
అమరావతి, జూన్ 5: ఎట్టకేలకు మెగా డీఎస్సీ ఆన్‌లైన్ పరీక్షలు వచ్చేశాయి. ఇప్పటికే హాల్ టికెట్లను విడుదల చేసిన విద్యాశాఖ పరీక్షల నిర్వహణకు అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది. శుక్రవారం (జూన్ 6) నుంచి ఆన్‌లైన్ విధానంలో ఈ పరీక్షలు రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభంకానున్నాయి. డీఎస్సీ పరీక్షలకు మొత్తం 154 పరీక్ష కేంద్రాలను ఏర్పాట్లు చేశారు. రోజుకు రెండు షిఫ్టుల్లో ఉదయం, సాయంత్రం వేళల్లో ఈ పరీక్షలు జరగనున్నాయి. అయితే పరీక్ష సమయానికి ఒక్క నిమిషం ఆలస్యమైనా అనుమతించబోమని డీఎస్సీ కన్వీనర్ వెంకట కృష్ణారెడ్డి ప్రకటించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు 90 నిమిషాలు ముందే చేరుకోవాలని సూచించారు. అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను గుర్తించేలా ఆయా కేంద్రాల వద్ద ఫ్లెక్సీలను ఏర్పాటు చేస్తున్నట్లు తెలిపారు. ఎక్కడా ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించారు.
జూన్ 6 నుంచి మొత్తం 154 కేంద్రాల్లో ఈ పరీక్షలు ప్రారంభమై.. జూన్ 30 వరకు కొనసాగుతాయి. అభ్యర్ధుల హాల్‌టికెట్లలో ఏమైన తప్పులు ఉంటే ప్రభుత్వం జారీ చేసిన ఆధార్, ఓటరు ఐడీ, పాన్ కార్డులాంటివి.. ఏదైనా గుర్తింపు కార్డులను పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే.. అక్కడి అధికారులు వాటిని సరి చేస్తారని అన్నారు. ముఖ్యంగా తల్లిదండ్రుల పేర్లు, పుట్టిన తేదీ, కులం వంటి వివరాలు తప్పుగా నమోదైతే అందుకు సంబంధించిన ఆధారాలను అధికారులకు చూపిస్తే నామినల్ రోల్స్‌లో వాటిని సరి చేస్తారని అన్నారు. ఒకవేళ ఎవరికైనా హాల్‌టికెట్‌లో ఫొటో లేకపోతే.. అటువంటి అభ్యర్థులు పరీక్ష కేంద్రానికి రెండు ఫొటోలు తీసుకురావాలన్నారు. హాల్‌టికెట్‌లో తప్పిదాలు లేకుంటే ఫొటోలు అవసరం లేదని అన్నారు. అభ్యర్థులు తమ వెంట ఎలాంటి ఎలక్ట్రానిక్ గాడ్జెట్‌లు అంటే.. మొబైల్ ఫోన్లు, స్మార్ట్ వాచీలు, పెన్ డ్రైవ్‌లు, బ్లూటూత్ పరికరాలు మొదలైనవి తీసుకెళ్లకూడదు. ఇ-అడ్మిట్ కార్డు ప్రింటవుట్, గుర్తింపు కార్డు, అడ్మిట్ కార్డులో ఫొటో లేకుంటే 2 పాస్‌పోర్ట్ సైజు ఫోటోలు తీసుకెళ్తే సరిపోతుంది.
ఇక దృష్టాలోపం, రెండు చేతులూ లేని దివ్యాంగులకు పరీక్ష రాసేందుకు పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 1300 మంది స్క్రైబ్ కోసం దరఖాస్తు చేసుకున్నారు. ఒకవేళ దరఖాస్తులో స్క్రైబ్ వివరాలు పేర్కొనకపోయినా.. డీఈవో పరిశీలించి అటువంటి వారికి సహాయకులను ఏర్పాటు చేయనున్నారు. అభ్యర్ధులకు 2.30 గంటలపాటు పరీక్ష ఉంటుంది. ఇక దివ్యాంగ అభ్యర్ధులకు అదనంగా మరో 50 నిమిషాలు కేటాయించనున్నారు. కాగా రాష్ట్ర వ్యాప్తంగా మెగా డీఎస్సీకి 3,35,401 మంది 5,77,417 దరఖాస్తులు సమర్పించారు. ఇప్పటికే పరీక్షల షెడ్యూల్‌ను విద్యాశాఖ వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. మొత్తం పరీక్షలు పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమిక ‘కీ’ విడుదల చేయనున్నారు. అభ్యంతరాల స్వీకరణకు వారం గడువు ఇచ్చి.. అనంతరం తుది ఆన్సర్ కీ రూపొందిస్తారు.
మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్ చేయండి.