AP 10th Public Exams 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. రేపట్నుంచి పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం

AP SSC 10th Class Public Exams 2026 Dates: రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ శ్రీనివాసుల రెడ్డి సోమవారం (నవంబర్‌ 10) విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 13 నుంచి పదో తరగతి విద్యార్ధులు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని..

AP 10th Public Exams 2026: పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల తేదీలు వచ్చేశాయ్.. రేపట్నుంచి పరీక్షల ఫీజు చెల్లింపులు ప్రారంభం
Andhra Pradesh 10th Class Public Examinations

Updated on: Nov 11, 2025 | 2:13 PM

అమరావతి, నవంబర్‌ 11: ఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర వ్యాప్తంగా 2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించి పదో తరగతి పబ్లిక్‌ పరీక్షల ఫీజు చెల్లింపుల షెడ్యూల్‌ను ప్రభుత్వ పరీక్షల డైరెక్టర్‌ శ్రీనివాసుల రెడ్డి సోమవారం (నవంబర్‌ 10) విడుదల చేశారు. తాజా షెడ్యూల్‌ ప్రకారం నవంబరు 13 నుంచి పదో తరగతి విద్యార్ధులు పరీక్షల ఫీజు చెల్లించవచ్చని పేర్కొన్నారు. రెగ్యులర్‌ విద్యార్థులతోపాటు గతంలో పదో తరగతి పరీక్షల్లో ఫెయిల్‌ అయిన విద్యార్థులు, ఒకేషనల్‌ విద్యార్థులు కూడా ఎలాంటి ఆలస్య రుసుము లేకుండా నవంబర్ 25వ తేదీ వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు. రూ.50 ఆలస్య రుసుముతో నవంబరు 26 నుంచి డిసెంబరు 3 వరకు ఫీజు చెల్లించడానికి అవకాశం కల్పించారు. రూ.200 ఆలస్య రుసుముతో డిసెంబరు 4 నుంచి 10 వరకు, రూ.500 ఆలస్య రుసుముతో డిసెంబరు 11 నుంచి 15 వరకు ఫీజు చెల్లింపులకు అవకాశం కల్పించారు.

విద్యార్ధులు చివరి తేదీ వరకు వేచిచూడకుండా ముందుగానే తాము చదువుతున్న పాఠశాలల్లోని ప్రిన్సిపల్‌లకు ఫీజు రుసుమును చెల్లించాలని పరీక్షల డైరెక్టర్‌ శ్రీనివాసుల రెడ్డి సూచించారు. ఈ మేరకు ప్రధానోపాధ్యాయులు ముందుగానే ఫీజు చెల్లించేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. రెగ్యులర్‌ విద్యార్థులు అన్ని సబ్జెక్టులకు కలిపి రూ.125 చెల్లిస్తే సరిపోతుందని స్పష్టం చేశారు. ఇక గతంలో ఫెయిల్‌ అయిన విద్యార్థులు 3 కంటే ఎక్కువ సబ్జెక్టులకు పరీక్ష రాయాలనుకుంటే రూ.125 చెల్లించాలి. ఒకటి నుంచి మూడు సబ్జెక్టుల వరకు అయితే రూ.110 చెల్లించాలి. ఒకేషనల్ విద్యార్థులు అదనంగా రూ.60 చెల్లించాలి. అలాగే వయసు నిర్ధారణ రుసుము కింద రూ.300 చెల్లించాల్సి ఉంటుంది.

ఒకవేళ పైన పేర్కొ న్న గడువు తేదీల్లో ఏవైనా ప్రభుత్వ సెలవు దినాలుగా ప్రకటిస్తే తర్వాతి పని దినాన్ని గడువు తేదీగా పరిగణించనున్నారు. విద్యార్ధులు చెల్లించిన ఫీజును అధికారిక వెబ్‌సైట్‌ ద్వారా ప్రిన్సిపల్స్‌ పాఠశాల లాగిన్‌ ద్వారా చెల్లించాలన్నారు. కాగా పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలు మార్చి 16 నుంచి ఏప్రిల్‌ 1వరకు నిర్వహించనున్నారు. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ ప్రభుత్వానికి ప్రతిపాదనలు పంపింది. ప్రభుత్వం నుంచి అనుమతి లభిస్తే త్వరలోనే టైం టేబుల్‌ కూడా విడుదల చేయనున్నారు.

మరిన్ని విద్యా, ఉద్యోగ కథనాల కోసం క్లిక్‌ చేయండి.