
అమరావతి, డిసెంబర్ 8: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16వ తేదీ నుంచి ప్రారంభంకానున్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఇప్పటికే పరీక్షల ఫీజు చెల్లింపుల ప్రక్రియ ప్రారంభమైంది. గతంలో ఇచ్చిన ప్రకటన మేరకు అక్టోబరు 28వ తేదీ నుంచి చెల్లించేందుకు అవకాశం కల్పించారు. అయితే తాజాగా పరీక్ష ఫీజు చెల్లింపుల గడువును పొడిగిస్తూ ప్రకటన జారీ చేసింది. మార్చిలో జరిగే పదోతరగతి పరీక్ష ఫీజు చెల్లింపు గడువును డిసెంబరు 9 వరకు పొడిగించినట్లు ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్ కేవీ శ్రీనివాసరెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఎలాంటి ఆలస్య రుసుములేకుండా డిసెంబర్ 9వ తేదీ వరకు ఫీజు చెల్లించవచ్చు.
ఆ తర్వాత రూ.50 అపరాధ రుసుంతో డిసెంబరు 12 వరకు, రూ.200 అపరాధ రుసుంతో డిసెంబరు 15 వరకు, రూ.500 అపరాధ రుసుంతో డిసెంబర్ 18వ తేదీ వరకు చెల్లించేందుకు అవకాశం ఉందని ప్రభుత్వ పరీక్షల విభాగం డైరెక్టర్ శ్రీనివాసులురెడ్డి ఓ ప్రకటనలో తెలిపారు. అలాగే కొన్ని ప్రైవేటు పాఠశాలల్లో అధిక పరీక్ష ఫీజు వసూలు చేస్తున్నట్లు ఫిర్యాదులు రావడంతో.. ఈసారి విద్యార్ధులే నేరుగా ఆన్‌లైన్ ఫీజు చెల్లించేందుకు ప్రభుత్వం అవకాశం ఇచ్చిన సంగతి తెలిసిందే. స్కూల్ యాజమన్యం అనధికార వసూళ్లకు పాల్పడితే విద్యార్థులు, తల్లిదండ్రులు మండల విద్యాధికారి, జిల్లా విద్యాధికారులు, ప్రాంతీయ సంయుక్త సంచాలకులకు ఫిర్యాదులు చేయొచ్చని సూచించారు. కాగా పదో తరగతి పబ్లిక్ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్ 1 వరకు ఆయా తేదీల్లో ఉదయం 9.30 నుంచి మధ్యాహ్నం 12.45 గంటల వరకు కొనసాగనున్నాయి.
రాష్ట్రీయ మిలిటరీ స్కూల్ కామన్ ఎంట్రన్స్ టెస్ట్ (RMS CET) డిసెంబర్ 7 (ఆదివారం) నిర్వహించిన సంగతి తెలిసిందే. ఈ పరీక్షలో వచ్చిన ర్యాంకు ఆధారంగా 2026-27 విద్యా సంవత్సరానికి 6 నుంచి 9 తరగతుల్లో ప్రవేశాలు కల్పించనున్నారు. పరీక్షకు హాజరైన విద్యార్థులు ప్రశ్న పత్రం, కీ అధికారిక వెబ్‌సైట్ నుంచి డౌన్‌లోడ్ చేసుకోవచ్చు. కాగా 13 నుంచి 15 సంవత్సరాల వయస్సు గల విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష ద్వారా ప్రవేశాలు పొందడానికి అర్హులు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.