ఆంధ్రప్రదేశ్ పోలీస్ సబ్ ఇన్స్‌పెక్టర్ (ఎస్సై) పోస్టులకు ఫిబ్రవరి 19న నిర్వహించిన ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు మంగళవారం (ఫిబ్రవరి 28)న విడుదలయ్యాయి. ఈ పరీక్షకు హాజరైన అభ్యర్ధులు అధికారిక వెబ్‌సైట్‌లో ఫలితాలు చెక్ చేసుకోవచ్చని ఆంధ్రప్రదేశ్ పోలీస్ రిక్రూట్ మెంట్ బోర్డు తన ప్రకటనలో తెలిపింది. కాగా మొత్తం 411 ఎస్ఐ ఉద్యోగాల భర్తీకి ఈ నెల 19న దాదాపు 291 పరీక్ష కేంద్రాల్లో ప్రిలిమినరీ రాత పరీక్షను నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షకు 1,51,288 మంది అభ్యర్ధులు హాజరయ్యారు. వీరిలో 57,923 మంది అభ్యర్ధులు తర్వాత దశకు ఎంపికయ్యారు. వీరిలో పురుషులు 49,386 ఉండగా, మహిళలు 8,537 మంది ఉన్నారు.
కాగా పరీక్ష తర్వాత రోజున ప్రైమరీ ఆన్సర్ ‘కీ’ విడుదల చేసిన సంగతి తెలిసిందే. దీనిపై పేపర్ -1కు దాదాపు 1553 అభ్యంతరాలు బోర్డుకు అందాయి. వాటిని నిపుణులు పరిశీలించినపప్పటికీ ఆన్సర్ ‘కీ’లో ఎలాంటి మార్పులు చేయలేదని బోర్డు వెల్లడించింది. రెండో పేపర్‌లో ఒక ప్రశ్నకు ఒకటి కంటే ఎక్కువ సరైన సమాధానాలు ఉన్నాయి. వాటిని పరిగణనలోకి తీసుకొని మార్కులు కేటాయించారు. మార్చి 4వ తేదీ ఉదయం 11 గంటల నుంచి స్కాన్ చేసిన ఓఎంఆర్ షీట్లు వెబ్‌సైట్‌లో అందుబాటులో ఉంటాయని బోర్డు తెలిపింది. ఇతర అప్‌డేట్ల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను చెక్ చేసుకోవల్సిందిగా తెల్పింది.
మరిన్ని తాజా విద్యా, ఉద్యోగ సమాచారం కోసం క్లిక్ చేయండి.