అమరావతి, అక్టోబర్ 13: తెలుగు రాష్ట్రాల్లో దసరా పండుగ సందడి ప్రారంభమైంది. ఈ క్రమంలో రెండు రాష్ట్రాల ప్రభుత్వాలు స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ప్రకటించాయి. ఈ రోజు తెలంగాణలో అన్ని విద్యాసంస్థలకు దసరా సెలవులు అమలులోకి వచ్చాయి. అటు ఆంధ్రప్రదేశ్‌లో రేపట్నుంచి అంటే శనివారం (అక్టోబర్ 14) విద్యాసంస్థలకు దసరా సెలవులు ప్రారంభంకానున్నాయి. ఈ మేరకు రాష్ట్రంలోని పాఠశాలలకు శనివారం నుంచి దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. అక్టోబరు 14 నుంచి 24 వరకూ దసరా సెలవులను ఖరారు చేస్తూ అన్ని విద్యాసంస్థలకు ఆదేశాలు ఇచ్చింది. దసరా సెలవుల అనంతరం తిరిగి అక్టోబరు 25న అన్ని పాఠశాలలు తెరుచుకుంటాయని పాఠశాల విద్యాశాఖ ఉత్తర్వుల్లో స్పష్టం చేసింది. మొత్తం 11 రోజుల పాటు స్కూళ్లు, కాలేజీలకు దసరా సెలవులు ఉంటాయని ప్రభుత్వం తన ఉత్తర్వుల్లో పేర్కొంది.
అటు తెలంగాణ ప్రభుత్వం అన్ని విద్యా సంస్థలకు మొత్తం 12 రోజులు దసరా సెలవులు ప్రకటించింది. బతుకమ్మ, దసరా పండుగలకు కలిపి ఒకేసారి రాష్ట్ర విద్యాశాఖ సెలవులు ప్రకటించింది. తొలుత అక్టోబర్ 13వ తేదీ నుంచి 23వ తేదీ వరకు దసరా సెలవులు ఇస్తున్నట్లు ప్రకటించింది. అయితే దసరా సెలవు తేదీలో మార్పులు చేస్తూ తాజాగా తెలంగాణ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. దసరా సెలవు దినాన్ని అక్టోబర్ 23వ తేదీకి మారుస్తూ ప్రకటనలో తెల్పింది. అలాగే దసరా సెలవు దినాల్లో మరో రోజు పొడిగిస్తున్నట్లు కూడా ఉత్తర్వుల్లో పేర్కొంది. దీంతో అక్టోబరు 24వ తేదీని కూడా సెలవుదినంగా తెలంగాణ విద్యాశాఖ ప్రకటించింది. ఈ ఏడాదికి సంబంధించి తెలంగాణ ప్రభుత్వం విడుదల చేసిన సెలవుల జాబితాలో అక్టోబరు 24వ తేదీని ‘దసరా సెలవు’ దినంగా ప్రకటించడంతో మొత్తం సెలవుల సంఖ్య 13కి చేరింది. ఇక ఉస్మానియా యూనివర్సిటీకి అక్టోబర్ 14వ తేదీ నుంచి 24వ తేదీ వరకు దసరా సెలవులు ప్రకటించగా.. 25వ తేదీన యూనివర్సిటీతో పాటు అనుబంధ కాలేజీల్లో తరగతులు పునఃప్రారంభమవుతాయని ఓయూ రిజిస్ట్రార్ ఓ ప్రకటనలో తెలిపారు. వర్సిటీకి 11 రోజుల పాటు దసరా సెలవులు ఇవ్వడంపై విద్యార్థులతో పాటు పలువురు ప్రొఫెసర్లు అసహనం వ్యక్తం చేశారు.
ఈ విద్యాసంవత్సరానికి సంబంధించి తెలంగాణ సార్వత్రిక ఓపెన్ టెన్త్, ఇంటర్ పరీక్షలు అక్టోబరు 16 నుంచి 26 వరకు జరగనున్నట్లు జిల్లా విద్యాశాఖాధికారి కె రాము ఓ ప్రకటనలో తెలిపారు. పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు తమ స్టడీసెంటర్‌లో హాల్ టికెట్లు పొందవల్సిందిగా ఆయన పేర్కొన్నారు. లేదంటే అధికారిక వెబ్‌సైట్ నుంచి కూడా హాల్‌టికెట్లను డౌన్‌లోడ్ చేసుకోవచ్చని ఆయన తెలిపారు. పరీక్షలు ఆయా తేదీల్లో ఉదయం 9 నుంచి మధ్యాహ్నం 12 గంటల వరకు సంబంధిత పరీక్ష కేంద్రాల్లో జరుగుతాయని ఆయన వివరించారు.
మరిన్ని ఆంధ్రప్రదేశ్ వార్తల కోసం క్లిక్ చేయండి.