Mega DSC 2024 Notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పటికి వచ్చేనో..? ఆందోళనలో అభ్యర్థులు

|

Nov 11, 2024 | 3:01 PM

మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ఎప్పుడు విడుదలవుతుందో తెలియక నిరుద్యోగ అభ్యర్ధులు అందోళన చెందుతున్నారు. కోటి ఆశలతో ఎన్నో నెలలుగా ప్రిపేరవుతున్న అభ్యర్ధులు తాజా పరిణామాలపై తీవ్ర ఒత్తిడికి గురవుతున్నారు. నవంబర్ 6వ తేదీన ఇస్తామన ప్రకటన ఇంకా విడుదలకాలేదు.. అసలెప్పుడు విడుదలవుతుందో తెలియదు..

Mega DSC 2024 Notification: మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఎప్పటికి వచ్చేనో..? ఆందోళనలో అభ్యర్థులు
Mega DSC 2024
Follow us on

అమరావతి, నవంబర్‌ 11: ఆంధ్రప్రదేశ్ మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్‌ ఎప్పుడు విడుదలవుతుందో తెలియని పరిస్థితి నెలకొంది. యేళ్ల తరబడి ఎదురు చూస్తున్న నిరుద్యోగుల ఆశలు నీరుగారిపోతాయేమోనని ఆవేదన వ్యక్తం అవుతుంది. నిన్నమొన్నటి వరకు మెగా డీఎస్సీ ఇదిగో అదిగో అన్నవారంతా ఇప్పుడు చప్పుడు చేయకుండా ఉండటం పలు అనుమానాలకు దారి తీస్తుంది. నవంబర్‌ 6వ తేదీన డీఎస్సీ ప్రకటన జారీ చేసేందుకు పాఠశాల విద్యాశాఖ ఏర్పాట్లు చేసిందనీ.. అయితే సాంకేతిక కారణాలతో వాయిదా వేస్తున్నట్టు ప్రకటించింది.

కానీ ఇప్పటి వరకూ దీనిపై విద్యాశాఖ ఎలాంటి ప్రకటన జారీ చేయలేదు. మరోవైపు టెట్‌ ఫలితాలు వెల్లడించిన వెంటనే డీఎస్సీ ప్రకటన వస్తుందని నిరుద్యోగుల్లో ఆశలు రేకెత్తించిన సర్కార్.. నోటిఫికేషన్‌ విడుదల తేదీపై క్లారిటీ ఇవ్వకపోవడంతో నిరుద్యోగులు నిరాశకు గురవుతున్నారు. ఇప్పటికే టెట్‌ ఉత్తీర్ణులైన అభ్యర్థులు డీఎస్సీ ప్రకటన కోసం ఎదురుచూస్తున్నారు. ప్రైవేటు స్కూల్‌ ఉపాధ్యాయులు, నిరుద్యోగులు, చిరుద్యోగులు సైతం తాము చేస్తున్న ఉద్యోగాలను వదిలేసి మరీ ప్రభుత్వ టీచర్‌ కొలువులు కొట్టాలనే తపనతో గత కొన్ని నెలలుగా సన్నద్ధమవుతున్నారు. కాగా మొత్తం 16,317 పోస్టులను భర్తీకి మెగా డీఎస్సీ నియామక ప్రక్రియ చేపట్టనున్న సంగతి తెలిసిందే. వీటితో పాటు గురుకుల, ఆదర్శ పాఠశాలలు, బీసీ, గిరిజ‌న పాఠశాలల్లో 2,281 ఖాళీలు ఉన్నాయి.

ఇప్పటి వరకూ నోటిఫికేషన్‌ జారీపై స్పష్టత రాకపోవడంతో వెంటనే మెగా డీఎస్సీ నోటిఫికేషన్‌ ఇవ్వాలని అభ్యర్థులు కోరుతున్నారు. మరోవైపు మెగా డీఎస్సీ వాయిదా పడటానికి ఎస్సీ రిజర్వేషన్లే కారణమని అధికారులు చెబుతున్నారు. వయో పరిమితిలో సడలింపు, రిజర్వేషన్లపై స్పష్టత వచ్చిన తర్వాతే నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉందని అంటున్నారు. ఇదిలాఉంటే మరోవైపు ఉచిత శిక్షణ ప్రవేశ పరీక్ష కూడా వాయిదా పడింది.
డీఎస్సీ ఉచిత శిక్షణ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులకు నవంబర్‌ 10న నిర్వహించాల్సిన స్క్రీనింగ్‌ పరీక్ష వాయిదా పడింది. ఎమ్మెల్సీ ఎన్నికల కోడ్‌ అమల్లో ఉన్నందున పరీక్షను వాయిదా వేస్తున్నట్లు రాష్ట్ర షెడ్యూల్డ్‌ కులాల సంక్షేమ శాఖ వెల్లడించింది. పరీక్ష తేదీని త్వరలో తెలియజేస్తామని ప్రకటనలో తెలిపింది.

ఇవి కూడా చదవండి

మరిన్ని విద్యా, ఉద్యోగ వార్తల కోసం క్లిక్‌ చేయండి.