జగిత్యాల, ఫిబ్రవరి 18: టీఎస్‌పీఎస్సీ నిర్వహించిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ రాత పరీక్ష ఫలితాలు శుక్రవారం రాత్రి విడుదలైన సంగతి తెలిసిందే. ఈ ఫలితాల్లో జగిత్యాల జిల్లా కోరుట్లకు చెందిన బెజ్జారపు మౌనిక రాష్ట్ర స్థాయిలో ప్రథమ ర్యాంకు సాధించారు. ఫలితాల్లో మొత్తం 450 మార్కులకు గానూ 348 మార్కులతో రాష్ట్రంలో ప్రథమ స్థానాన్ని సాధించారు. పది వేల మంది ఈ పరీక్షకు హాజరుకాగా మౌనిక గరిష్ఠ మార్కులతో ఫస్ట్ ర్యాంక్ సాధించారు. కోరుట్ల పట్టణానికి చెందిన మౌనిక రిటైర్డ్ ప్రధానోపాధ్యాయుడు వేణుగోపాల్, మాధవి కుమార్తె. ఆమె పాఠశాల విద్యను కోరుట్లలోని సహృదయ్ హైస్కూల్‌లో పదో తరగతి, కరీంనగర్‌లోని ఓ ప్రైవేట్ కాలేజీలో ఇంటర్మీడియట్‌లో పూర్తి చేసింది.
హైదరాబాద్‌లో బీఫార్మసీ చేసిన తర్వాత, 2013లో అస్సాంలోని గౌహతిలో ఎంఫార్మసీ పూర్తిచేశారు. ఎంఫార్మసీలో గోల్డ్ మెడల్ కూడా సాదించారు. 2019లో పంచాయతీ కార్యదర్శి ఉద్యోగం రాగా.. ఆరు నెలలు పనిచేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం నిర్వహించిన ఫార్మసిస్టు ఉద్యోగ పరీక్షలో ప్రథమ స్థానం సాధించి హైదరాబాద్‌లోని ఈఎస్‌ఐలో ఫార్మసిస్ట్ ఉద్యోగం పొందారు. 2022 డిసెంబర్‌లో TSPSC జారీ చేసిన డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ప్రిపరేషన్ ప్రారంభించారు. ఆ పరీక్షలో కూడా స్టేట్ ఫస్ట్ ర్యాంక్ రావడంతో తన తల్లిదండ్రులు, భర్త, కుటుంబ సభ్యుల సహకారం వల్లనే ఇదంతా సాధ్యం అయినట్లు సంతోషం వ్యక్తం చేశారు. తాజాగా డ్రగ్ ఇన్‌స్పెక్టర్ ఉద్యోగానికి ఎంపిక కావడంతో మొత్తం మూడు ప్రభుత్వ ఉద్యోగాలు మౌనిక సాధించినట్లైంది. దీంతో పలువురు ఆమెను అభినందించారు.