అమరావతి, ఆగస్టు 22: ఆంధ్రప్రదేశ్‌లో 2024-25 విద్యా సంవత్సరానికిగానూ జరగబోయే పదో తరగతి పబ్లిక్ పరీక్షలకు సంబంధించిన మోడల్ ప్రశ్నపత్రాలను పాఠశాల విద్యా శాఖ విడుదల చేసింది. మోడల్ క్వశ్చన్ పేపర్లతో పాటు బ్లూ ప్రింట్, మార్కుల వెయిటేజీ అంశాలను కూడా సబ్జెక్టుల వారీగా విడుదల చేసింది. వీటన్నింటినీ పదో తరగతి బోర్డు అధికారిక వెబ్‌సైట్‌లో పొందుపరిచింది. ఈ మోడల్ పేపర్లు, బ్లూ ప్రింట్, వెయిటేజీ అంశాల ఆధారంగా ఈ ఏడాది పరీక్షలకు హాజరయ్యే విద్యార్థులు పబ్లిక్ పరీక్షలకు సన్నద్ధమవ్వాల్సి ఉంటుందని విద్యాశాఖ తన ప్రకటనలో పేర్కొంది. పరీక్షలో అడిగే ప్రశ్నల సరళి, వాటి కాఠిన్యత స్థాయి, మార్కుల భారత్వం, సమయం, సిలబస్ తదితరాలను అవగాహన చేసుకుని పరీక్షల్లో ఎక్కువ మార్కులు సాధించేందుకు విద్యార్థులకు ఇవి ఉపకరిస్తాయని వివరించింది.
ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలోని విజయనగరం జిల్లాలో ఉన్న కోరుకొండ సైనిక్ స్కూల్లో వివిధ విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. ఈ పోస్టులన్నింటినీ ఒప్పంద ప్రాతిపదికన భర్తీ చేయనున్నారు. మొత్తం ఖాళీల్లో.. కౌన్సెలర్ పోస్టులు 1, పీటీఐ కమ్ మాట్రన్ పోస్టులు 1, క్రాఫ్ట్ అండ్ వర్క్‌షాప్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 1, బ్యాండ్ మాస్టర్ పోస్టులు 1, హార్స్ రైడింగ్ ఇన్‌స్ట్రక్టర్ పోస్టులు 1, స్కూల్ మెడికల్ ఆఫీసర్ పోస్టులు 1, నర్సింగ్ సిస్టర్ పోస్టులు 1, టీజీటీ మ్యాథమెటిక్స్ పోస్టులు 1 వరకు ఉన్నాయి. ఆసక్తి కలిగిన వారు ఎంప్లాయిమెంట్ మ్యాగజైన్‌లో ప్రకటన వెలువడిన తేదీ నుంచి 21 రోజుల్లోగా దరఖాస్తు చేసుకోవాలని స్కూల్ యాజమన్యం పేర్కొంది. ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునే అభ్యర్ధులు పోస్టును బట్టి.. డిప్లొమా, డిగ్రీ, పీజీ, బీఈడీ కోర్సుల్లో ఉత్తర్ణత పొంది ఉండాలి. ఆసక్తి కలిగిన వారు పూర్తి వివరాల కోసం అధికారిక వెబ్‌సైట్‌ను సంప్రదించవచ్చు.