AP SSC Public Exams 2025: మరికాసేపట్లో టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం.. RTC బస్సుల్లో విద్యార్ధులకు ఉచిత ప్రయాణం!

రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు ఈ రోజు నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు జరుగుతాయి. మొత్తం 3.15 గంటలపాటు ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. 6 లక్షలకుపైగా విద్యార్ధులు ఈ పరీక్షలకు హాజరుకానున్నారు. విద్యార్ధులందరికీ ఆర్టీసీ ఉచిత ప్రయాణ సౌకర్యం కల్పించింది..

AP SSC Public Exams 2025: మరికాసేపట్లో టెన్త్ పబ్లిక్‌ పరీక్షలు ప్రారంభం.. RTC బస్సుల్లో విద్యార్ధులకు ఉచిత ప్రయాణం!
SSC Public Exams

Updated on: Mar 17, 2025 | 6:23 AM

అమరావతి, మార్చి 17: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు సోమవారం (మార్చి 17) నుంచి ప్రారంభం కానున్నాయి. ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 వరకు మొత్తం 3.15 గంటల చొప్పున ఆయా తేదీల్లో పరీక్షలు జరుగుతాయి. మార్చి 31వ తేదీన రంజాన్‌ సెలవు వస్తే ఏప్రిల్‌ ఒకటో తేదీన నిర్వహిస్తారు. లేదంటే మార్చి 31న యథాతథంగా నిర్వహిస్తారు. కాగా 2024 – 25 విద్యా సంవత్సరానికిగాను రాష్ట్రవ్యాప్తంగా 6,49,884 మంది విద్యార్థులు పదో తరగతి పరీక్షలకు హాజరవుతున్నారు. వీరిలో 6,19,275 మంది రెగ్యులర్, 30,609 మంది ప్రైవేటు విద్యార్థులు ఉన్నారు. రెగ్యులర్‌ విద్యార్థుల్లో ఇంగ్లిష్‌ మీడియంలో 5,64,064 మంది, తెలుగు మీడియంలో 51,069 మంది, ఉర్దూలో 2,471 మంది, హిందీలో 16 మంది, కన్నడలో 623 మంది, తమిళంలో 194 మంది, ఒడియాలో 838 మంది చొప్పున పదో తరగతి పరీక్షలు రాయనున్నారు.

ఇక పరీక్షలకు ఇప్పటికే పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 3,450 పరీక్ష కేంద్రాలను ఏర్పాటు చేశారు. వీటిల్లో 163 సమస్యాత్మక సెంటర్లు ఉండగా.. ఆయా కేంద్రాల్లో సీసీటీవీ కెమెరాల పర్యవేక్షణలో పరీక్షలు జరగనున్నాయి. అన్ని పరీక్ష సెంటర్ల వద్ద 144 సెక్షన్‌ విధించారు. ఇన్విజిలేటర్లతోపాటు సెంటర్ల వద్ద విధులు నిర్వర్తించే పోలీసులు, ఏఎన్‌ఎం సిబ్బందితో సహా ఎవరూ ఫోన్లు, ఎలాంటి ఎలక్ట్రానిక్‌ పరికరాలు తీసుకెళ్లడానికి వీలులేదని సర్కార్ హుకూం జారీ చేసింది. పర్యవేక్షణకు 156 ఫ్లైయింగ్‌ స్క్వాడ్స్‌, జిల్లా స్థాయి కంట్రోల్‌ రూమ్‌తోపాటు రాష్ట్రస్థాయిలో ఎస్‌ఎస్‌సీ డైరెక్టరేట్‌లోను ప్రత్యేక కంట్రోల్‌ రూమ్‌ అందుబాటులో ఉంటుంది. పరీక్షలపై ఫిర్యాదులు, సందేహాలకు 0866–2974540 ఫోన్ నంబర్‌ను సంప్రదించవచ్చు.

మరోవైపు ఆంధ్రప్రదేశ్‌ సార్వత్రిక విద్యాపీఠం నిర్వహించే ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు కూడా ఈ రోజు నుంచే రెగ్యులర్‌ విద్యార్ధులతోపాటు ప్రారంభంకానున్నాయి. రెగ్యులర్‌ విద్యార్ధులతోనే వీరు కూడా పరీక్షలు రాస్తారన్నమాట. అయితే ఓపెన్‌ టెన్త్‌ పరీక్షలు మార్చి 28తో ముగుస్తాయి. ఈ పరీక్షలకు 30,334 మంది హాజరవుతారు. ఇక పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులందరికీ APSRTC బస్సుల్లో ఉచిత ప్రయాణ సదుపాయం కల్పించారు. పల్లె వెలుగు, అల్ట్రా పల్లె వెలుగు, సిటీ ఆర్డినరీ బస్సుల్లో హాల్ టికెట్ చూపించి విద్యార్థులు ఉచితంగా ప్రయాణించవచ్చు.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.