
అమరావతి, ఏప్రిల్ 22: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని గ్రూప్ 1 సర్వీస్ పోస్టుల భర్తీకి నియామక ప్రక్రియ కొనసాగుతున్న సంగతి తెలిసిందే. ఇప్పటికే ప్రిలిమినరీ పరీక్షలు ముగియగా.. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు మే 2 నుంచి ప్రారంభంకానున్నాయి. అయితే ఈ పరీక్షల హాల్‌టికెట్లు తాజాగా ఆంధ్రప్రదేశ్ పబ్లిక్ సర్వీస్ కమిషన్ (ఏపీపీఎస్సీ) విడుదల చేసింది. గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలకు అర్హత సాధించిన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్ నుంచి హాల్ టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. అభ్యర్ధులు తమ వివరాలు నమోదు చేసి వీటిని పొందొచ్చు. ఈ పరీక్షలు మే 3 నుంచి 9వ తేదీ వరకు జరగనున్నాయి. మొత్తం ఏడు పేపర్లకు మెయిన్స్ పరీక్షలు జరుగుతాయి. ఆయా తేదీల్లో ఉదయం 10 గంటల నుంచి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరగనున్నాయి. ఈ మేరకు ఏపీపీఎస్సీ కార్యదర్శి పి రాజబాబు సోమవారం (ఏప్రిల్ 21) ఓ ప్రకటనలో తెలిపారు.
ఏపీపీఎస్సీ గ్రూప్1 మెయిన్స్ 2025 హాల్‌టికెట్ల కోసం క్లిక్ చేయండి
ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ పరీక్షలు డిస్క్రిప్టివ్ టైప్‌లో జరుగుతాయన్న సంగతి తెలిసిందే. అంటే పెన్ను, పేపర్ విధానంలో వ్యాసరూపంలో ప్రశ్నలకు సమాధానాలు రాయవల్సి ఉంటుంది. ఈమేరకు పరీక్షల షెడ్యూల్ తేదీలను తమ అధికారిక వెబ్ సైట్‌లో ఇప్పటికే కమిషన్ పొందుపరిచింది. వివాదాలకు తావులేకుండా ఈసారి కూడా ఏపీపీఎస్సీ గ్రూప్ 1 మెయిన్స్ ప్రశ్నాపత్రాన్ని ట్యాబ్‌లలో పొందుపరచి ఇవ్వాలని నిర్ణయించినట్లు ఎపీపీఎస్సీ కార్యదర్శి నరసింహమూర్తి పేర్కొన్నారు. అలాగే అభ్యర్ధులు రాసే ఆన్సర్ బుక్ లెట్‌లను కూడా ఈ సారి రూల్ పేపర్స్‌కి బదులు వైట్ పేపర్ల బుక్ లెట్ ఇవ్వాలని నిర్ణయించారు. కాగా 2023 డిసెంబర్‌లో మొత్తం 89 గ్రూప్ 1 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేయగా గతేడాది మార్చి 17వ తేదీన ప్రిలిమినరీ పరీక్షలు నిర్వహించారు. అదే ఏడాది ఏప్రిల్‌లో ఫలితాలు వెల్లడించారు. అనంతరం ఒక్కో పోస్టుకు 50 మంది చొప్పున 1:50 ప్రాతిపదికన 4,496 మందిని మెయిన్స్‌కి ఎంపిక చేశారు. వీరందరికీ మే నెలలో విశాఖపట్నం, విజయవాడ, తిరుపతి, అనంతపురం పరీక్ష కేంద్రాల్లో మెయిన్ పరీక్షలు నిర్వహించనున్నారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.