అమరావతి, అక్టోబర్ 31: ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర మెగా డీఎస్సీ 2024 నోటిఫికేషన్ విడుదలకు రాష్ట్ర ప్రభుత్వం వడివడిగా ఏర్పాట్లు చేస్తుంది. అందిన సమాచారం మేరకు నవంబరు 6 లేదా 7వ తేదీన మెగా డీఎస్సీ ఉద్యోగ ప్రకటన వెలువడే అవకాశం ఉన్నట్లు తెలుస్తుంది. ఈ మేరకు కసరత్తు చేస్తోంది. ఈ నేపథ్యంలో ఎలాంటి న్యాయ వివాదాలు లేకుండా నోటిఫికేషన్ ఇవ్వాలని విద్యాశాఖ భావిస్తోంది. మెగా డీఎస్సీ నోటిఫికేషన్ ద్వారా మొత్తం 16,347 ఉపాధ్యాయ పోస్టులు భర్తీ చేయనున్న సంగతి తెలిసిందే. మొత్తం పోస్టుల్లో.. సెకండరీ గ్రేడ్ టీచర్లు (ఎస్జీటీ) పోస్టులు 6,371, స్కూల్ అసిస్టెంట్లు (ఎస్‌ఏ) పోస్టులు 7725, ట్రైన్డ్ గ్రాడ్యుయేట్ టీచర్ (టీజీటీ) పోస్టులు 1781, పోస్టు గ్రాడ్యుయేట్ టీచర్ (పీజీటీ) పోస్టులు 286, ప్రిన్సిపల్ పోస్టులు 52, వ్యాయామ ఉపాధ్యాయ పోస్టులు (పీఈటీ) 132 వరకు ఉన్నాయి.
ఇక టెట్ ఫలితాలు కూడా మరో రెండు రోజుల్లో విడుదలవనున్నాయి. టెట్ ఫలితాలు వెలువడిన తర్వాతి రోజే డీఎస్సీ ప్రకటన ఇవ్వాలని ప్రభుత్వం తొలుత భావించినప్పటికీ నవంబర్ 3వ తేదీ ఆదివారం కావడంతో దానిని వాయిదా వేసింది. ఈ క్రమంలో నవంబర్ 6 లేదా 7వ తేదీన నోటిఫికేషన్ వెలువడే అవకాశం ఉన్నట్లు సమాచారం. ఖాళీల వివరాలకు సంబంధించి జిల్లాల వారీగా రోస్టర్ వివరాలు సమర్పించాలని ఇటీవల పాఠశాల విద్యాశాఖ ఆదేశాలు జారీ చేసింది. ఇక డీఎస్సీ నోటిఫికేషన్ వెలువడిన నాలుగు నెలల్లో డీఎస్సీ నియామక ప్రక్రియ పూర్తిచేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది.
ఏపీ టెట్ జులై-2024 ఫైనల్ కీ ఇటీవల విద్యాశాఖ విడుదల చేసిన సంగతి తెలసిందే. షెడ్యూల్ ప్రకారంగానే నవంబర్ 2వ తేదీన ఫలితాలను ప్రకటించనున్నారు. ఇప్పటికే రెస్పాన్స్ షీట్లు, ప్రాథమిక కీ విడుదలచేయగా.. వాటి సమాధానాలపై వచ్చిన అభ్యంతరాలను పరిశీలించిన అనంతరం తుది కీ విడుదల చేశారు. కాగా టెట్ పరీక్షలు అక్టోబర్ 3 నుంచి 21వ తేదీ వరకు ఆన్‌లైన్ విధానంలో నిర్వహించిన విషయం తెలిసిందే. టెట్‌కు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 4,27,300 మంది దరఖాస్తు చేసుకోగా.. వారిలో 3,68,661 మంది పరీక్ష రాశారు. దాదాపు 17 రోజల పాటు రోజుకు రెండు విడతలుగా ఈ పరీక్షలు ప్రశాంతంగా జరిగాయి.