకోవాలి. దేశవ్యాప్తంగా 10,000 మంది విద్యార్థులను ఈ స్కాలర్‌షిప్‌కు ఎంపిక చేస్తారు. ఇందులో 30 శాతం స్కాలర్‌షిప్‌లను బాలికలకు కేటాయించారు. బాలికల్లో సింగిల్ గర్ల్ చైల్డ్‌కు ప్రాధాన్యం ఇస్తారు. ఈ మొత్తాన్ని కాలేజీ ఫీజు, ఇంటర్నెట్, రవాణా, ల్యాప్‌టాప్, పుస్తకాలు, స్టేషనరీ తదితర విద్యా అవసరాలకు వినియోగించుకోవచ్చు.

NSPG అర్హతలు ఏమేం ఉండాలంటే?

  • ఏదైనా గుర్తింపు పొందిన విద్యాసంస్థలో ఫుల్‌టైమ్/రెగ్యులర్ పీజీ మొదటి సంవత్సరం చదువుతుండాలి.
  • విద్యార్థికి అదే తొలి పీజీ అయి ఉండాలి.
  • పీజీలో చేరే సమయానికి వయసు 30 ఏళ్లలోపు ఉండాలి.
  • ఆర్థిక స్థితితో సంబంధం లేకుండా అకడమిక్ మెరిట్ ఆధారంగా ఎంపిక చేస్తారు.

విద్యార్థులు నేషనల్ స్కాలర్‌షిప్ పోర్టల్‌లో అక్టోబరు 31, 2026వ తేదీలోపు నమోదు చేసుకోవాలి. ఫోన్ నంబర్‌ను ఓటీపీ ద్వారా ధ్రువీకరించిన అనంతరం ఈ-కేవైసీ, ఆధార్ వెరిఫికేషన్ పూర్తి చేసి దరఖాస్తు ప్రక్రియను కొనసాగించాలి. వివరాలు సరిగ్గా నమోదు చేసిన తర్వాత రిఫరెన్స్ నంబర్‌ వస్తుంది. దాని ఆధారంగా స్కాలర్‌షిప్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు. అయితే డిస్టెన్స్, కరస్పాండెన్స్ లేదా పార్ట్‌టైమ్ పీజీ కోర్సులు చదువుతున్నవారికి ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. ఇప్పటికే పీజీ పూర్తిచేసినవారు, పీజీలో చేరే సమయానికి 30 ఏళ్లు దాటినవారికి కూడా అవకాశం లేదు.

దివ్యాంగ డిగ్రీ విద్యార్థులకు ఏడాదికి రూ.లక్ష

ఆర్థికంగా వెనుకబడిన కుటుంబాలకు చెందిన దివ్యాంగ విద్యార్థులకు కొటాక్ ఎడ్యుకేషన్ ఫౌండేషన్ ఆధ్వర్యంలో కొటాక్ సురక్షా స్కాలర్‌షిప్ అందిస్తున్నారు. అర్హత ఉన్న డిగ్రీ విద్యార్థులకు కోర్సు పూర్తయ్యే వరకు ఏటా రూ.1 లక్ష చొప్పున ఆర్థిక సహాయం అందుతుంది. ఆర్థిక సాయంతో పాటు అకడమిక్ గైడెన్స్, మెంటారింగ్, స్కిల్ డెవలప్‌మెంట్ వంటి అంశాల్లోనూ విద్యార్థులకు సహకారం అందించనున్నారు. దేశంలోని ఏ ప్రాంతానికి చెందిన విద్యార్థులైనా అక్టోబరు 10, 2026వ తేదీలోపు దరఖాస్తు చేసుకోవచ్చు.

ఇవి కూడా చదవండి

అర్హతలు ఇవే..

  • దివ్యాంగుల హక్కుల చట్టం-2016 ప్రకారం కనీసం 40 శాతం లేదా అంతకంటే ఎక్కువ వైకల్యం ఉండాలి.
  • ఇంటర్మీడియట్‌లో 50 శాతానికి పైగా మార్కులు సాధించి ఉండాలి.
  • కుటుంబ వార్షిక ఆదాయం రూ.6 లక్షల్లోపు ఉండాలి.

పాఠశాల విద్యార్థులకు నెలకు రూ.500 స్కాలర్‌షిప్‌

పోస్టల్ స్టాంపుల సేకరణ, అధ్యయనంపై ఆసక్తి ఉన్న 6 నుంచి 9వ తరగతి విద్యార్థులకు కేంద్ర ప్రభుత్వం మరో అవకాశం కల్పిస్తోంది. తపాలా శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే దీన్‌దయాళ్ స్పర్శ్ యోజన పరీక్ష ద్వారా ఎంపికైన విద్యార్థులకు నెలకు రూ.500 చొప్పున, ఏడాదికి మొత్తం రూ.6,000 స్కాలర్‌షిప్ అందిస్తారు. విద్యార్థుల్లో చిన్న వయసు నుంచే పోస్టల్ స్టాంపులపై అవగాహన పెంచడం, చరిత్ర, భౌగోళిక శాస్త్రం, సైన్స్, క్రీడలు, సమకాలీన అంశాలపై ఆసక్తిని పెంపొందించడం ఈ పథకం ఉద్దేశం. రెండు దశల్లో ఎంపిక ఉంటుంది. మొదటి దశలో 50 ఆబ్జెక్టివ్ ప్రశ్నలతో పరీక్ష నిర్వహిస్తారు. వర్తమాన వ్యవహారాలు, చరిత్ర, జాగ్రఫీ, సైన్స్, క్రీడలు తదితర అంశాల నుంచి ప్రశ్నలు ఉంటాయి. అర్హత మార్కులు సాధించిన విద్యార్థులు పోస్టల్ స్టాంపులకు సంబంధించిన ప్రాజెక్టును రూపొందించాలి. ప్రాజెక్టులో ప్రతిభ ఆధారంగా ప్రతి పోస్టల్ సర్కిల్ నుంచి 40 మంది చొప్పున ఎంపిక చేస్తారు. దేశవ్యాప్తంగా మొత్తం 920 మంది విద్యార్థులకు స్కాలర్‌షిప్‌లు అందిస్తారు. ఎంపికైన విద్యార్థుల బ్యాంకు లేదా పోస్టాఫీసు ఖాతాల్లో ప్రతి మూడు నెలలకు రూ.1,500 చొప్పున జమ చేస్తారు. సెప్టెంబరు 16, 2026వ తేదీ వరకు దరఖాస్తు చేసుకోవచ్చు. పరీక్ష సెప్టెంబరు 30, 2026వ తేదీన ఉంటుంది.

అర్హతలు ఇవే..

  • 6, 7, 8 లేదా 9వ తరగతి చదువుతున్న విద్యార్థులు అర్హులు.
  • పాఠశాలలో తపాలా అధ్యయనానికి సంబంధించిన క్లబ్‌లో సభ్యత్వం ఉండాలి.
  • స్కూల్లో పోస్టల్ క్లబ్ లేకపోతే పోస్టల్ బ్యాంకులో ఖాతా ఉండాలి.
  • గత ఏడాది వార్షిక పరీక్షల్లో 60 శాతం మార్కులు సాధించి ఉండాలి.
  • ఎస్సీ, ఎస్టీ విద్యార్థులకు 5 శాతం మార్కుల మినహాయింపు ఉంటుంది.

విద్యార్థులు ఏం చేయాలి?

ఈ మూడు స్కాలర్‌షిప్‌లకు అర్హత ఉన్న విద్యార్థులు తమకు వర్తించే పథకాన్ని గుర్తించి గడువు తేదీకి ముందే దరఖాస్తు ప్రక్రియను పూర్తి చేయాలి. దరఖాస్తు సమయంలో అవసరమైన ధ్రువపత్రాలు సిద్ధంగా ఉంచుకోవడం, అధికారిక వెబ్‌సైట్లలో మాత్రమే వివరాలను నమోదు చేయడం ద్వారా తప్పులు, ఆలస్యాలను నివారించవచ్చు.

Loading...
Unable to load recommendations.
Follow Us